RGIA
-
శంషాబాద్‌లో ప్రైవేట్ జెట్ టెర్మినల్
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రైవేట్ జెట్ టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జీఎంఆర్ గ్రూప్ ప్రకటించింది. ప్రైవేట్ విమానాల యజమానులు, సెలబ్రిటీలు, ఇతర వ్యాపారులు వారి అవసరాల నిమిత్తం హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపింది. వీరి సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిందని చెప్పింది. వారి అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక జనరల్ ఏవియేషన్ టెర్మినల్‌ను ప్రారంభించినట్లు ఎయిర్పోర్ట్ నిర్వహణ సంస్థ జీఎంఆర్ పేర్కొంది.ఈ సందర్భంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈఓ ప్రదీప్ పనికర్ మాట్లాడుతూ..‘వ్యాపారం లేదా వ్యక్తిగత ప్రయాణాల కోసం చార్టర్డ్ విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ విమానాశ్రయం ద్వారా తరచూ ప్రయాణించే ప్రీమియం ప్యాసింజర్లకు విలాసవంతమైన అనుభవాన్ని అందించడంపై దృష్టి సారించాం. దేశంలో అత్యధిక నికర విలువ కలిగిన వ్యక్తుల (హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్) సంఖ్య పెరుగుతోంది. వీరు ప్రయాణ సమయాల్లో సాధారణ ప్రజలకంటే భిన్నంగా ప్రత్యేక సేవలు కోరుకుంటున్నారు. చాలామంది వ్యాపార కార్యకలాపాలు, వ్యక్తిగత జీవితాలు హైదరాబాద్‌తోపాటు దాని చుట్టు పక్కన ప్రాంతాలతో ముడిపడి ఉన్నాయి. దాంతో ధనవంతుల రాకపోకలు పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తున్నారు. వారికి అవసరాలు తీర్చేలా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జెట్ టెర్మినల్‌ను ప్రారంభించాం. దాంతో జీఎంఆర్ గ్రూప్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: మెరుగైన మౌలిక సదుపాయాలతో దేశం వృద్ధిహైదరాబాద్ ఇప్పటికే ఫార్మా రంగంలో దూసుకుపోతుంది. ఇక్కడ తయారైన ఫార్మా ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో బహుళజాతి సంస్థలు గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నారు. ఐటీ రంగంలో నగరం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నాయి. దాంతో వారి ప్రయాణాల సంఖ్య పెరుగుతోంది. -
శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయం దగ్గర ఆపరేషన్ చిరుత ఎట్టకేలకు సక్సెస్ అయ్యింది. బోను దాకా వచ్చి.. ఎరకు చిక్కకుండా ఐదు అటవీశాఖ అధికారుల్ని ముప్పు తిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. దీన్ని పట్టుకోవడానికి ఐదు బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేశారు.ఈ చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. జూలో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు తరలించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. -
హైదరాబాద్-దిల్లీ విమానాలు.. 29 ఆలస్యం.. 13 దారి మళ్లింపు.. కారణం తెలుసా..
హైదరాబాద్‌లో రెండు రోజుల నుంచి పొగమంచు కమ్మేస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈ కారణంగా రహదారులపై ప్రయాణాలు కొంత కష్టంగా మారాయి. మరోవైపు విమానాశ్రయంలో కొద్ది మీటర్ల దూరంలోనే ఉన్న వస్తువులు కూడా కనిపించనంత దట్టంగా పొగమంచు కమ్ముకుంటుంది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఇక్కడ రన్‌వేపై విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. అత్యవసరంగా టేకాఫ్ కావాల్సిన విమానాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) ద్వారా ప్రయాణం సాగిస్తున్న పలు విమానాలను దారి మళ్లించారు. గడిచిన రెండురోజుల్లో హైదరాబాద్-దిల్లీ మధ్య ప్రయాణాలు సాగిస్తున్న 29 విమానాల ప్రయాణ సమయంలో అంతరాయం ఏర్పడినట్లు తెలిసింది. జనవరి 14న 14 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 6 విమానాలను ఆర్‌జేఐఏ నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయ అధికారులు తెలిపారు. జనవరి 15న 15 విమానాల ప్రయాణం ఆలస్యం అయింది. ఏడు విమానాలను హైదరాబాద్ విమానాశ్రయానికి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నాలుగు విమానాలు, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రెండు, దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక విమానంను సంబంధిత అధికారులు దారి మళ్లించారు. ఇదీ చదవండి: భారత్‌కు మద్దతుగా నిలిస్తే.. రాజకీయంగా చూస్తున్నారు - సీఈఓ రానున్న 4-5 రోజుల పాటు నార్త్ ఇండియాలో దట్టమైన పొగమంచు ఏర్పడే పరిస్థితులు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. దాంతో ఈ పరిస్థితులు మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాబట్టి ప్రయాణికులు సంబంధిత ఎయిర్‌లైన్స్ ద్వారా పూర్తి సమాచారాన్ని ముందుగానే ధ్రువీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఎయిర్‌పోర్టులో దుమ్మురేపుతున్న దోస్తులు, ఫ్యామిలీ మెంబర్స్, ప్లీజ్ రావొద్దు!
శంషాబాద్: ప్రయాణికుల స్వాగత, వీడ్కోలు జరిగే సమయాల్లో అత్యధికమంది రావడంతో ఎయిర్‌పోర్టు పరిసరాల్లో పార్కింగ్, రద్దీ పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఎయిర్‌పోర్టు వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఇటీవల విదేశాలకు వెళుతున్న విద్యార్థుల వెంట పరిమితికి మించి పెద్దఎత్తున స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల రాకతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సుఖవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులు, వారి కుటుంబసభ్యులు సహకరించాలన్నారు. -
మద్యం మత్తులో కార్మికుడి మృతి
శంషాబాద్: మద్యం మత్తులో ఓ యువకుడు మరో వ్యక్తిని హత్య చేసిన ఘటన ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలుకూరు గ్రామానికి చెందిన మల్లేష్ (25) ఆటో డ్రైవింగ్ చేస్తూ శంషాబాద్ పట్టణంలోని సిద్ధంతిలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం కాటేదాన్ వైన్స్‌లో మద్యం సేవిస్తున్న సమయంలో గగన్‌పహాడ్ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్న బిహార్‌కు చెందిన జబారత్ (29) పరిచయం కాగా ఇరువురు కలిసి మరోసారి మద్యం తాగేందుకు గగన్‌పహాడ్‌లోని అప్పా చెరువు సమీపంలోని శిథిల భవనం వద్దకు వచ్చారు.మద్యం సేవించిన అనంతరం ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి మల్లేష్ బండరాయితో జబారత్ తలపై మోదగా తీవ్రంగా గాయపడ్డ జబారత్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు ఆర్జీఐఏ పోలీస్‌సేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపి లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 12 కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ తీవ్రత ఉన్న దేశాల నుంచి వచ్చిన ముగ్గురికి, తీవ్రత లేని దేశాల నుంచి వచ్చిన తొమ్మిది మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం పేర్కొంది. తాజాగా నమోదైన 12 కేసులతో తెలంగాణ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య 52కు చేరింది. మరోవైపు కరోనా కేసులు సంఖ్య కూడా పెరుగుతోంది. శనివారం కొత్తగా 317 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యశాఖ పేర్కొంది. -
మరో ఘనతను సాధించిన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం..!
