
హైదరాబాద్ కు నటుడు విజయ్ మృతదేహం
హైదరాబాద్ : నేపాల్ భూకంపంలో దుర్మరణం చెందిన 'ఎటకారం' నటుడు (25) విజయ్ మృతదేహం బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.
హైదరాబాద్ : నేపాల్ భూకంపంలో దుర్మరణం చెందిన 'ఎటకారం' నటుడు (25) విజయ్ మృతదేహం బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అనంతరం మృతదేహాన్ని విజయ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని బాపట్లకు తరిలిస్తారు. కాగా ఎటకారం చిత్రం షూటింగ్ ముగించుకుని వీరు తిరిగి వస్తుండగా భూకంపం వచ్చింది. దాంతో వీరు ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టడంతో విజయ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నిత్యపూజ కంబైన్స్ పతాకంపై వీరేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎటకారం' చిత్రానికి సంబంధించి పాటల షూటింగ్ కోసం గతవారం నేపాల్ వెళ్లిన యూనిట్ సభ్యులు అక్కడ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
కాగా విజయ్ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప తెలిపారు. ఇప్పటివరకు నేపాల్ నుంచి 93 మందిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు.