
కఠ్మాండులో ప్రజలు ఇళ్లలోకి వెళ్లడానికి భయపడి ఆరుబయటే కూర్చొని ఉన్న దృశ్యం
కఠ్మాండు: నేపాల్లో రెండు రోజుల పాటు గంటగంటకు భూమి కంపిచండంతో ఇక్కడి ప్రజలు తమ ఇళ్లోకి వెళ్లాంటే భయపడుతున్నారు.వణికిపోతున్నారు. ఇళ్లలో ఉండలేని పరిస్థితి వారిది. పార్కులలో, ఆరుబయట డేరాలలోనే ఉంటున్నారు. నేపాల్ నుంచి సాక్షి ప్రతినిధి ఇస్మాయిల్ అందించిన వివరాల ప్రకారం నేపాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. చాలా చోట్ల మంచినీరు కూడా దొరకడంలేదు. విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్దరించలేదు. చాలా చోట్ల జనరేటర్ల ద్వారా విద్యుత్ను అందిస్తున్నారు. వాటితోనే మొబైల్స్ను రీఛార్జి చేసుకుంటున్నారు.
ఎప్పుడు, ఎక్కడ మళ్లీ భూకంపం వస్తుందోనని ప్రజలు భయపడిపోతున్నారు. శిథిలాలు తొలగించే ప్రక్రియ 25శాతం కూడా పూర్తి కాలేదు. ఈ దేశంలో 90 శాతం ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలేదు. స్థానిక మార్కెట్లు అన్నిటినీ మూసివేశారు. తోపుడుబండ్లపై కొన్ని నిత్యావసర వస్తువులు విక్రయిస్తున్నారు.
వేలాది మంది భారతీయులు ఇంకా నేపాల్లోనే ఉన్నారు. కఠ్మాండు విమానాశ్రయం వద్ద పడిగాపులు గాస్తున్నారు. విమానాశ్రయం జనంతో కిక్కిరిసిపోయింది. అక్కడ సెక్యూరిటీ తప్ప ఇతర సిబ్బంది లేరు. టిక్కెట్ల కోసం భారీ క్యూలు ఉన్నాయి. కఠ్మాండులోని భారత రాయభార కార్యాలయం కూడా దెబ్బతింది. సమాచారం ఇచ్చేవారు కరువయ్యారు.
కఠ్మాండు విమానాశ్రయం వద్ద టిక్కెట్ల కోసం బారులుతీరిన యాత్రికులు