హైదరాబాద్‌లో రెండు రోజుల నుంచి పొగమంచు కమ్మేస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈ కారణంగా రహదారులపై ప్రయాణాలు కొంత కష్టంగా మారాయి. మరోవైపు విమానాశ్రయంలో కొద్ది మీటర్ల దూరంలోనే ఉన్న వస్తువులు కూడా కనిపించనంత దట్టంగా పొగమంచు కమ్ముకుంటుంది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఇక్కడ రన్‌వేపై విజిబిలిటీ దారుణంగా పడిపోయింది.
అత్యవసరంగా టేకాఫ్ కావాల్సిన విమానాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్‌జీఐఏ) ద్వారా ప్రయాణం సాగిస్తున్న పలు విమానాలను దారి మళ్లించారు. గడిచిన రెండురోజుల్లో హైదరాబాద్-దిల్లీ మధ్య ప్రయాణాలు సాగిస్తున్న 29 విమానాల ప్రయాణ సమయంలో అంతరాయం ఏర్పడినట్లు తెలిసింది. జనవరి 14న 14 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 6 విమానాలను ఆర్‌జేఐఏ నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయ అధికారులు తెలిపారు.
జనవరి 15న 15 విమానాల ప్రయాణం ఆలస్యం అయింది. ఏడు విమానాలను హైదరాబాద్ విమానాశ్రయానికి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నాలుగు విమానాలు, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రెండు, దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక విమానంను సంబంధిత అధికారులు దారి మళ్లించారు.
ఇదీ చదవండి: భారత్‌కు మద్దతుగా నిలిస్తే.. రాజకీయంగా చూస్తున్నారు - సీఈఓ
రానున్న 4-5 రోజుల పాటు నార్త్ ఇండియాలో దట్టమైన పొగమంచు ఏర్పడే పరిస్థితులు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. దాంతో ఈ పరిస్థితులు మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాబట్టి ప్రయాణికులు సంబంధిత ఎయిర్‌లైన్స్ ద్వారా పూర్తి సమాచారాన్ని ముందుగానే ధ్రువీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment