ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల నుంచి 3,175 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని క్యాప్సూల్స్‌లో నింపి మహిళలు తమ కడుపులో దాచి తరలించే ప్రయత్నం చేయగా.. అధికారులు నిర్వహించిన స్క్రీనింగ్‌లో బంగారం బయట పడింది. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ నలుగురు మహిళలను కస్టమ్స్ అధికారులు శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా మంగళవారమే శంషాబాద్ ఎయిర్ పోర్టులో దుబాయ్ నుంచి ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 66 లక్షల విలువ చేసే 1,100 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. తెల్లవారుజామున వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.52.24 లక్షల విలువ చేసే 840 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రయాణికుడి నుంచి రూ.14.23 లక్షల విలువైన 233 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. మొదటి ప్రయాణికుడు ముద్ద రూపంలో బంగారాన్ని తీసుకురాగా.. రెండో ప్రయాణికుడు తున చేప ఆయిల్ డబ్బాల మధ్య దాచుకుని తెచ్చినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఇద్దరు దుబాయ్ ప్రయాణికులను అరెస్ట్ చేసిన అధికారులు వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: హైదరాబాద్‌లో మళ్లీ పోస్టర్ వార్.. అదే దారిలో బీజేపీ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment