
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా టీజీఎస్‌ఆర్టీసీ 6300 బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇదే సమయంలో స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉంటాయని బాంబు పేల్చారు.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘దసరా రద్దీ దృష్ట్యా 6300 బస్సులు నడుపుతున్నాం. మహాలక్ష్మి స్కీమ్ కింద మరో 600 బస్సులు అదనంగా నడిపిస్తున్నాం. స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉంటాయి. ఇప్పటికే కొన్ని బస్సులు నడుస్తున్నాయి. రేపటి నుంచి మొత్తం బస్సులు నడిపిస్తాం. ఈనెల 14వరకు అదనపు బస్సులు అందుబాటులో ఉంటాయి. దసరా పండుగ కాబట్టి రిటర్న్ జర్నీలో బస్సులు ఖాళీగా రావాల్సి ఉంటుంది.. కాబట్టి కొంత చార్జీలు పెంపు తప్పదు. మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలి అని చెప్పారు.
ఇక, దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి చాలా మంది తమ స్వగ్రామాలకు పయణమవుతున్నారు. విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవులు ఇవ్వడంతో వారంతా ముందుగానే ఇళ్లకు చేరుకున్నారు. రేపు సద్దుల బతుకమ్మ కావడంతో స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.