పసిడికి హెన్నా టచ్‌! | A Smuggler Was Held At RGIA | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 23 2018 2:34 AM | Last Updated on Mon, Jul 23 2018 10:08 AM

A Smuggler Was Held At RGIA - Sakshi

పేస్టు రూపంలో ఉన్న బంగారం

సాక్షి, హైదరాబాద్‌ : కడ్డీలు.. బిస్కట్లు.. వివిధ వస్తువుల రూపంలో ఇప్పటి వరకూ పసిడి స్మగ్లింగ్‌కు పాల్పడిన ముఠాలు.. తాజాగా హెన్నా(మెహెందీ పొడి)తో బంగారాన్ని కలిపి, పేస్ట్‌లా మార్చి అక్రమ రవాణా చేసేస్తున్నాయి. ఈ గోల్డ్‌ పేస్ట్‌ స్మగ్లింగ్‌ కోసం శ్రీలంక రాజధాని కొలంబో నుంచి వచ్చిన ‘ఇంటర్నేషనల్‌–డొమెస్టిక్‌’ఫ్లైట్‌ను స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పేస్ట్‌ రూపంలో తీసుకువచ్చిన బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. దీన్ని తీసుకువచ్చిన చెన్నై వాసిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

కొలంబో నుంచి నగరానికి.. 
కొలంబోకు చెందిన సూత్రధారులు 1,150 గ్రాముల బంగారాన్ని మెత్తని పొడిగా చేశారు. ఆ పొడి కూడా బంగారం రంగులోనే ఉండటంతో పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బంగారం పొడిని గోధుమ రంగులో ఉండే హెన్నాలో కలిపేశారు. 1,120 గ్రాముల బంగారం పొడిలో 730 గ్రాముల హెన్నాను కలిపారు. పౌడర్‌ రూపంలోకి మారిన బంగారం, హెన్నా మిక్స్‌ను పేస్ట్‌గా మార్చడానికి చెక్లెట్‌ తయారీకి వినియోగించే లిక్విడ్స్‌ వాడారు. ఇలా తయారైన గోధుమ రంగు పేస్ట్‌ను ప్లాస్టిక్‌ కవర్‌లో ప్యాక్‌ చేసిన స్మగ్లర్లు.. దాన్ని బ్రౌన్‌ కవర్లలో ఉంచి పైన ప్లాస్టర్లు వేశారు. ఇలా తయారు చేసిన 1,850 గ్రాముల బరువున్న 2 ప్యాకెట్లను ‘ఇంటర్నేషనల్‌–డొమెస్టిక్‌’పంథాలో శంషాబాద్‌కు పంపారు. 

చేతికి పసిడి అంటకుండా.. 
విమానంలో సీట్లు బుక్‌ చేసుకోవడంలో తెలివిగా వ్యవహరించిన ఈ వ్యవస్థీకృత ముఠా ‘చేతికి పసిడి’అంటకుండా పని పూర్తి చేయడానికి పథకం వేసింది. అంతర్జాతీయ సర్వీసుల్ని నడిపే అన్ని విమానయాన సంస్థలూ మార్గ మధ్యలో దేశవాళీ సర్వీసుగా మార్పును ప్రోత్సహించవు. కొన్ని మాత్రమే ఈ విధానాన్ని అవలంభిస్తున్నాయి. స్పైస్‌ జెట్‌కు చెందిన ఎస్‌జీ–1314 విమానం కొలంబో–హైదరాబాద్‌ మధ్య నడుస్తుంది. ఇది కొలంబోలో అంతర్జాతీయ సర్వీసుగా మొదలై మధురై వచ్చిన తర్వాత దేశవాళీ సర్వీసుగా మారుతుంది. డొమెస్టిక్‌ ట్రావెల్‌ కోసం టిక్కెట్లు బుక్‌ చేసుకున్న, అప్పటికప్పుడు కొనుగోలు చేసిన ప్రయాణికులను అంతర్జాతీయ ప్రయాణికులతో కలిపి గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఈ ఎయిర్‌లైన్స్‌ టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సమయంలో కల్పిస్తున్న మరో సౌకర్యాన్ని స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. 

పసిడి ప్యాకెట్లను సీటు కిందే వదిలి.. 
కొలంబో నుంచి రెండు ‘గోల్డ్‌ పేస్ట్‌’ప్యాకెట్లను తీసుకుని ఓ స్మగ్లర్‌ మధురై వరకు వచ్చాడు. పసిడి ప్యాకెట్లు ఉన్న హ్యాండ్‌ బ్యాగేజ్‌ను తన సీటు కిందే వదిలి అంతర్జాతీయ ప్రయాణికుడిగా విమానం దిగి కస్టమ్స్‌ తనిఖీలు పూర్తి చేసుకుని బయటకు వెళ్లిపోయాడు. స్మగ్లింగ్‌ ముఠాలో పాత్రధారిగా ఉన్న చెన్నైకు చెందిన మరో వ్యక్తి హైదరాబాద్‌కు వచ్చే డొమెస్టిక్‌ ప్యాసింజర్‌గా అదే విమానం ఎక్కాడు. ఇతగాడు కొలంబో నుంచి వచ్చిన వ్యక్తి కూర్చున్న సీటులోనే కూర్చున్నాడు. విమానం హైదరాబాద్‌ చేరేసరికి ఈ చెన్నై వాసి దేశవాళీ ప్రయాణికుడే కావడం తో కస్టమ్స్‌ తనిఖీలూ లేకుండా హ్యాండ్‌ బ్యాగేజ్‌తో విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేయవచ్చు. 

ప్రత్యేక బృందం కాపు కాసి.. 
ఈ విమానం శనివారం తెల్లవారుజామున శంషాబాద్‌ విమానాశ్రయం చేరే వరకు అంతా స్మగ్లర్లు అనుకున్న ప్రకారమే జరిగింది. అయితే ఈ వ్యవహారంపై డీఆర్‌ఐ హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌కు ఉప్పందడంతో ఓ ప్రత్యేక బృందం విమానాశ్రయంలో కాపుకాసింది. ఫ్లైట్‌ దిగి హ్యాండ్‌ బ్యాగేజ్‌తో ఎరైవింగ్‌ హాల్‌ వైపు వెళ్తున్న చెన్నై వాసిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేసింది. రెండు ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని విచారించిన నేపథ్యంలో సూత్రధారులెవరో తనకు తెలియదని, కమీషన్‌ తీసుకుని పని చేసే తాను మధురై నుంచి హైదరాబాద్‌ చేరుస్తానని, ముఠాకు చెందిన రిసీవర్లే తన వద్దకు వచ్చి ప్యాకెట్లు తీసుకువెళ్తారని తెలిపాడు. ఇతడి వద్ద లభించిన రెండు ప్యాకెట్లలోని 1,850 గ్రాముల పేస్ట్‌ను ఓ గిన్నెలో వేసి కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టగా అది పొడిగా మారింది. ఈ పొడిని కొలిమిలో కరిగించగా.. 1,120.78 గ్రాముల బంగారు బిస్కెట్‌ తయారైంది. దీని విలువ మార్కెట్‌లో రూ.34,57,606 ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. ఈ తరహా ‘గోల్డ్‌ పేస్ట్‌’కేసు హైదరాబాద్‌లో చిక్కడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. 

వివిధ కోణాల్లో దర్యాప్తు..
ఈ కేసును అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. కొన్ని విమానయాన సంస్థలు టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేప్పుడు ‘చూజ్‌ యువర్‌ సీట్‌’పేరుతో ప్రయాణికుడు తమకు అనువైన సీటును ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. దీన్నే స్మగ్లింగ్‌ గ్యాంగ్స్‌ తమకు అనువుగా మార్చుకుంటున్నాయని తేలింది. కొలంబో నుంచి మదురై, మదురై నుంచి హైదరాబాద్‌ రావడానికి ముఠా సభ్యుల కోసం నిర్ణీత సమయం ముందుగానే విడివిడిగా ఒకే విమానంలో టికెట్లు బుక్‌ చేస్తున్నారు సూత్రధారులు. ఈ అన్ని సర్వీసుల్లోనూ ఒకే సీటును వారు ఎంచుకుని ఎటువంటి ఇబ్బందీ లేకుండా పథకాన్ని అమలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. మరికొందరు స్మగ్లర్స్‌ ఇదే తరహా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్న అధికారులు నిఘా ముమ్మరం చేయాలని నిర్ణయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement