‘సీటు’లోనే మతలబు! | Gold Smugling In Innovative trend | Sakshi
Sakshi News home page

‘సీటు’లోనే మతలబు!

Published Mon, Mar 26 2018 8:08 AM | Last Updated on Thu, Aug 2 2018 4:08 PM

Gold Smugling In Innovative trend - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులు శుక్రవారం పట్టుకున్న ఉత్తరప్రదేశ్‌ వాసి విచారణలో బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించిన కొత్త పంథా వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి ఇంటర్నేషనల్‌ సర్వీస్‌గా వచ్చి... నగరం నుంచి దేశవాళీ సర్వీసుగా మారిపోయే కొన్ని విమానాలను స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చు కుంటున్నారు. సీట్లు బుక్‌ చేసుకోవడంలో తెలివిగా వ్యవహరిస్తున్న వ్యవస్థీకృత ముఠాలు... ఎవరికీ అనుమానం, ‘చేతికి పసిడి’ అంటకుండా పని పూర్తి చేస్తున్నాయని కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. ఇలాంటి అక్రమ రవాణాదారులకు చెక్‌ చెప్పడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 

ఏళ్లుగా క్యారియర్లతో దందా...
సాధారణంగా పసిడి అక్రమ రవాణా చేసే ముఠాలు క్యారియర్లను ఏర్పాటు చేసుకుంటాయి. తమ ముఠాతో ఎలాంటి సంబంధం లేని వారిని ఎంచుకుని, కమీషన్ల ఆశచూపి, కొన్ని సందర్భాల్లో విషయం చెప్పకుండా వాడుకుంటాయి. ఇలాంటి క్యారియర్లకు అందించే బ్యాగుల అడుగు భాగంలోని తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, కార్టన్‌ బాక్సులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, పౌడర్‌ డబ్బాలతో పాటు మెబైల్‌ చార్జర్స్‌లోనూ పసిడిని దాచి విమానాల్లో స్మగ్లింగ్‌ చేయించేవి. ఆ తరవాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి పైన తాపడం చేసి అక్రమ రవాణా చేయించేవి. వీటన్నింటికీ మించి ‘రెక్టమ్‌ కన్‌సీల్‌మెంట్‌’ అనే ప్రక్రియకూ వ్యవస్థీకృత ముఠాలు శ్రీకారం చుట్టాయి. సుదీర్ఘకాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. ఇందులో గరిష్టంగా కేజీ వరకు బంగారాన్ని పట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్‌ పేపర్‌ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా మలద్వారంలో పెట్టుకుంటున్న క్యారియర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.

కొత్త విధానం ‘చూపిన’ యూపీ వాసి...
ఎయిర్‌ ఇండియాకు చెందిన 952 విమానంలో దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ మీదుగా విశాఖపట్నానికి అక్కడి నుంచి ఢిల్లీకి 1.2 కేజీల బంగారం అక్రమ రవాణా చేసేందుకు సహకరిస్తూ శుక్రవారం చిక్కిన  ఉత్తరప్రదేశ్‌ వాసి కేసు దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారానికి ప్రాధాన్యం ఇచ్చి న కస్టమ్స్‌ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానంలో ఉండే ‘మధ్య సీట్లే’ స్మగ్లర్లకు అనుకూలమని వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ సర్వీసులను నడి పే అన్ని విమానయాన సంస్థలూ మార్గ మధ్యం లో దేశవాళీ సర్వీసుగా మార్పును ప్రోత్సహించవు. కేవలం కొన్ని మాత్రమే ఈ విధానాన్ని అవలంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్‌ తదితర దేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుగా ప్రారంభమైన ఓ విమానం దేశంలోకి ప్రవేశించిన తరవాత దాన్ని దేశవాళీ సర్వీసుగా వినియోగిస్తుంది. డొమెస్టిక్‌ ట్రావెల్‌ కోసం టిక్కెట్లు బుక్‌ చేసుకున్న, అప్పటికప్పుడు కొనుగోలు చేసిన ప్రయాణికులను దేశీయంగా అంతర్జాతీయ ప్రయాణికులతో కలిపి గమ్య స్థానాలకు చేరుస్తుంటుంది. 