శంషాబాద్: పర్యావరణ హితమైన కార్యకలాపాలతో ఇప్పటికే మూడుసార్లు గ్రీన్ ఎయిర్‌పోర్టు విభాగంలో అవార్డు దక్కించుకున్న జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(గెయిల్).. మరోసారి ఘనత సాధించింది. ఆసియా పసిఫిక్ విభాగంలో ఏటా 25 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విమానాశ్రయాల కేటగిరీలో జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయానికి గ్రీన్ ఎయిర్‌పోర్టు గోల్డెన్ అవార్డును అంతర్జాతీయ విమా నాశ్రయ మండలి అందజేసిందని ఎయిర్‌పోర్టు వర్గాలు గురువారం వెల్లడించాయి. విమానాశ్రయం పరిసరాల్లో వాయు నాణ్యత మెరుగుపర్చడం, సౌరశక్తి వినియోగం, ఇంధ నాన్ని ఆదా చేయడం, వాయు ఉద్గారాలను తగ్గించేందుకు తీసుకున్న చర్యల ఆధారంగా ఈ అవార్డును మరోసారి సొంతం చేసుకున్న ట్లు గెయిల్ సీఈఓ ప్రదీప్ ఫణీకర్ తెలిపారు. -
చిరుత కాదు.. అడవి పిల్లులే
సాక్షి,/హైదరాబాద్/శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో చిరుతపులి సంచరించిన ఆనవాళ్లు లేవని, చుట్టుపక్కల ప్రజలు, విమానాశ్రయ సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని అటవీ శాఖ స్పష్టం చేసింది. కెమెరాల్లో కేవలం ఊర కుక్కలు, అడవి పిల్లులు, పందులు మాత్రమే కనిపించాయన్నారు. చిరుతపులి కదలికలున్నాయని, అడవి పందులను చంపుతోందని విమానాశ్రయం అధికారుల ఫిర్యాదుతో వాటిని పరిశీలించగా వాటిని కుక్కలు చంపినట్లుగా ఆధారాలు లభించినట్టు పేర్కొంది. అధికారులు విజ్ఞప్తితో ముందు జాగ్రత్తగా 10 ట్రాప్ కెమెరాలు కూడా పెట్టగా, వాటిలో చిరుతపులి కదలికలేవీ కనిపించలేదని తెలిపింది. విమానాశ్రయం ప్రహరీ దూకినట్లుగా గతంలో సీసీ కెమెరాలకు లభించిన ఆధారాలు సివిట్ క్యాట్ వి (మానుపిల్లి) అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎయిర్‌పోర్టు అధికారుల విజ్ఞప్తి మేరకు మరొక 10 ట్రాప్ కెమెరాలు, (మొత్తం 20), రెండు బోనులు (ట్రాప్ కేజెస్) కూడా పెట్టినట్టు తెలియజేశారు. (చదవండి: అది చిరుతేనా?) -
చాటింగ్ చేస్తూ... భవనంపై నుంచి పడి..
శంషాబాద్: మూడంతస్తుల భవనంపై నుంచి కిందపడి ఓ ఎయిర్‌పోర్టు ఉద్యోగిని మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని ముదుళీ ప్రాంతానికి చెందిన సిమ్రాన్ (25) శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని కస్టమర్ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తోంది. మంగళవారం సాయంత్రం ఆమె తాను నివసిస్తున్న మూడంతస్తుల భవనం బాల్కనీ పైనుంచి కిందపడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అయితే, సిమ్రాన్ ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ రెండు కూడా ఆన్‌లోనే ఉండటంతో చాటింగ్ చేస్తూ కిందపడిందా..? తానే దూకి ఆత్మహత్యకు పాల్పడిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆమె సోదరుడు మాలిక్ రెహాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఆర్జీఐఏ)లో డొమెస్టిక్ ప్రయాణికుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫేషియల్ రికగ్నిషన్ (ఎఫ్ఆర్) ట్రయల్ రన్ విజయవంతమైంది. ఒకసారి ముఖకవళికలు నమోదు చేసుకున్న ప్రయాణికులు.. ఆ తర్వాత ఎలాంటి తనిఖీలు లేకుండా తమ ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించేందుకు వీలుగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. జూలైలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ట్రయల్ రన్లో భాగంగా 3,000 మంది ముఖకవళికలను నమోదు చేయాలని అధికారులు భావించారు. కానీ ఈ సంఖ్య 4,198కి చేరుకుంది. అనుకున్న దానికన్నా 40శాతం మంది ప్రయాణికులు అధికంగా తమ ముఖకవళికలను నమోదు చేసుకున్నట్లు జీఎమ్మార్ అధికారులు తెలిపారు. సినీ నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రాంచరణ్, అఖిల్, సమంత తదితరులు ఎఫ్ఆర్లో తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సైతం తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఇలా నమోదు చేకున్న వారంతా ఈ నెల 17 నాటికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు 6వేల సార్లు ప్రయాణం చేశారు. వీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ–గేట్ల ద్వారా ఎలాంటి తనిఖీలు లేకుండా వారు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ‘డిజియాత్ర’కు మార్గం సుగమం... సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందజేసేందుకు కేంద్రం ‘డిజియాత్ర’ చేపట్టిన విషయం విదితమే. ఒకసారి తమ పూర్తి వివరాలను, ముఖకవళికలను విమానాశ్రయ భద్రతా సిబ్బంది వద్ద నమోదు చేసుకున్నవారు పదే పదే ఆ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా ఫేషియల్ రికగ్నిషన్ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని ఆర్జీఐఏలో జూలైలో ప్రారంభించి, ప్రయాణికులు వివరాలు నమోదు చేయిచుకునేందుకు ఎయిర్‌పోర్టులోని 1, 3 డొమెస్టిక్ డిపార్చర్ గేట్ల వద్ద ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎఫ్ఆర్లో భాగంగా ప్రయాణికుల గుర్తింపుకార్డు, కాంటాక్ట్ వివరాలను నమోదు చేశారు. ఆ తర్వాత ప్రయాణికుల ముఖాలను ఫొటో తీశారు. సీఐఎస్ఎఫ్ భద్రతా అధికారులు ప్రయాణికుల నుంచి సేకరించిన వివరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఒక యూనిక్ డిజియాత్ర ఐడీని కేటాయించారు. ఈ ఐడీలపై ఇప్పటి వరకు ప్రయాణికులు 6వేల సార్లు ప్రయాణం చేసినట్లు అధికారులు తెలిపారు. కేంద్రం అనుమతిస్తే అందరికీ... ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు వివరాలను కేంద్ర విమానయాన శాఖ పరిశీలనకు పంపించారు. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో కేంద్రం అనుమతిస్తే ప్రయాణికులందరికీ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధంగా ఉంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రతిరోజు సుమారు 55వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నై, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాలకు ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల మధ్య రెగ్యులర్‌గా రాకపోకలు సాగించేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరంతా ఒక్కసారి ఫేషియల్ రికగ్నీషన్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకుంటే... ఆ తర్వాత ప్రయాణంలో ఎలాంటి తనిఖీలు లేకుండా హాయిగా సాగిపోవచ్చు. కేవలం హ్యాండ్‌బ్యాగ్ ద్వారా వెళ్లేవాళ్లకు ఇదిఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈసదుపాయం ప్రయాణికులందరికీఅందుబాటులోకి రావాలంటే కేంద్రంగ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. -
ప్రపంచంలోనే మూడో స్థానం
