దేవుడిపైనే భారం వేశాం | He depended on god | Sakshi
Sakshi News home page

దేవుడిపైనే భారం వేశాం

Published Fri, May 1 2015 12:46 AM | Last Updated on Sat, Oct 20 2018 6:37 PM

He depended on god

- కళ్ల ముందే అంతా కకావికలం
- స్వల్పగాయాలతో బయటపడ్డాం
- నాలుగు రోజులు నరకం చూశాం
- లింగాపూర్ చేరిన నేపాల్ భూకంపం బాధిత కుటుంబం

గాయాలతో ఇల్లు చేరిన కల్యాణం మలయ్య
బతుకుతామని అనుకోలేదు
నా కుమారులు, కోడళ్లు పదేళ్లుగా నేపాల్‌లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటుండ్రు. నెల రోజుల క్రితం పశుపతినాథ్ ఆలయం యాత్ర కోసం నేపాల్‌లో ఉంటున్న నా కొడుకుల వద్దకు వెళ్లిన. ఈ నెల 25న ఇంటినుంచి బీడి కోసం దుకాణం వెళ్లిన. తిరిగి వస్తుండగా ఒక్కసారిగా భూకంపం వచ్చింది. రెండుసార్లు కింద పడ్డాను. పక్కనే ఉన్న ప్రహరీ గోడ కూలి నాపై పడింది. కుడి కాలు, చేయి విరిగినయి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. భూకంపం వచ్చిందని తెలిసి గుండె ఆగినంత పనయింది. దేవునిపై భారం వేసి బతికి బయటపడ్డాం.  

- బిక్కుబిక్కుమంటూ గడిపాం
- స్వగ్రామానికి చేరుకున్న భూకంప బాధితులు
మానకొండూర్ :
నేపాల్ రాజధాని కాఠ్మాండులో 25న భూకంపంలో చిక్కుకున్నప్పుడు దేవుడిపైనే భారంవేసి బిక్కుబిక్కుమంటూ గడిపామని మానకొండూర్ మండలం లింగాపూర్‌కు చెందిన బాధితులు తెలిపారు. ఈ గ్రామం నుంచి వెళ్లిన వారిలో భూకంపం ప్రభావంతో 62 మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే. స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడి బుధవారం స్వగ్రామం చేరిన వీరు ఆనాటి భయంకర పరిస్థితులను ‘సాక్షి’తో పంచుకున్నారు.

లింగాపూర్‌కు చెందిన పలువురు బుడిగజంగాల వారు బతుకుదెరువు కోసం నేపాల్‌లోని సీనమంగల, కాఠ్మాండు, పురాణబాసి, బీంసింగ్‌కోలా తదితర పట్టణాల్లో జ్యోతిష్యం, ఉంగరాలు అమ్ముతూ కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. భూకంపం సంభవించి మోటం విజయ్, కిన్నెర లక్ష్మి, మోటం సంపత్, మోటం సురేశ్, ఓర రాజేశ్‌తోపాటు మరో 23 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణాపాయం నుంచి బయటపడి బిక్కుబిక్కుమంటూ నాలుగు రోజులపాటు గడిపిన వీరు ఎలాగోలా బయటపడి స్వగ్రామాలకు బుధవారం చేరుకున్నారు. కొందరు దేవుడిపై భారం వేసి అక్కడే ఉండి పోగా, మరికొందరు రైలు ద్వారా గురువారం చేరుకోనున్నారని బాధితుడు మల్లయ్య తెలిపాడు.

ఇదే గ్రామానికి చెందిన కల్యాణం మల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతడి కుడి కాలు, కుడి చేయి విరిగింది. మల్లయ్య కుమారుడు శ్రీనివాస్, కోడలు లక్ష్మి, శ్రీనివాస్ కుమారుడు మహేశ్, కూతురు అనూష, శ్రీనివాస్ అన్న కుమారుడు వెంకటేశ్ మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో కఠ్మాండు నుంచి ఢిల్లీకి చేరుకుని, అక్కడినుంచి విమానంలో మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి బస్సులో కరీంనగర్‌కు చేరుకుని బుధవారం ఉదయం స్వగ్రామానికి వచ్చారు. నేపాల్ నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆనందం నింపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement