
సాక్షి, హైదరాబాద్: మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. ఈనెల 18న 2,427 బస్సులను నడపాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు 17వ తేదీ నుంచి 19 వరకు మూడు రోజుల పాటు ఈ బస్సులను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీశైలానికి 578 బస్సులు, వేములవాడకు 481, కీసరగుట్టకు 239, ఏడుపాయలకు 497, వేలాలకు 108, కాళేశ్వరానికి 51, కొమురవెల్లికి 52, కొండగట్టుకు 37, ఆలంపూర్‌కు 16, రామప్పకు 15, ఉమామహేశ్వరానికి మరో 14 ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్, తదితర ప్రాంతాల నుంచి శ్రీశైలం వరకు ఈ ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. వీటికి ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు.