హెచ్‌ఎండీఏ స్థలంలో ఉన్న రోడ్డును పరిశీలిస్తున్న మున్సిపల్ అధికారులు
సాక్షి, శంషాబాద్: కోట్లాది రూపాయలు విలువ చేసే భూముల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్‌ఎండీఏ స్థానిక అధికారుల తీరుపై రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో పాటు హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు శుక్రవారం ఆరా తీసినట్లు సమాచారం. ప్రైవేట్ వెంచరు పరిధిలోకి వెళ్లిన భూమి వివరాలను పూర్తిగా నివేదించాలని అధికారులను కోరినట్లు తెలిసింది.
పట్టణంలోని సర్వేనంబరు 626/1 ఉన్న హెచ్‌ఎండీఏకు 360 ఎకరాల భూమి ఉండగా అందులో పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ వెంచర్‌లో 5.15 ఎకరాల భూమి, రైతుల ఆధీనంలో మరో 6.29 ఎకరాల భూమి ఉన్నట్లు తాజాగా రెవిన్యూశాఖ చేపట్టిన సర్వేలో తేలింది. ఈ విషయమై శుక్రవారం ‘సాక్షి’ ‘ఆ స్థలం సర్కారుదే’ అన్న శీర్షికతో వచ్చిన కథనం అటు అధికార వర్గాల్లో.. ఇటు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
పరిశీలించిన అధికారులు
మున్సిపల్, రెవిన్యూ అధికారులు మరో మారు హెచ్‌ఎండీఏ స్థలాన్ని పరిశీలించారు. హెచ్‌ఎండీఏ స్థలంలో ఉన్న రహదారితో పాటు ఓ వ్యక్తికి సంబంధించిన ప్రహరీ, మరో వ్యక్తి ఇంటికి సంబంధించి ఓ పిల్లర్‌తో పాటు ఓ గది కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని హెచ్‌ఎండీఏ అధికారులకు వివరించారు. త్వరలో హెచ్‌ఎండీఏ అధికారులు పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ లేదా ఎదైనా ఇతర సరిహద్దులను ఏర్పాటు చేసి విలువైన స్థలాలను పరిరక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: ఐదుగురు పోలీసులపై వేటు తప్పదా..!)
Comments
Please login to add a commentAdd a comment