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఆర్జీఐఏ) ప్రయాణికుల వృద్ధి రేటులో దూసుకెళ్తోంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలోఈ మేరకు వెల్లడైంది. గతేడాది నాటికి సుమారు 1.5 కోట్ల మందికి పైగా ప్రయాణికులతో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల జాబితాలో బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయం తొలి స్థానంలో నిలవగా.. టర్కీలోని అంటాలె అంతర్జాతీయ విమానాశ్రయం రెండో స్థానంలో ఉంది. ఇక శంషాబాద్ విమానాశ్రయం మూడో స్థానం దక్కించుకుంది. అదే విధంగా మన దేశంలో రెండో స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 21.9 శాతం వృద్ధి రేటు సాధించడం విశేషం. హైదరాబాద్ విమానాశ్రయం తర్వాత రష్యా ఫెడరేషన్‌లోని నుకోవ్ ఎయిర్‌పోర్టు, చైనాలోని జినాన్ ఉన్నాయి. ప్రపంచంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య డెస్టినేషన్–టూరిస్టు ప్రదేశంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రముఖ కేంద్రంగా మారుతోందని ఈ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి 29 ఎయిర్‌లైన్స్ దేశీయంగా, అంతర్జాతీయంగా 69 ప్రదేశాలకు విమానాలను నడుపుతున్నాయి. 2015–2019 మధ్య కాలంలో ఏటా సుమారు 20 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇక్కడి నుంచి ప్రతిరోజు 60వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. 500కు పైగా విమానాలు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు అందుబాటులో ఉన్నాయి. గతేడాదిలో ఇక్కడి నుంచి అత్యధిక మంది అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, థాయ్‌లాండ్‌లకు వెళ్లగా... దేశీయంగా ఇక్కడి ప్రయాణికులు ప్రధానంగా ఢిల్లీ, ముంబై, బెంగళూర్, కోల్‌కతా, చెన్నైలకు ఎక్కువగా పయనిస్తున్నారు. విజయవంతంగా ఫేస్ రికగ్నేషన్.. డిజియాత్ర పథకంలో భాగంగా జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవల ప్రారంభించిన ఫేస్ రికగ్నేషన్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. దీంతో ముఖకవళికల నమోదు ఆధారంగా ప్రయాణికుల తనిఖీని సులభతరం చేసిన మొట్టమొదటి ఎయిర్‌పోర్టుగా నిలిచింది. అలాగే దేశీయ ప్రయాణికులకు ఈ–బోర్డింగ్ సదుపాయాన్ని కల్పించింది. బ్యాగ్ ట్యాగ్‌లను తొలగించిన మొట్టమొదటి విమానాశ్రయం కూడా హైదరాబాద్ కావడం గమనార్హం. కేవలం హ్యాండ్ బ్యాగేజ్‌తో వచ్చే వారి కోసం ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ చెకిన్ ప్రవేశపెట్టారు. -
ఎగిరిపోతే ఎంత బావుంటుంది!
సాక్షి, హైదరాబాద్: కారు, బస్సు, రైలు.. ఇవేవీ కాదు. విమానయానానికే ప్రయాణికులు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఎగిరిపోతేనే ప్రయాణం బావుంటుందని భావిస్తున్నారు. గగనయానమే బెస్ట్ అని విమానాలు అలవోకగా ఎక్కి దిగేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. 2018–19లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్యలో 20% వృద్ధి నమోదు కావడం విశేషం. విమానాల రాకపోకలు తెలిపే ఎయిర్ ట్రాఫిక్ మూవ్మెంట్ (ఏటీఎం)తోపాటు కార్గో ట్రాఫిక్, ఎయిర్ రూట్ కనెక్టివిటీలోనూ ఆర్జీఐఏ దూసుకెళ్తోంది. ఫ్లైనాస్ సంస్థ హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియాకు నేరుగా సర్వీసులు నడుపుతుండగా.. స్పైస్‌జెట్ సంస్థ బ్యాంకాక్‌కు ప్రతిరోజూ విమానం సర్వీసు అందిస్తోంది. ఇక ప్రభుత్వ ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్సీఎస్) కింద హైదరాబాద్ నుంచి హుబ్లీ, కొల్హాపూర్, నాసిక్‌తోపాటు అమృత్సర్, వడోదర, పోర్ట్‌బ్లెయిర్, ఉదయ్‌పూర్, డెహ్రాడూన్, ఇంఫాల్, కన్నూర్, భోపాల్ నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ మీదుగా 18 అంతర్జాతీయ సర్వీసులు.. దేశంలోని 48 నగరాలను కలుపుతూ దేశీయ సర్వీసులు ఆర్జీఐఏ విమానాశ్రయం ద్వారా అందుబాటులో ఉన్నాయి. తాజాగా వెలువడిన సామాజిక ఆర్థిక సర్వే–2019లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. విమాన సేవల్లో శంషాబాద్ విమానాశ్రయం దక్షిణమధ్య భారతావనికి ముఖద్వారంగా అవతరించిందని సర్వే అభిప్రాయపడింది. ఆర్జీఐఏ మరికొన్ని ఘనతలివీ.. 2017–18లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి 1.32 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా.. 2018–19లో ఆ సంఖ్య 1.58 కోట్లకు చేరింది. 2017–18లో 1.05 కోట్ల మంది దేశీయ ప్రయాణాలు చేయగా.. 2018–19లో 22 % వృద్ధి నమోదై వారి సంఖ్య 1.29 కోట్లకు చేరింది. 2017–18లో 26.7 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులకు సేవలందించగా.. 2018–19లో ఆ సంఖ్య 29.6 లక్షలకు చేరి 11% పెరుగుదల రికార్డయింది. 2017–18లో 1,08,773 విమానాలు శంషాబాద్ నుంచి రాకపోకలు సాగించగా.. 2018–19లో 23% పురోగతి తో ఆ సంఖ్య 1,33,755కు చేరుకుంది. 2017–18లో 1,03,120 మెట్రిక్ టన్నుల రవాణా జరగ్గా.. 2018–19లో 8% వృద్ధి నమోదై 1,33,775 మెట్రిక్ టన్నులకు పెరిగింది. -
ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాల పేరుతో మోసం
శంషాబాద్: ఉద్యోగం సంపాదించుకోవడంలో విఫలమైన ఓ నిరుద్యోగి తానే ముఠా ఏర్పాటు చేసి పలువురు నిరుద్యోగులను మోసం చేసిన సంఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. గురువారం శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లోగిరి సంతోష్‌కుమార్ రెండేళ్ల క్రితం నగరంలోని ఓ ఏవియేషన్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. ఏడాది క్రితం ఎమిరెట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగానికి గాను ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఉద్యోగం రాకపోవడంతో తనలాగే ఉద్యోగాల కోసం వచ్చి తిరస్కరణకు గురవుతున్న వారిని గుర్తించిన అతను మోసాలకు పథకం పన్నాడు. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్టు మాజీ ఉద్యోగి మహంతి రాంకు మార్తో జత కలిశాడు. అనంతరం మల్టీమీడి యా నిపుణుడైన తన బావమరిది నారాయణతో కలిసి ఎమిరెట్స్ ఎయిర్‌లైన్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా నకిలీ ఐడీ కార్డులు తయారు చేయించుకున్నాడు. వీరికి ఎల్బీస్టేడియం సమీపంలోని ఎయిర్వై ఏవియేషన్ అకాడమిలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ ఖాదిర్ జతకలిశాడు. నకిలీ ఐడీ కార్డులను కలర్ జిరాక్స్ తీయడం వంటి పనులకు మీర్‌పేట్‌కు చెందిన బూర్గుల పాండు సహకరించేవాడు. వీరు ఐదుగురు ఎయిర్‌పోర్టు సమీపంలోని తుక్కుగూడ వద్ద కార్యాలయం తెరిచారు. నిరుద్యోగులను అక్కడికే రప్పించి ఇంటర్వ్యూలు నిర్వహించి నకిలీ ఐడీ కార్డులతో పాటు నకిలీ ఎయిర్‌పోర్టు ఎంట్రీ పాసులను కూడా తయారు చేసి ఇచ్చేవారు. ఇందుకుగాను ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసేవారు. గత ఆగస్టులో బార్కాస్‌కు చెందిన ఖాలిద్ మహ్మద్ ఖాన్ కూడా వీరి వద్ద ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అతడికి నకిలీ ఎయిర్‌పోర్టు ఎంట్రీ పాస్ ఇచ్చారు. దీనిని గుర్తించిన ఖాలిద్ ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీ సులు ముఠా గుట్టును రట్టు చేశారు. నిందితుల బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. ఐదు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్, రెండు ల్యాప్‌టాప్‌లు, కారుతో పాటు నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు ఛేదించడంలో కీలక పా త్ర పోషించిన ఏసీపీ అశోక్‌కుమార్, సీఐ రామకృష్ణతో పాటు ఎస్సైలను డీసీపీ అభినందించారు. -
