helicopter missing
-
కూలిన జపాన్ ఆర్మీ హెలికాప్టర్..10 మంది గల్లంతు
టోక్యో: జపాన్ దక్షిణ దీవుల్లో కుమమోటో నుంచి నిఘా విధుల్లో భాగంగా గురువారం బయలుదేరిన బ్లాక్‌హాక్ రకం హెలికాప్టర్ 10 నిమిషాల అనంతరం రాడార్ నుంచి అదృశ్యమైంది. అది మియాకో, ఇరాబు మధ్య సముద్రజలాల్లో కూలి ఉంటుందని భావిస్తున్నారు. ఆ హెలికాప్టర్‌కు చెందిన లైఫ్‌బోట్‌ను, ఒక తలుపు, తదితర భాగాలను శుక్రవారం సహాయక సిబ్బంది కనుగొన్నారు. హెలికాప్టర్‌లోని డివిజన్ కమాండర్ సహా 10 మంది సిబ్బంది కోసం గాలింపు కొనసాగుతోంది. వీరిలో ఎవరూ ప్రాణాలతో ఉండేందుకు అవకాశం లేదంటూ జపాన్ రక్షణ మంత్రి యసుకాజు హమదా శుక్రవారం మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. వారికోసం గాలింపు కొనసాగిస్తామన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని చెప్పారు. నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమైనట్లు చెప్పారు. చైనా నుంచి ఎదురవుతున్న భద్రతా పరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో రక్షణ సన్నద్ధత కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం గమనార్హం. -
హెలికాప్టర్ గల్లంతు ; విషాదాంతం
సాక్షి, ముంబై: ముంబై తీరంలో పవన్‌హన్స్ సంస్థకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరు గల్లంతయ్యారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్జీసీకి చెందిన ఐదుగురు అధికారులు, ఇద్దరు పైలట్లు సహా ఏడుగురితో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. జుహూలోని పవన్ హన్స్ విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం 10.20 గంటలకు ఓఎన్జీసీకి చెందిన డీజీఎం స్థాయి అధికారులు సహా ఐదుగురు సిబ్బంది, ఇద్దరు పైలట్లతో హెలికాప్టర్ టేకాఫ్ అయ్యింది. 10.30 గంటల సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే ఓఎన్జీసీ, కోస్ట్‌గార్ట్, నేవీ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గాలింపు చర్యల అనంతరం డహాణు సమీపంలో హెలికాప్టర్ అవశేషాలను గుర్తించారు. ఐదు మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, ఓఎన్జీసీకి ముంబై తీరంలో కీలకమైన చమురు నిక్షేపాలు ఉన్నాయి. -
పవన్ హన్స్ హెలికాప్టర్ గల్లంతు
న్యూఢిల్లీ: అసోంలోని డిబ్రుగఢ్ నుంచి బయల్దేరిన పవన్ హన్స్ హెలికాప్టర్ ఆచూకీ గల్లంతైంది. ఈ హెలికాప్టర్లో ఓ సీనియర్ పోలీస్ అధికారితో సహా ముగ్గురు ఉన్నారు. వీరిలో పైలట్, కో పైలట్ ఉన్నట్టు సమాచారం. మంగళవారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్‌లోని ఖోన్సా జిల్లాకు వెళ్లడానికి హెలికాప్టర్లో బయల్దేరారు. డిబ్రుగఢ్‌లో టేకాఫ్ తీసుకున్న తర్వాత హెలికాప్టర్ ఆచూకీ గల్లంతైంది. 11 గంటల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సివుంది. -
హెలికాప్టర్ అదృశ్యం: 8 మంది గల్లంతు
వాషింగ్టన్: నేపాల్ భూకంప ప్రాంతంలో అమెరికాకు చెందిన మెరైన్ హెలికాప్టర్ అదృశ్యమైందని పెంటగాన్ అధికార ప్రతినిధి ఆర్మీ కల్నల్ స్టీవ్ వార్నీ బుధవారం వెల్లడించారు. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు మెరైన్ సిబ్బందితోపాటు ఇద్దరు నేపాలీ సైనికుల జాడ తెలియరాలేదని తెలిపారు. నేపాల్‌లోని భూకంప బాధితుల కోసం మంగళవారం ఆహార పదార్థాలను తరలిస్తున్న క్రమంలో అదృశ్యమైందని చెప్పారు. అయితే హెలికాప్టర్లో ఇంధనం చాలా తక్కువగా ఉందని యూఎస్ మిలటరీ అధికారులకు హెలికాప్టర్ పైలట్లు చెప్పారని ... ఆ కొన్ని నిమిషాలకే హెలికాప్టర్ ఆచూకీ తెలియకుండా పోయిందని స్టీవ్ వార్నీ వెల్లడించారు. హెలికాప్టర్ అదృశ్యమైన వార్త తెలియగానే ... రంగంలోకి దిగిన మెరైన్ సిబ్బంది సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేదని చెప్పారు. చీకటి కావడంలో గాలింపు చర్యలు నిలిపివేశారని చెప్పారు. ఈ రోజు ఉదయం నుంచి హెలికాప్టర్ ఆచూకీ కనుగొనేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.