ఎక్కడికక్కడ ‘ప్రయాణికుల’ ఏర్పాటు...
ఈ విధానంతో పాటు ఈ ఎయిర్‌లైన్స్‌ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునే సమయంలో కల్పిస్తున్న మరో సౌకర్యం కూడా స్మగ్లర్లకు కలిసి వస్తోందని కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. యూపీకి చెందిన స్మగ్లర్‌ శుక్రవారం చెన్నైకి 1.2 కేజీల బంగారంతో దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. బంగారం ఉన్న బ్యాగ్‌ను తన సీటు కిందే వదిలి అంతర్జాతీయ ప్రయాణికుడిగా విమానం దిగి కస్టమ్స్‌ తనిఖీలు పూర్తి చేసుకునేందుకు వచ్చాడు. ఇతడి వద్ద తనిఖీల్లో ఎలాంటి అనుమానిత వస్తువులూ లభించలే దు. అయితే పాస్‌పోర్ట్‌లోని వివరాలతో పాటు కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్‌ అధికారులు ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు. ఇతడు సదరు ఫ్లైట్‌ దిగి కస్టమ్స్‌ చెకిం గ్‌ సైతం పూర్తి చేసుకుని నేరుగా డిపార్చర్‌ లాం జ్‌కు వెళ్లిపోతాడు. అదే విమానంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లడానికి ముఠాకు చెందిన మరో వ్యక్తి ముందే డొమెస్టిక్‌ టికెట్‌ బుక్‌ చేసుకుని సిద్ధంగా ఉంటాడు. ఇతను దేశ వాళీ ప్రయాణికు డిగా ఎక్కి అంతకు ముందు యూపీ వ్యక్తి కూ ర్చున్న సీటులోనే కూర్చుంటాడు. అనుకున్న ప్ర కారం ఇతడు విశాఖపట్న ం చేరేసరికి దేశవాళీ ప్రయాణికుడే (డొమెస్టిక్‌ పాసింజర్‌) కావడంతో ఎలాంటి కస్టమ్స్‌ తనిఖీలు లేకుండా అక్కడి విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేయవ చ్చు. ఇలా ఈ విమానం డొమెస్టిక్‌గా ఎన్ని ప్రాం తాలకు తిరిగితే వాటిలో తమకు అనుకూలమైన చోట స్మగ్లర్లు బంగారాన్ని ‘దేశవాళీగా’ బయటకు తెచ్చేసుకోవచ్చు.  

డిమాండ్‌ లేని సీట్లే అనుకూలం....
శంషాబాద్‌ విమానాశ్రయ కస్టమ్స్‌ విభాగం ఆధీనంలోని ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ అప్రమత్తతతో ఈ అక్రమ రవాణాకు బ్రేక్‌ పడింది. ఈ కేసుపై అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అంతర్జాతీయ ప్రయాణికుడిగా వచ్చిన ముఠా సభ్యుడు కూర్చున్న సీటులోనే... దేశవాళీ సర్వీసుగా మారిన తరవాత ఎక్కే ముఠా సభ్యుడు ఎలా కూర్చోగలుగుతున్నాడు? అతడికి అదే సీటు ఎలా దొరుకుతోంది అనే అంశంపై లోతుగా ఆరా తీసింది. కొన్ని విమానయాన సంస్థలు విమాన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేప్పుడు ప్రయాణికుడు తమకు అనువైన సీటునూ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ‘చూస్‌ యువర్‌ సీట్‌’ పేరుతో ప్రయాణికుల సౌకర్యార్థం విమానయాన సంస్థ ఈ అవకాశం కల్పించింది.

దీన్నే స్మగ్లింగ్‌ గ్యాంగ్స్‌ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని తేలింది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్, హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం, విశాఖ నుంచి ఢిల్లీలకు ముఠా సభ్యుల కోసం నిర్ణీత సమయం ముందుగానే విడివిడిగా ఒకే విమానంలో టిక్కెట్లు బుక్‌ చేస్తున్న స్మగ్లర్లు అన్ని సర్వీసుల్లోనూ ఒకే సీటును ఎంచుకున్నారు. విమానంలో రెండు వైపులా మూడేసి చొప్పున సీట్లు ఉంటాయి. వీటిలో మధ్యలో ఉండే రెండు సీట్లకూ డిమాండ్‌ తక్కువగా ఉంటుంది. దీంతో ఆ సీట్లనే ఎంచుకుని ఇబ్బంది లేకుండా పథకాన్ని అమలు చేస్తున్నారని కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. ఇలాంటి విమాన సర్వీసుల ద్వారా మరికొందరు స్మగ్లర్స్‌ ఇదే తరహాలో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్న కస్టమ్స్‌ అధికారులు ‘ఎస్కార్ట్‌ ఆఫీసర్స్‌’ సంఖ్యను పెంచి నిఘా ముమ్మరం చేశారు. ఈ ఎస్కార్ట్‌ ఆఫీసర్లు సాధారణ ప్రయాణికుల మాదిరిగానే విమానంలో ప్రయాణిస్తూ ఇలాంటి అక్రమ వ్యవహారాలను కనిపెడుతుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement