
సాక్షి, శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో శ్రీరామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలకు శ్రీరామనగరం తరలివెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ వేడుకలను దృష్టిలో ఉంచుకొని బస్సులను ఏర్పాటు చేయనున్నారు.
నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన భక్తులు ముచ్చింతల్‌కు రాకపోకలు సాగించేలా ఉదయం నుంచి రాత్రి వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. అన్ని రూట్‌లలో ఉదయం 6, 7, 8 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. (చదవండి: సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు)
బస్సుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులను ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేసేందుకు ముచ్చింతల్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ప్రయాణికుల రద్దీ మేరకు ప్రతి గంటకు ఒక బస్సు అందుబాటులో ఉండేవిధంగా ప్రణాళికలను సిద్ధం చేశారు.
పోలీసుల ఆధీనంలో ప్రధాన మార్గాలు
పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమీక్షించారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన పోలీసు అధికారులతో సమావేశయ్యారు. ఎవరెవరు? ఎక్కడెక్కడ? విధులు నిర్వహించనున్నారు? తదితర అంశాలపై సమీక్షించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మార్గం సహా బెంగళూరు జాతీయ రహదారి మార్గాలను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆయా మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ఎక్కడిక్కడ భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. (చదవండి: 7500 మంది పోలీసులతో భారీ బందోబస్తు)
Comments
Please login to add a commentAdd a comment