విశాఖ విమానాశ్రయం బయటకు వచ్చిన చైనాలో శిక్షణకు వెళ్లిన విద్యార్థులు
సాక్షి, విశాఖపట్నం: చైనాలోని వుహాన్ పట్టణంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను ఎట్టకేలకు సొంతూళ్లకు పంపించారు. కోవిడ్ -19 (కరోనా వైరస్) వ్యాప్తితో అల్లాడుతున్న చైనాలో శిక్షణ కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులు అక్కడ ఇబ్బంది పడుతున్నారని కేంద్ర మంత్రికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నెల 3న ప్రత్యేక విమానంలో చైనా నుంచి 58 మందిని ఢిల్లీకి తీసుకొచ్చారు. వారిని అక్కడ 14 రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. వారికి కరోనా లక్షణాలు లేవని నిర్ధారణ కావడంతో మంగళవారం సొంతూళ్లకు పంపించే ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు విశాఖకు చెందిన 9 మంది పీవో టీపీఎల్ ట్రైనీ విద్యార్థులు మంగళవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు.
ఇన్నాళ్లూ ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు తమ బిడ్డలు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. జనవరి 23న చైనాలోని వుహాన్ నగరంలో పీవో టీపీఎల్ ట్రైనింగ్‌కు వెళ్లారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా అక్కడ చిక్కుకున్న విద్యార్థులను తిరిగి రప్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం విదేశీ దౌత్యపరమైన చర్యలు చేపట్టింది. ఇన్నాళ్లు బిక్కుబిక్కుమంటూ గడిపిన విద్యార్థులు సొంత ఇళ్లకు చేరుకోవడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులను 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచామని పరిశీలించామని, వారికి ఎటువంటి కరోనా వైరస్ లక్షణాలు లేవని జిల్లా సర్వెలెన్స్ ఆఫీసర్ పార్థసారథి తెలిపారు. మరో 14 రోజుల పాటు విద్యార్థుల ఇంటికి వెళ్లి ఎప్పటికప్పుడు వారి స్థితుగతులు తెలుసుకుంటామన్నారు.
కోలుకుంటున్న యువతి
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): ప్రభుత్వ అంటు వ్యాధుల ఆస్పత్రిలో చేరిన యువతి ప్రస్తుతం కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. నగరానికి చెందిన ఓ యువతి (21) చైనా నుంచి బ్యాంకాక్ మీదుగా విశాఖ చేరుకున్నారు. ఈ క్రమంలో పలు విదేశాల్లో విమానాశ్రాయాల సమీపంలో భోజనాలు చేశారు. అలాగే, ఐస్‌క్రీమ్ తిన్నారని వైద్యుల విచారణలో తేలింది. విశాఖ చేరుకోగానే వాంతులు, విరోచనాలతో బాధపడుతుండడంతో చినవాల్తేరులోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆస్పత్రిలో చేర్చారు. జలుబు లక్షణాలు కనిపించడం, చైనా నుంచి రావడంతో ముందుజాగ్రత్త చర్యగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక వార్డులో చేర్చారు. అక్కడ కొన్ని పరీక్షలు చేయగా ఆరోగ్యం నిలకడగానే ఉందని తేలింది. మరికొన్ని శాంపిళ్లను హైదరాబాద్ ప్రయోగశాలకు పంపించారు. ఈ సందర్భంగా జిల్లా కరోనా వైరస్ నివారణ నోడల్ అధికారి డాక్టర్ పార్థసారథి మంగళవారం ‘సాక్షి’తోమాట్లాడుతూ ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగానే వుందన్నారు. చైనా నుంచి రావడం వల్లనే ముందుజాగ్రత్తగా కరోనా వార్డులో చికిత్స చేయించామన్నారు. యువతి చైనాలో వైద్యవిద్య అభ్యసిస్తుందని తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా బుధవారం డిశ్చార్చిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు.
మరో యువతికి చికిత్స
మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖకు చెందిన 23 ఏళ్ల యువతి చైనాలోని యుహన నగరం నుంచి మంగళవారం విశాఖ వచ్చారు. ఆమెకు జ్వరం రావడంతో పెదవాల్తేరు ప్రభుత్వఛాతి ఆస్పత్రిలో చేర్పించారు. శాంపిల్స్ హైదరాబాద్ పంపారు. ప్రస్తుతం యువతి బాగానే వుందని వైద్యులు తెలిపారు. (చదవండి: కోవిడ్‌కు వైద్యుడు బలి)
Comments
Please login to add a commentAdd a comment