హెలికాప్టర్ అదృశ్యం: 8 మంది గల్లంతు
వాషింగ్టన్: నేపాల్ భూకంప ప్రాంతంలో అమెరికాకు చెందిన మెరైన్ హెలికాప్టర్ అదృశ్యమైందని పెంటగాన్ అధికార ప్రతినిధి ఆర్మీ కల్నల్ స్టీవ్ వార్నీ బుధవారం వెల్లడించారు. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు మెరైన్ సిబ్బందితోపాటు ఇద్దరు నేపాలీ సైనికుల జాడ తెలియరాలేదని తెలిపారు. నేపాల్లోని భూకంప బాధితుల కోసం మంగళవారం ఆహార పదార్థాలను తరలిస్తున్న క్రమంలో అదృశ్యమైందని చెప్పారు.
అయితే హెలికాప్టర్లో ఇంధనం చాలా తక్కువగా ఉందని యూఎస్ మిలటరీ అధికారులకు హెలికాప్టర్ పైలట్లు చెప్పారని ... ఆ కొన్ని నిమిషాలకే హెలికాప్టర్ ఆచూకీ తెలియకుండా పోయిందని స్టీవ్ వార్నీ వెల్లడించారు. హెలికాప్టర్ అదృశ్యమైన వార్త తెలియగానే ... రంగంలోకి దిగిన మెరైన్ సిబ్బంది సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేదని చెప్పారు. చీకటి కావడంలో గాలింపు చర్యలు నిలిపివేశారని చెప్పారు. ఈ రోజు ఉదయం నుంచి హెలికాప్టర్ ఆచూకీ కనుగొనేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.