
విద్యార్థులను రప్పించేందుకు చర్యలు
ఏర్పాట్లను సమీక్షిస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నేపాల్‌లో భూకంపం నేపథ్యంలో అక్కడి భరత్‌పూర్ వైద్య కళాశాలలోని 50 మంది తెలంగాణ విద్యార్థులను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ విద్యార్థుల స్వస్థలాలైన కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌లో ఆందోళనలు వ్యక్తమవడంతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు కేంద్ర విదేశాంగ శాఖ, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
కళాశాల యాజమాన్యం విద్యార్థులను ప్రత్యేక బస్సు ద్వారా నేపాల్ సరిహద్దుల వరకు చేర్చేందుకు ముందుకు వచ్చింది. అక్కడి నుంచి విద్యార్థులను సాధ్యమైనంత త్వరగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అందుబాటులో ఉన్న విమాన, రైలు రవాణాను వినియోగించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్‌ను కోరారు. నేపాల్‌లో చిక్కుకున్న విద్యార్థులెవరూ ఆందోళన చెందకుండా ఆత్మస్థైర్యంతో ఉండాలని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.