
కాబోయే తల్లులకు కష్టాలు మిగిల్చిన విలయం
కఠ్మాండు: నేపాల్ ను ఛిన్నాభిన్నం చేసిన భూకంపంతో కాబోయే తల్లులు అష్టకష్టాలు పడ్డారు. భూకంపం సృష్టించిన విలయంతో దాదాపు 50 వేల మంది గర్భిణులు, బాలికలు బాధలు పడ్డారని ఐక్యరాజ్యసమితి ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్(యూఎన్ఎఫ్ పీఏ) తెలిపింది. భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడిన వారిలో సుమారు 50 వేల మంది గర్భిణీలు, బాలికలు ఉన్నారని వెల్లడించింది.
ప్రసవ సంబంధ వైద్య సేవలు అందక గర్భిణులు అవస్థ పడుతున్నారని తెలిపింది. సుఖ ప్రసవానికి అనువైన పరిస్థితులు లేక కాబోయే తల్లులు కాటికి చేరుతున్నారని వాపోయింది. ప్రకృతి విపత్తులోనూ మహిళలు, బాలికల పట్ల వివక్ష కొనసాగుతుండడం పట్ల యూఎన్ఎఫ్ పీఏ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రకృతి ఉత్పతాలు సంభవించినప్పడు గర్భిణులు అధిక సంఖ్యలో మృతి చెందుతున్నారన్న చేదు వాస్తవాన్ని వెల్లడించింది. ఆపత్కాలంలో మానవతా దృక్పథంతో సేవలు అందించాలని కోరింది.