సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. బుధవారం ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్, డీఆర్‌ఐ అధికారులు 6.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే సౌది ఎయిర్‌లైన్స్ విమానంలో జెడ్డా నుంచి వచ్చిన 14 మందిని అదుపలోకి తీసుకున్నారు. అయితే దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డవారిని పాతబస్తీకి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. అయితే తమను జెడ్డాలోని గోల్డ్ స్మగ్లింగ్ ముఠా సభ్యులు బెదిరించడం వల్లనే ఇలా చేయాల్సి వచ్చిందని నిందితులు పోలీసుల ముందు వారి ఆవేదన వ్యక్తం చేశారు.
‘మేమంతా ఉమ్రా యాత్రకు వెళ్లగా.. అక్కడ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా సభ్యులు వేధింపులకు గురిచేశారు. మాకు బంగారం ఇచ్చి.. దానిని హైదరాబాద్‌లో ఇవ్వాల్సిందిగా ఆదేశింశారు. లేకపోతే అక్రమంగా ఉమ్రా యాత్రకు వచ్చారని స్థానిక పోలీసులకు పట్టిస్తామని వాళ్లు బెదిరింపులకు దిగారు. అందుకు భయపడి బంగారాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చామ’ని నిందితులు పోలీసులకు వివరించారు. మరోవైపు వీరి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2.17 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment