
7,040 మృతదేహాల వెలికితీత
కఠ్మాండు: నేపాల్ భూకంపం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అధికారికంగా 7,040కు చేరింది. గాయపడిన వారు 14,123 మందికి పెరిగారు. నేపాల్లో గత ఏప్రిల్ 25న భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీనివల్ల ప్రాణాలు కోల్పోయిన వారు దాదాపు 15 వేలు దాటే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు కూడా ఇప్పటికే ప్రకటించారు కూడా.
అయితే, శిథిలాలను తొలగించగా ఇప్పటివరకు లభ్యమైన మృతదేహాలు మాత్రం 7,040. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా వేల సంఖ్యలో మృతదేహాలు బయల్పడే అవకాశం ఉంది. ఈ భూకంపం కారణంగా దాదాపు ఆరు లక్షల మంది కఠ్మాండు విడిచి వెళ్లారు. ధ్వంసం కాని తమ నివాసాలకు వెళ్లేందుకు కూడా వారు భయపడుతున్నారు. ప్రస్తుతానికి కటిక చలిలో మైదాన ప్రాంతాలు, రోడ్లపైనే వారి జీవనం వెళ్లబుచ్చుకుంటున్నారు.