సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరుగనుంది. ఇక, ఈసారి మేడారం జాతర కోసం భక్తులు ఇప్పటి నుంచే పోటెత్తుతున్నారు. దీంతో, టీఎస్‌ఆర్టీసీ ప్రయాణీకుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇదే సమయంలో మేడారం జాతరకు కూడా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం అమలులో ఉంటుందని ఎండీ సజ్జనార్ తెలిపారు.
కాగా, తాజాగా సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ..‘మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. మేడారం జాతరలో 51 బేస్ పాయింట్లను ఏర్పాటు చేశాం. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్. ఖమ్మం జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఈ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో హనుమకొండ జిల్లా కాజీపేట నుంచి కూడా బస్సులను ఆపరేట్ చేస్తున్నాం. ఇక, మేడారం జాతరకు కూడా ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ అమల్లో ఉంటుంది. ఈనెల 18 నుంచి 25 వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించాం. ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు’ అని తెలిపారు.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నుంచి మేడారం వరకు మొత్తం 228 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఉ. 6.00, 6.30 గంటలకు జేబీఎస్ నుంచి, 7 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సులు బయలుదేరుతాయి. పెద్దలకు రూ. 750 చిన్నారులకు రూ. 450 టిక్కెట్ ధర నిర్ణయించారు. మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.00, 2.30, 3.00 గంటలకు బయలుదేరతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఇందులో రానుపోను టిక్కెట్ ఛార్జీ పెద్దలకు రూ.550, చిన్నారులకు రూ.310లు. సూపర్‌లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులను కూడా నడుపుతారు. వీటిల్లో ఉచిత ప్రయాణం లేదు. సూపర్ లగ్జరీలో టిక్కెట్ ధర పెద్దలకు రూ.750, చిన్నారులకు రూ.550, ఏసీ బస్సుల్లో పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750గా నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment