
శంషాబాద్: మూడంతస్తుల భవనంపై నుంచి కిందపడి ఓ ఎయిర్‌పోర్టు ఉద్యోగిని మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని ముదుళీ ప్రాంతానికి చెందిన సిమ్రాన్ (25) శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని కస్టమర్ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తోంది. మంగళవారం సాయంత్రం ఆమె తాను నివసిస్తున్న మూడంతస్తుల భవనం బాల్కనీ పైనుంచి కిందపడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది.
అయితే, సిమ్రాన్ ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ రెండు కూడా ఆన్‌లోనే ఉండటంతో చాటింగ్ చేస్తూ కిందపడిందా..? తానే దూకి ఆత్మహత్యకు పాల్పడిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆమె సోదరుడు మాలిక్ రెహాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.