సాక్షి, రంగారెడ్డిజిల్లా: శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహానికి అంకురార్పణ జరిగింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తరలివచ్చే సందర్శకులను సమతామూర్తి ఆశీనులైన భద్రవేదికకు చేరుకునే ప్రధాన మార్గంలో ఏర్పాటు చేసిన 108 మెట్లలో మొదటి మెట్టు వరకు అనుమతించనున్నారు. అటు నుంచి యాగశాలకు ఆనుకుని ఉన్న ప్రవచన మండపానికి అనుమతించనున్నారు. ఇక్కడి నుంచే యాగశాలను దర్శించుకునేందుకు సందర్శకులకు అవకాశం కల్పిస్తారు.
భద్రవేదికపై ఆశీనులైన 216 అడుగుల ఎత్తైన భగవద్రామానుజాచార్యుల విగ్రహాన్ని ఈ నెల 5న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి మూడో అంతస్తుపై ఉన్న ప్రధాన విగ్రహం వరకు సందర్శకులను అనుమతించనున్నారు. భద్రవేదిక మొదటి అంతస్తులో ఉన్న 120 కేజీల సువర్ణమయ మూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 13న తొలి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి 54 అంగుళాలు ఉన్న సువర్ణమయ నిత్య ఉత్సవమూర్తిని వీక్షించేందుకు సందర్శకులకు అనుమతించనున్నారు. అప్పటి వరకు వీరంతా బయటి నుంచే వీక్షించి వెళ్లాల్సి ఉంది. అంతేకాదు ఈ ప్రాంగణంలోని 108 దివ్యదేశాల ఆలయాల్లో ప్రతిష్టించిన దేవతామూర్తుల విగ్రహాల వీక్షణ, ఆరాధనకు కూడా ఆ తర్వాతే అనుమతించనున్నారు. అప్పటి వరకు ఆయా ఉత్సవమూర్తులను బయటి నుంచే సందర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.
ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్
శ్రీరామానుజాచార్యల విగ్రహావిష్కరణకు ఈ నెల 5న ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ మంగళవారం శ్రీరామనగరాన్ని సందర్శించారు. రోడ్లు, విద్యుత్, మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్షించారు. ఆయా విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం ఆయన కేంద్ర భద్రతా బలగాలతో సమావేశం కానున్నారు.
ప్రారంభానికి ముందే అవస్థలు
ఇదిలా ఉంటే ఉత్సవాల ప్రారంభానికి ముందే రుత్వీకులు, వలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, సందర్శకులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంగణానికి 15 వేల మందికిపైగా చేరుకోగా, పూజా కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గ్రేటర్ జిల్లాల నుంచి రోజుకు సగటున 50 వేల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. వాలంటీర్లు, రుత్వీకులు, ప్రభుత్వ ఉద్యోగులను అంచనా వేయడంలో నిర్వాహకులు ఇప్పటికే కొంత విఫలమయ్యా రు. ఆయా నిష్పత్తి మేరకు అన్నప్రసాదాలను తయారు చేసినా వారికి అందజేయక పోవడంతో ఇక్కడికి వచ్చిన వారికి పస్తులు తప్పడం లేదు.
భారీ స్వాగత తోరణాలు
వేడుకలకు వచ్చే అతిథులకు ఆహ్వానం పలుకుతూ నిర్వాహకులు ఆయా మార్గాల్లో భారీ కటౌట్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ప్రధాన మార్గాలను సర్వంగసుందరంగా తీర్చిదిద్దా రు. అన్ని మార్గాల్లోనూ ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. (చదవండి: సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు)
Comments
Please login to add a commentAdd a comment