
బయల్దేరడానికి ముందు ఫొటో దిగిన విద్యార్థి బందం
గాజువాక(విశాఖ జిల్లా) : నేపాల్ భూప్రకంపనల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు సొంత రాష్ట్రాలకు బయల్దేరారు. నేపాల్లోని భరత్‌పూర్‌లోని కాలేజి ఆఫ్ మెడికల్ సెన్సైస్ (సీఎంఎస్)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన సుమారు 60 మంది మెడిసిన్ చదువుతున్నారు. వారిలో పది మంది వరకు విశాఖకు చెందినవారే ఉన్నారు. కఠ్మాండుకు 100 కిలోమీటర్ల దూరంలో ఈ కళాశాల ఉంది. భూకంపానికి కళాశాల గోడలు కూడా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. దీంతో తెలుగు విద్యార్థులు సమీపంలో ఉన్న దేవాలయంలో తలదాచుకొంటున్నారు.
కళాశాల యాజమాన్యం ఆదివారం ఒక బస్సును ఏర్పాటు చేసి భారత్-నేపాల్ సరిహద్దులలోని గోరఖ్‌పూర్ వరకు సురక్షితంగా పంపించారు. అక్కడ నుంచి విద్యార్థుల కోసం యశ్వంత్‌పూర్ రైలులో ప్రత్యేక భోగీని ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. వారిలో విశాఖ జిల్లాకు చెందిన కె.సాయిశరణ్య (గాజువాక), రమ్యశ్రీ (విశాలాక్షినగర్), అరుణ్‌తేజ్ (సీతమ్మధార), సాగరిక (బాలయ్యశాస్త్రి లే అవుట్), అనూష (నర్సీపట్నం)తోపాటు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన లావణ్య, శ్రావ్యశ్రీ (తాడేపల్లి గూడెం)లు కూడా ఉన్నారు.
వారంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు మంగళవారం సాయంత్రానికి చేరుకోనున్నట్లు ఇక్కడికి సమాచారం అందింది. దీంతో తమ పిల్లలను తీసుకువచ్చేందుకు కొందరు తల్లిదండ్రులు బయల్దేరారు. విశాఖ ప్రాంతానికి రావాల్సిన విద్యార్థులను ఖాజీపేట్ రైల్వే స్టేషన్‌లోనే రిసీవ్ చేసుకుంటారు. అక్కడ నుంచి విశాఖ బయల్దేరుతామని తమ కుమార్తె కోసం ఎదురు చూస్తున్న స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి కె.సతీష్‌కుమార్ సాక్షికి తెలిపారు.