శంషాబాద్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. బుధవారం ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్, డీఆర్ఐ అధికారులు 6.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే సౌది ఎయిర్‌లైన్స్ విమానంలో జెడ్డా నుంచి వచ్చిన 14 మందిని అదుపలోకి తీసుకున్నారు. అయితే దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డవారిని పాతబస్తీకి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. అయితే తమను జెడ్డాలోని గోల్డ్ స్మగ్లింగ్ ముఠా సభ్యులు బెదిరించడం వల్లనే ఇలా చేయాల్సి వచ్చిందని నిందితులు పోలీసుల ముందు వారి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేమంతా ఉమ్రా యాత్రకు వెళ్లగా.. అక్కడ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా సభ్యులు వేధింపులకు గురిచేశారు. మాకు బంగారం ఇచ్చి.. దానిని హైదరాబాద్‌లో ఇవ్వాల్సిందిగా ఆదేశింశారు. లేకపోతే అక్రమంగా ఉమ్రా యాత్రకు వచ్చారని స్థానిక పోలీసులకు పట్టిస్తామని వాళ్లు బెదిరింపులకు దిగారు. అందుకు భయపడి బంగారాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చామ’ని నిందితులు పోలీసులకు వివరించారు. మరోవైపు వీరి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2.17 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. -
5 నుంచి రోడ్డెక్కనున్న ‘విద్యుత్’ బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో నూటికి నూరు శాతం విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రిక్ బస్సులు మరో రెండు రోజుల్లో రోడ్డెక్కనున్నాయి. ఏమాత్రం కాలుష్యం వెదజల్లకపోవడం ఈ బస్సుల ప్రత్యేకత. ఈ బస్సులను గ్రేటర్ పరిధిలో ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదట మియాపూర్ డిపో నుంచి 20 బస్సులను, ఆ తరువాత కంటోన్మెంట్ డిపో నుంచి మరో 20 బస్సులను ప్రవేశపెట్టనుంది. ఈ నెల 5న ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టింది. ఎలక్ట్రిక్ బస్సులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించనున్నాయి. ఈ మేరకు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, సిద్ధార్ధ, డీవైడీ సంస్థలతో కూడిన కన్సార్షియంతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 12 సంవత్సరాలపాటు అమల్లో ఉంటుంది. ఒప్పందం మేరకు బస్సుల నిర్వహణ పూర్తిగా కన్సార్షియం పరిధిలో ఉంటుంది. ఈ బస్సులను కన్సార్షియం డ్రైవర్లే నడుపుతారు. విద్యుత్ చార్జింగ్ మాత్రం ఆర్టీసీ డిపోల నుంచి అందజేస్తారు. ఈ బస్సులకు కిలోమీటర్‌కు రూ. 36 చొప్పున ఆర్టీసీ చెల్లించనుంది. జేఎన్టీయూ, కూకట్పల్లి, హరిత ప్లాజా, మైత్రీవనం, మెహదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, ఆరాంఘర్ తదితర ప్రాంతాల మీదుగా ఈ బస్సులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తాయి. కంటోన్మెంట్ డిపో నుంచి నడిచే బస్సులు సికింద్రాబాద్, జూబ్లీ బస్‌స్టేషన్, సంగీత్ చౌరస్తా, తార్నాక, ఉప్పల్, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్తాయి. ఒకసారి చార్జింగ్ చేస్తే తిరిగే దూరం: 250-300 కి.మీ. ఒక కిలోమీటర్‌కు ఆర్టీసీ చెల్లించనున్న మొత్తం: రూ. 36 వీడిన పీటముడి.... హైదరాబాద్‌లో బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం గత సంవత్సరమే ప్రణాళికలు రూపొందించింది. విశ్వనగర ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక సదుపాయంగల రవాణా సదుపాయాలను ప్రతిపాదించారు. అద్దె ప్రాతిపదికన బస్సులు నడిపేందుకు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ముందుకు వచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లోనే 5 బస్సులను విడుదల చేశారు. కానీ అప్పటికి ఇంకా ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకోలేదు. కన్సార్షియంలోని వివిధ సంస్థల మధ్య అవగాహన కుదరకపోవడం వల్ల ఆర్టీసీతో ఒప్పందం వాయిదా పడింది. దీంతో నగరంలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రాజెక్టుపై పీటముడి ఏర్పడింది. అప్పటి వరకు వివిధ డిపోల నుంచి ఈ బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్ధం చేసిన ఆర్టీసీ సైతం గందరగోళంలో పడిపోయింది. చివరకు కన్సార్షియంలోని మూడు భాగస్వామ్య సంస్థలైన సిద్ధార్ధ, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, చైనాకు చెందిన డీవైడీ సంస్థలు పరస్పర అవగాహనకు రావడంతో ఆర్టీసీతో ఒప్పందానికి మార్గం సుగమమైంది. ఈ బస్సులపై కన్సార్షియంతోపాటు ఆర్టీసీ యాజమాన్యానికీ హక్కు ఉంటుంది. రవ్వంత కాలుష్యానికి సైతం అవకాశం లేకుండా విద్యుత్‌తో నడిచే ఈ బస్సులను ఒకసారి చార్జింగ్ చేస్తే 250 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల వరకు రాకపోకలు సాగిస్తాయి. ఇప్పుడు ఉన్న మెట్రో లగ్జరీ బస్సుల స్థానంలో ఈ అత్యాధునిక బస్సులను నడుపుతారు. పూర్తయిన డ్రైవర్ల శిక్షణ... ఎలక్ట్రిక్ బస్సులను నడిపే డ్రైవర్లకు ఆర్టీసీ ప్రత్యేక శిక్షణనిచ్చింది. బస్సులు నడిపేటప్పుడు మెళకువలు పాటించడంతోపాటు టికెట్ ఇష్యూ మిషన్ల వినియోగం, ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యహరించడం వంటి అంశాలపై శిక్షణనిచ్చారు. ప్రస్తుతం మియాపూర్ డిపో నుంచి ప్రారంభం కానున్న ఈ బస్సుల కోసం ఆ డిపోలో ఒక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు 12 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ డిపోలో కొత్త ట్రాన్స్ఫార్మర్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇంకా చార్జింగ్ పాయింట్ల ఏర్పాటు పూర్తి కాలేదు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇచ్చి ఆ డిపో నుంచి మరో 20 బస్సులను నడుపుతారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను కమ్మేసిన పొగమంచు
సాక్షి, హైదరాబాద్: పెథాయ్ ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్ నగర శివార్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నుడుస్తున్నాయి. మరికొన్నింటిని బెంగళూరుకు మళ్లించారు. -
పసిడికి హెన్నా టచ్!
సాక్షి, హైదరాబాద్ : కడ్డీలు.. బిస్కట్లు.. వివిధ వస్తువుల రూపంలో ఇప్పటి వరకూ పసిడి స్మగ్లింగ్‌కు పాల్పడిన ముఠాలు.. తాజాగా హెన్నా(మెహెందీ పొడి)తో బంగారాన్ని కలిపి, పేస్ట్‌లా మార్చి అక్రమ రవాణా చేసేస్తున్నాయి. ఈ గోల్డ్ పేస్ట్ స్మగ్లింగ్ కోసం శ్రీలంక రాజధాని కొలంబో నుంచి వచ్చిన ‘ఇంటర్నేషనల్–డొమెస్టిక్’ఫ్లైట్‌ను స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పేస్ట్ రూపంలో తీసుకువచ్చిన బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. దీన్ని తీసుకువచ్చిన చెన్నై వాసిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొలంబో నుంచి నగరానికి.. కొలంబోకు చెందిన సూత్రధారులు 1,150 గ్రాముల బంగారాన్ని మెత్తని పొడిగా చేశారు. ఆ పొడి కూడా బంగారం రంగులోనే ఉండటంతో పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బంగారం పొడిని గోధుమ రంగులో ఉండే హెన్నాలో కలిపేశారు. 1,120 గ్రాముల బంగారం పొడిలో 730 గ్రాముల హెన్నాను కలిపారు. పౌడర్ రూపంలోకి మారిన బంగారం, హెన్నా మిక్స్‌ను పేస్ట్‌గా మార్చడానికి చెక్లెట్ తయారీకి వినియోగించే లిక్విడ్స్ వాడారు. ఇలా తయారైన గోధుమ రంగు పేస్ట్‌ను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసిన స్మగ్లర్లు.. దాన్ని బ్రౌన్ కవర్లలో ఉంచి పైన ప్లాస్టర్లు వేశారు. ఇలా తయారు చేసిన 1,850 గ్రాముల బరువున్న 2 ప్యాకెట్లను ‘ఇంటర్నేషనల్–డొమెస్టిక్’పంథాలో శంషాబాద్‌కు పంపారు. చేతికి పసిడి అంటకుండా.. విమానంలో సీట్లు బుక్ చేసుకోవడంలో తెలివిగా వ్యవహరించిన ఈ వ్యవస్థీకృత ముఠా ‘చేతికి పసిడి’అంటకుండా పని పూర్తి చేయడానికి పథకం వేసింది. అంతర్జాతీయ సర్వీసుల్ని నడిపే అన్ని విమానయాన సంస్థలూ మార్గ మధ్యలో దేశవాళీ సర్వీసుగా మార్పును ప్రోత్సహించవు. కొన్ని మాత్రమే ఈ విధానాన్ని అవలంభిస్తున్నాయి. స్పైస్ జెట్‌కు చెందిన ఎస్జీ–1314 విమానం కొలంబో–హైదరాబాద్ మధ్య నడుస్తుంది. ఇది కొలంబోలో అంతర్జాతీయ సర్వీసుగా మొదలై మధురై వచ్చిన తర్వాత దేశవాళీ సర్వీసుగా మారుతుంది. డొమెస్టిక్ ట్రావెల్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న, అప్పటికప్పుడు కొనుగోలు చేసిన ప్రయాణికులను అంతర్జాతీయ ప్రయాణికులతో కలిపి గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఈ ఎయిర్‌లైన్స్ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకునే సమయంలో కల్పిస్తున్న మరో సౌకర్యాన్ని స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పసిడి ప్యాకెట్లను సీటు కిందే వదిలి.. కొలంబో నుంచి రెండు ‘గోల్డ్ పేస్ట్’ప్యాకెట్లను తీసుకుని ఓ స్మగ్లర్ మధురై వరకు వచ్చాడు. పసిడి ప్యాకెట్లు ఉన్న హ్యాండ్ బ్యాగేజ్‌ను తన సీటు కిందే వదిలి అంతర్జాతీయ ప్రయాణికుడిగా విమానం దిగి కస్టమ్స్ తనిఖీలు పూర్తి చేసుకుని బయటకు వెళ్లిపోయాడు. స్మగ్లింగ్ ముఠాలో పాత్రధారిగా ఉన్న చెన్నైకు చెందిన మరో వ్యక్తి హైదరాబాద్‌కు వచ్చే డొమెస్టిక్ ప్యాసింజర్‌గా అదే విమానం ఎక్కాడు. ఇతగాడు కొలంబో నుంచి వచ్చిన వ్యక్తి కూర్చున్న సీటులోనే కూర్చున్నాడు. విమానం హైదరాబాద్ చేరేసరికి ఈ చెన్నై వాసి దేశవాళీ ప్రయాణికుడే కావడం తో కస్టమ్స్ తనిఖీలూ లేకుండా హ్యాండ్ బ్యాగేజ్‌తో విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేయవచ్చు. ప్రత్యేక బృందం కాపు కాసి.. ఈ విమానం శనివారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయం చేరే వరకు అంతా స్మగ్లర్లు అనుకున్న ప్రకారమే జరిగింది. అయితే ఈ వ్యవహారంపై డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్‌కు ఉప్పందడంతో ఓ ప్రత్యేక బృందం విమానాశ్రయంలో కాపుకాసింది. ఫ్లైట్ దిగి హ్యాండ్ బ్యాగేజ్‌తో ఎరైవింగ్ హాల్ వైపు వెళ్తున్న చెన్నై వాసిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేసింది. రెండు ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని విచారించిన నేపథ్యంలో సూత్రధారులెవరో తనకు తెలియదని, కమీషన్ తీసుకుని పని చేసే తాను మధురై నుంచి హైదరాబాద్ చేరుస్తానని, ముఠాకు చెందిన రిసీవర్లే తన వద్దకు వచ్చి ప్యాకెట్లు తీసుకువెళ్తారని తెలిపాడు. ఇతడి వద్ద లభించిన రెండు ప్యాకెట్లలోని 1,850 గ్రాముల పేస్ట్‌ను ఓ గిన్నెలో వేసి కిరోసిన్ పోసి నిప్పుపెట్టగా అది పొడిగా మారింది. ఈ పొడిని కొలిమిలో కరిగించగా.. 1,120.78 గ్రాముల బంగారు బిస్కెట్ తయారైంది. దీని విలువ మార్కెట్లో రూ.34,57,606 ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఈ తరహా ‘గోల్డ్ పేస్ట్’కేసు హైదరాబాద్‌లో చిక్కడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు.. ఈ కేసును అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. కొన్ని విమానయాన సంస్థలు టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునేప్పుడు ‘చూజ్ యువర్ సీట్’పేరుతో ప్రయాణికుడు తమకు అనువైన సీటును ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. దీన్నే స్మగ్లింగ్ గ్యాంగ్స్ తమకు అనువుగా మార్చుకుంటున్నాయని తేలింది. కొలంబో నుంచి మదురై, మదురై నుంచి హైదరాబాద్ రావడానికి ముఠా సభ్యుల కోసం నిర్ణీత సమయం ముందుగానే విడివిడిగా ఒకే విమానంలో టికెట్లు బుక్ చేస్తున్నారు సూత్రధారులు. ఈ అన్ని సర్వీసుల్లోనూ ఒకే సీటును వారు ఎంచుకుని ఎటువంటి ఇబ్బందీ లేకుండా పథకాన్ని అమలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. మరికొందరు స్మగ్లర్స్ ఇదే తరహా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్న అధికారులు నిఘా ముమ్మరం చేయాలని నిర్ణయించారు. -
‘సీటు’లోనే మతలబు!
