హైదరాబాద్, సాక్షి: మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను దాదాపుగా తరలించిన నేపథ్యంలో.. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో.. సాధారణ ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. జాతర పూర్తయ్యే వరకు ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనసుతో సహకరించాలని కోరారాయన.
తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. రెగ్యులర్ సర్వీసులను తగ్గించడం జరిగింది. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనుసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి!!
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 20, 2024
తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ…
ఇదీ చదవండి: ఓవైపు బస్సుల్లేవ్.. మరోవైపు హౌజ్‌ఫుల్!!
అంతకు ముందు.. జాతర వెళ్లే భక్తులకు ఆర్టీసీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మేడారం వెళ్లే బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలకు అవకాశం లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. మూగజీవాలకు ఆర్టీసీ బస్సుల్లో ఎంట్రీ లేదన్నారాయన. అంతేకాదు.. గతంలో ఎప్పుడూలేని విధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని మేడారంలో 15 కిలో మీటర్ల మేర 48 క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేడారం జాతరలో 15వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment