
సహాయక బృందాలు కఠ్మాండులో కూలిపోయిన ఒక చర్చి భవన శిధిలాల నుంచి వెలికి తీసిన మృతదేహాలు
న్యూఢిల్లీ/కఠ్మాండు: నేపాల్లో సంభవించిన భారీ భూకంపాల ధాటికి ఇప్పటివరకు 3 వేల 700 మంది మృతి చెందారు. 6 వేల 833 మంది గాయపడ్డారని నేపాల్ హొం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ భూకంపం వల్ల లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. కఠ్మాండులో ఎన్డీఆర్ఎఫ్(నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ఆపరేషన్ ప్రారంభమైంది. భూటాన్ ప్రధాన మంత్రి త్షేరింగ్ తోబ్గాయ్ కఠ్మాండులో పర్యటిస్తున్నారు.
భూకంపం సంభవించిన ప్రాంతాలలో ప్రజలు నిత్యావసర వస్తువులు దొరకక నానా అవస్తలు పడుతున్నారు. మార్కెట్లు అన్నీ మూసివేశారు. కొందరు తోపుడు బండ్లపైన కొన్ని వస్తువులు అమ్ముతున్నారు. నేపాల్లో ఇంకా 90 శాతం ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలేదు.
ఇదిలా ఉండగా, నేపాల్ భూకంపంలో అస్సాంకు చెందిన ఏడుగురు పర్యాటకులు మృతి చెందినట్లు కేంద్ర మంత్రి సోనోవల్ చెప్పారు. నేపాల్ భూకంప బాధితులకు సీపీఎం పది లక్షల రూపాయల విరాళం ప్రకటించింది.