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు శుక్రవారం పట్టుకున్న ఉత్తరప్రదేశ్ వాసి విచారణలో బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించిన కొత్త పంథా వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి ఇంటర్నేషనల్ సర్వీస్‌గా వచ్చి... నగరం నుంచి దేశవాళీ సర్వీసుగా మారిపోయే కొన్ని విమానాలను స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చు కుంటున్నారు. సీట్లు బుక్ చేసుకోవడంలో తెలివిగా వ్యవహరిస్తున్న వ్యవస్థీకృత ముఠాలు... ఎవరికీ అనుమానం, ‘చేతికి పసిడి’ అంటకుండా పని పూర్తి చేస్తున్నాయని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఇలాంటి అక్రమ రవాణాదారులకు చెక్ చెప్పడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఏళ్లుగా క్యారియర్లతో దందా... సాధారణంగా పసిడి అక్రమ రవాణా చేసే ముఠాలు క్యారియర్లను ఏర్పాటు చేసుకుంటాయి. తమ ముఠాతో ఎలాంటి సంబంధం లేని వారిని ఎంచుకుని, కమీషన్ల ఆశచూపి, కొన్ని సందర్భాల్లో విషయం చెప్పకుండా వాడుకుంటాయి. ఇలాంటి క్యారియర్లకు అందించే బ్యాగుల అడుగు భాగంలోని తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, కార్టన్ బాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పౌడర్ డబ్బాలతో పాటు మెబైల్ చార్జర్స్‌లోనూ పసిడిని దాచి విమానాల్లో స్మగ్లింగ్ చేయించేవి. ఆ తరవాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి పైన తాపడం చేసి అక్రమ రవాణా చేయించేవి. వీటన్నింటికీ మించి ‘రెక్టమ్ కన్సీల్మెంట్’ అనే ప్రక్రియకూ వ్యవస్థీకృత ముఠాలు శ్రీకారం చుట్టాయి. సుదీర్ఘకాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. ఇందులో గరిష్టంగా కేజీ వరకు బంగారాన్ని పట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా మలద్వారంలో పెట్టుకుంటున్న క్యారియర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. కొత్త విధానం ‘చూపిన’ యూపీ వాసి... ఎయిర్ ఇండియాకు చెందిన 952 విమానంలో దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖపట్నానికి అక్కడి నుంచి ఢిల్లీకి 1.2 కేజీల బంగారం అక్రమ రవాణా చేసేందుకు సహకరిస్తూ శుక్రవారం చిక్కిన ఉత్తరప్రదేశ్ వాసి కేసు దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారానికి ప్రాధాన్యం ఇచ్చి న కస్టమ్స్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానంలో ఉండే ‘మధ్య సీట్లే’ స్మగ్లర్లకు అనుకూలమని వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ సర్వీసులను నడి పే అన్ని విమానయాన సంస్థలూ మార్గ మధ్యం లో దేశవాళీ సర్వీసుగా మార్పును ప్రోత్సహించవు. కేవలం కొన్ని మాత్రమే ఈ విధానాన్ని అవలంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ తదితర దేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుగా ప్రారంభమైన ఓ విమానం దేశంలోకి ప్రవేశించిన తరవాత దాన్ని దేశవాళీ సర్వీసుగా వినియోగిస్తుంది. డొమెస్టిక్ ట్రావెల్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న, అప్పటికప్పుడు కొనుగోలు చేసిన ప్రయాణికులను దేశీయంగా అంతర్జాతీయ ప్రయాణికులతో కలిపి గమ్య స్థానాలకు చేరుస్తుంటుంది. ఎక్కడికక్కడ ‘ప్రయాణికుల’ ఏర్పాటు... ఈ విధానంతో పాటు ఈ ఎయిర్‌లైన్స్ టిక్కెట్లు ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే సమయంలో కల్పిస్తున్న మరో సౌకర్యం కూడా స్మగ్లర్లకు కలిసి వస్తోందని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. యూపీకి చెందిన స్మగ్లర్ శుక్రవారం చెన్నైకి 1.2 కేజీల బంగారంతో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. బంగారం ఉన్న బ్యాగ్‌ను తన సీటు కిందే వదిలి అంతర్జాతీయ ప్రయాణికుడిగా విమానం దిగి కస్టమ్స్ తనిఖీలు పూర్తి చేసుకునేందుకు వచ్చాడు. ఇతడి వద్ద తనిఖీల్లో ఎలాంటి అనుమానిత వస్తువులూ లభించలే దు. అయితే పాస్‌పోర్ట్‌లోని వివరాలతో పాటు కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు. ఇతడు సదరు ఫ్లైట్ దిగి కస్టమ్స్ చెకిం గ్ సైతం పూర్తి చేసుకుని నేరుగా డిపార్చర్ లాం జ్‌కు వెళ్లిపోతాడు. అదే విమానంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లడానికి ముఠాకు చెందిన మరో వ్యక్తి ముందే డొమెస్టిక్ టికెట్ బుక్ చేసుకుని సిద్ధంగా ఉంటాడు. ఇతను దేశ వాళీ ప్రయాణికు డిగా ఎక్కి అంతకు ముందు యూపీ వ్యక్తి కూ ర్చున్న సీటులోనే కూర్చుంటాడు. అనుకున్న ప్ర కారం ఇతడు విశాఖపట్న ం చేరేసరికి దేశవాళీ ప్రయాణికుడే (డొమెస్టిక్ పాసింజర్) కావడంతో ఎలాంటి కస్టమ్స్ తనిఖీలు లేకుండా అక్కడి విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేయవ చ్చు. ఇలా ఈ విమానం డొమెస్టిక్‌గా ఎన్ని ప్రాం తాలకు తిరిగితే వాటిలో తమకు అనుకూలమైన చోట స్మగ్లర్లు బంగారాన్ని ‘దేశవాళీగా’ బయటకు తెచ్చేసుకోవచ్చు. డిమాండ్ లేని సీట్లే అనుకూలం.... శంషాబాద్ విమానాశ్రయ కస్టమ్స్ విభాగం ఆధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అప్రమత్తతతో ఈ అక్రమ రవాణాకు బ్రేక్ పడింది. ఈ కేసుపై అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అంతర్జాతీయ ప్రయాణికుడిగా వచ్చిన ముఠా సభ్యుడు కూర్చున్న సీటులోనే... దేశవాళీ సర్వీసుగా మారిన తరవాత ఎక్కే ముఠా సభ్యుడు ఎలా కూర్చోగలుగుతున్నాడు? అతడికి అదే సీటు ఎలా దొరుకుతోంది అనే అంశంపై లోతుగా ఆరా తీసింది. కొన్ని విమానయాన సంస్థలు విమాన టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునేప్పుడు ప్రయాణికుడు తమకు అనువైన సీటునూ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ‘చూస్ యువర్ సీట్’ పేరుతో ప్రయాణికుల సౌకర్యార్థం విమానయాన సంస్థ ఈ అవకాశం కల్పించింది. దీన్నే స్మగ్లింగ్ గ్యాంగ్స్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని తేలింది. దుబాయ్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విశాఖ నుంచి ఢిల్లీలకు ముఠా సభ్యుల కోసం నిర్ణీత సమయం ముందుగానే విడివిడిగా ఒకే విమానంలో టిక్కెట్లు బుక్ చేస్తున్న స్మగ్లర్లు అన్ని సర్వీసుల్లోనూ ఒకే సీటును ఎంచుకున్నారు. విమానంలో రెండు వైపులా మూడేసి చొప్పున సీట్లు ఉంటాయి. వీటిలో మధ్యలో ఉండే రెండు సీట్లకూ డిమాండ్ తక్కువగా ఉంటుంది. దీంతో ఆ సీట్లనే ఎంచుకుని ఇబ్బంది లేకుండా పథకాన్ని అమలు చేస్తున్నారని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఇలాంటి విమాన సర్వీసుల ద్వారా మరికొందరు స్మగ్లర్స్ ఇదే తరహాలో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్న కస్టమ్స్ అధికారులు ‘ఎస్కార్ట్ ఆఫీసర్స్’ సంఖ్యను పెంచి నిఘా ముమ్మరం చేశారు. ఈ ఎస్కార్ట్ ఆఫీసర్లు సాధారణ ప్రయాణికుల మాదిరిగానే విమానంలో ప్రయాణిస్తూ ఇలాంటి అక్రమ వ్యవహారాలను కనిపెడుతుంటారు. -
శంషాబాద్ విమానాశ్రయం దశాబ్ది వేడుకలు
హైదరాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(జీఎంఆర్ హైదరాబాద్) ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జీఎంఆర్ సంస్థ ఏర్పాటు చేసిన దశాబ్ది వేడుకలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. 2008లో ప్రారంభమైన విమానాశ్రమం క్రమక్రమంగా విస్తరిస్తూ వస్తోంది. హైదరాబాద్ కీర్తిని పెంచుతూ, సిటీ ఐకాన్‌గా నిలిచింది. ఈ దశాబ్ది వేడుకల్లో డెకెడ్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టాంప్‌తోపాటు, ఎన్వలప్‌ని విడుదల చేశారు. జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ నిర్వహించే శిక్షణ కార్యక్రమాల కోసం ప్రభుత్వంతో మూడు ఎంవోయూలపై సంతకాలు చేశారు. విస్తరణ పనులకు శంకుస్థాపన: శంషాబాద్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించే పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అదే విధంగా దేశంలో అతి పెద్ద కన్వెక్షన్ సెంటర్‌కు శిలాఫలకం ప్రారంభించారు. దేశంలోనే మెట్టమొదటి స్మార్ట్, గ్రీన్ ఫీల్డ్ సిటీని కూడా ఆయన ప్రారంభించారు. ఏడాదికి కోటి ఇరవై లక్షల ప్రయాణికుల సామర్థ్యంతో విమానాశ్రయం ప్రారంభమైన భవిష్యత్తులో ఏడాదికి నాలుగు కోట్ల మందిని తట్టుకునేలా విస్తరణ చేపడతామని జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వేడుకల్లో జీఎంఆర్ చైర్మన్ గ్రంధి మలికార్జునరావు, మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, సినీ నటుడు రామ్‌చరణ్ పాల్గొన్నారు. -
పది వసంతాల పయనం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరకీర్తికిరీటంలో కలికితురాయి లాంటి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పది వసంతాలు పూర్తి చేసుకోనుంది. ప్రపంచంలోని అన్ని ప్రధాననగరాలకు, దేశంలోని అన్ని మెట్రోపాలిటన్నగరాలకు విమాన సర్వీసులు అందిస్తున్నఅందజేస్తోన్న శంషాబాద్ విమానాశ్రయం‘ఎయిర్‌పోర్టు సిటీ’గా విస్తరించేందుకు సిద్ధమైంది. ప్రయాణికుల రవాణాలో, కార్గో రవాణా రంగంలోనూ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్న ఎయిర్‌పోర్టు ఐటీ ఆధారిత సేవల వినియోగంలో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. ఈ నెల 23వ తేదీకి పదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అంచలంచెలుగా ఎదిగి.. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం జీఎమ్మార్, ఎయిర్‌పోర్టు అథారిటీస్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో ఆవిర్భవించింది. 2008 మార్చి 23న ప్రయాణికులకు ఇక్కడ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏటా సుమారు కోటి మంది ప్రయాణికులు, 1.50 మిలియన్ టన్నుల కార్గో రవాణా లక్ష్యంగా ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు. తొలి ఏడాది సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా.. ఇప్పుడు ఆ సంఖ్య 1.80 కోట్లకు చేరింది. మొదట్లో 28 జాతీయ, అంతర్జాతీయ నగరాలకు మాత్రమే ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉండగా ప్రస్తుతం 9 జాతీయ, 15 అంతర్జాతీయ, 3 ఇండియన్ ఎయిర్‌లైన్స్ ద్వారా 60 జాతీయ, అంతర్జాతీయ నగరాలకు సర్వీలు నడుస్తున్నాయి. గత సంవత్సరం కొలంబో, వాషింగ్టన్ డీసీ, కువైట్, షార్జా, దోహ తదితర నగరాలకు సైతం డైరెక్ట్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ ఎయిర్‌పోర్టు ప్రారంభించిన ఏడాదిలోనే ప్రతిష్టాత్మకమైన ‘లీడ్’ అవార్డును సొంతం చేసుకుంది. సోలార్ విద్యుత్ వినియోగం, పర్యావరణ హితమైన ప్రమాణాల అమలులోనూ ముందుంది. ‘ఎయిర్‌పోర్టు సిటీ’కి శంకుస్థాపన.. శుక్రవారం విమానాశ్రయంలోని హజ్ టర్మినల్ వద్ద నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పలువురు ప్రముఖులు పాల్గొనే ఈ వేడుకలో ఎయిర్‌పోర్టు విస్తణకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సిటీ’గా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపడతారు. సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో ఎగ్జిబిషన్ హాల్స్, మాల్స్, హోటళ్లు, హాస్పిటళ్లు, ఉద్యానవనాలు వంటి ఏర్పాట్లతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేవిధంగా ఈ సిటీని నిర్మించనున్నారు. డిజిటల్ ఎయిర్‌పోర్టు దిశగా పరుగులు.. అన్ని విభాగాల్లోను సాంకేతిక సేవలను అందుబాటులోకి తేవడంతో ‘డిజిటల్ ఎయిర్‌పోర్టు’గా గుర్తింపు పొందింది. ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్ కార్యక్రమంలో భాగంగా తనిఖీలను ‘స్మార్ట్’గా మార్చారు. త్వరలో ‘ఫేస్ రికగ్నైజేషన్’ యంత్రాలు సైతం అందుబాటులోకి రానున్నాయి. రెగ్యులర్ ప్రయాణికుల ‘ట్రావెల్ హిస్టరీ’ని నమోదు చేసేందుకు చర్యలు చేపట్టారు. దీంతో వారు తక్కువ సమయంలోనే తనిఖీలు పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. హ్యాండ్‌బ్యాగ్ స్కానింగ్, స్వతహాగా నడవలేని ప్రయాణికుల కోసం ఒక్క అలారంతో పార్కింగ్ వద్దకే వీల్‌చైర్ సేవలను అందుబాటులోకి తేవడం, బయోటాయిలెట్లు, పేపర్‌లెస్ సర్వీసులు తదితర సదుపాయాల ద్వారా ఎయిర్‌పోర్టును పూర్తిగా డిజిటలైజ్ చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. -
రాయదుర్గం టు ఆర్జీఐఏ
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలు మార్గాన్ని రాయదుర్గం నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) వరకు (31 కి.మీ) పొడిగించేందుకు తాజా బడ్జెట్లో ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించింది. మరో రూ.200 కోట్ల నిధులను మెట్రో మొదటి దశ పనులకు కేటాయించింది. ప్రస్తుతం నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ (30 కి.మీ) మార్గంలో మెట్రోరైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం విదితమే. తాజాగా ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గానికి సైతం పాత అలైన్మెంట్ ప్రకారం పనులు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ నాటికి ఎల్బీనగర్–అమీర్‌పేట్, హైటెక్‌సిటీ–అమీర్‌పేట్ మార్గంలో మెట్రోను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో మార్గాన్ని పొడిగించాలని సీఎం కేసీఆర్ గత నాలుగేళ్లుగా మెట్రోరైలుపై ఏర్పాటు చేస్తున్న ప్రతి సమీక్ష సమావేశంలో సూచిస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు 31కి.మీ మార్గంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు బడ్జెట్లో రూ.400కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఈ మార్గంలో మెట్రో ఏర్పాటుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ, సాధ్యాసాధ్యాల పరిశీలన, స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాలు గుర్తించడం, అవసరమైన భుములు, ఆస్తులు సేకరించడం, రహదారుల విస్తరణ, బాధితులకు పరిహారం చెల్లించడం తదితర పనులు చేపట్టనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కాగా ఈ మార్గంలో ఒక్కో కిలోమీటర్ దూరానికి రూ.200 కోట్ల చొప్పున మొత్తం రూ.6,200 కోట్లు వ్యయం కానుంది. ఈ స్థాయిలో నిధులను ప్రభుత్వం ఏదేని ఆర్థిక సంస్థ నుంచి రుణంగా సేకరిస్తుందా? లేదా మెట్రో మొదటి దశ తరహాలో పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం లేదా హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో చేపడుతుందా? అన్నది సస్పెన్స్‌గా మారింది. కాగా ప్రభుత్వం గతేడాది బడ్జెట్లో మెట్రోకు రూ.200 కోట్లు కేటాయించింది. తొలిదశకే ఆపసోపాలు... ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా, నాగోల్–రాయదుర్గం మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ మార్గంలో మెట్రో మొదటి దశను చేపట్టిన విషయం విదితమే. ఈ పనులకే రూ.14,500 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆస్తుల సేకరణ ప్రక్రియ ఆలస్యం కావడంతో మెట్రో నిర్మాణ గడువు 18 నెలలు పెరిగి నిర్మాణ వ్యయం రూ.3వేల కోట్లకు చేరిందని నిర్మాణ సంస్థ గగ్గోలు పెడుతోంది. ఈ నేపథ్యంలో శంషాబాద్ వరకు మెట్రో మార్గాన్ని చేపట్టేందుకు ఎవరు ముందుకు వస్తారన్నది తేలాల్సి ఉంది. -
ఎయిర్‌పోర్టులో పాత నోట్ల కట్టలు
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో పాత కరెన్సీ నోట్ల కట్టలు వెలుగుచూశాయి. కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి వద్ద రూ.10లక్షల నగదు బయటపడింది. వ్యక్తి ఎయిరిండియా విమానంలో మస్కట్ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. డబ్బు ఎలా వచ్చిందనే దానిపై సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దొరికిన మొత్తంలో రూ.1.76 లక్షలు పాత రూ.వెయ్యి నోట్లు కాగా మిగిలినవి పాత రూ.500 నోట్లు. -
శంషాబాద్ విమానాశ్రయంలో సినిమాల విందు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రయాణికులకు సినిమాల విందు. ప్రయాణికులు తమకు నచ్చిన సినిమాలు, టీవీ షోలు, వీడియోలను ఉచితంగా, అపరిమితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ట్రావెల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయిన ఫ్రాప్కార్న్తో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్) చేతులు కలిపింది. ఫ్రాప్‌కార్న్ యాప్ ద్వారా ఒక సినిమా 3 నిముషాల లోపే డౌన్లోడ్ అయ్యేలా వేగంగా పనిచేసే వైఫై హాట్‌స్పాట్ ఏర్పాటు చేశారు. భారత్‌లో డిమాండ్‌పై వినోద సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి విమానాశ్రయంగా జీహెచ్ఐఏఎల్ నిలిచింది. -
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఉత్తమ అవార్డు
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ (ఆర్జీఐఏ)కి ఉత్తమ 'కార్గో ఎయిర్ పోర్ట్' అవార్డు లభించింది. జైపూర్ లో జరిగిన ఎయిర్ కార్డో ఏజెంట్స్ అసోసియేషన్ 40వ వార్షిక సమావేశంలో ఈ అవార్డును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రకటించారు. ఈ అవార్డుకు ఎంపిక కావడం ఇది వరుసగా రెండవసారి అని జీఎంఆర్ హైదరబాద్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ వెల్లడించింది. తమ సంస్థ చిత్తశుద్దిని, అందిస్తున్న సేవలకు ప్రతిరూపమే ఈ అవార్డు అని సీఈఓ ఎస్ జీకే కిశోర్ అన్నారు.