TSRTC: రాఖీ పౌర్ణమికి 3 వేల ప్రత్యేక బస్సులు | Telangana: TSRTC Plans 3000 Special Buses For Rakhi Festival Across State - Sakshi
Sakshi News home page

TSRTC: రాఖీ పౌర్ణమికి 3 వేల ప్రత్యేక బస్సులు

Published Sat, Aug 26 2023 8:10 PM | Last Updated on Sun, Aug 27 2023 10:02 AM

TSRTC Plans 3 Thousand Special Buses For Rakhi Festival Across State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. రాఖీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ప్రత్యే బస్సులు నడపనున్నట్లు పేర్కొంది. ఈనెల 29, 30, 31 తేదీల్లో ప్రతి రోజు వెయ్యి బస్సుల చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాఖీ పౌర్ణమి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రాఖీ పౌర్ణమి ఏర్పాట్లపై టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.

సజ్జనార్‌ మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమికి హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌, నిజామాబాద్‌, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, గోదావరిఖని, మంచిర్యాల, తదితర రూట్‌లలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ బస్ స్టేషన్‌తోపాటు ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

గత ఏడాది ఆగస్టు 12న రాఖీ పండుగకు అధికారులు సమిష్టిగా పనిచేశారని గుర్తు చేశారు. ఫలితంగా ఒక్క రోజే రికార్డు స్థాయిలో 20 కోట్ల ఆదాయం సంస్థకు సమకూరిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక్క రోజులో ఇంతమొత్తంలో ఆదాయం రాలేదని చెప్పారు. గత ఏడాది స్పూర్తితో ఈ రాఖీ పౌర్ణమి నాడు కూడా అలానే పనిచేయాలన్నారు. టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సంస్థపై బాధ్యత మరింతగా పెరిగిందని, ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేసి సంస్థకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. 
చదవండి: అమిత్‌ షా ఖమ్మం పర్యటనలో మార్పులు

‘అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్‌. తమ సోదరులు జీవితాంతం తమకు రక్షగా ఉండాలని ఆ రోజున వారి చేతికి అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ముడిపడి ఉన్న ఈ పండుగ నాడు.. మహిళలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది రద్దీ దృష్ట్యా ఈ సారి రెగ్యూలర్‌ సర్వీసులకు తోడు 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

గత రాఖీ పౌర్ణమి రోజున అక్యూపెన్సీ రేషియో(ఓఆర్‌) 87 శాతంగా నమోదైంది. నల్లగొండ, మెదక్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ రీజియన్లు 90 శాతానికిపైగా ఓఆర్‌ సాధించాయి. 12 డిపోల్లో 100 శాతం ఓఆర్‌ నమోదైంది. గత రికార్డుల నేపథ్యంలోనే ఈ సారి ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది’ అని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ తెలిపారు. 

టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం www.tsrtconline.in వెబ్‌సైట్‌ ను సంప్రదించాలని సూచించారు. రాఖీ పౌర్ణమి ప్రత్యేక బస్సులకు సంబంధించిన మరింత సమాచారం కోసం సంస్థ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలన్నారు. 

పండుగ నాడు ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లి ఇబ్బందులకు గురికావొద్దని, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీస్‌, రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. 

ఈ సమావేశంలో జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌లు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్‌ కుమార్‌, కృష్ణకాంత్‌లతో పాటు హెచ్‌వోడీలు, ఆర్‌ఎంలు, డిప్యూటీ ఆర్‌ఎంలు, డీఎంలు, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement