ఖాట్మండుపై బాంబులు వేశారా..అన్నట్లే!
ఖాట్మండు: 'ఆ ఉదయం చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఖాట్మండు నుంచి నాంచీ బజార్ ఎవరెస్టు బేస్ క్యాంపుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాను. ఒక పజీరో వాహనాన్ని అద్దెకు తీసుకొని నా సామాన్లు వగైరా విషయాలతో బిజీగా ఉన్నాను. ఆ సమయంలో ప్రముఖ దరారా టవర్కు సమీపంలోని హోటల్ లో దిగిన నేను అక్కడి లాబీలో కూర్చుని ఉన్నాను. ఒక్కసారిగా కుర్చీలు వణకడం ప్రారంభమయ్యాయి. ఇంతలో ఎవరో భూకంపం భూకంపం అంటూ కేకలు వేశారు. టేబుల్ను గట్టిగా పట్టుకుని నన్ను కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నించాను. ఇంతలో అవి నా చేతిలో నుంచి జారిపోయి నేను కిందపడిపోయాను.
హోటల్ లోని పెచ్చుళ్లు నా కాళ్లపై పడ్డాయి. నావి బలమైన షూ కావడంతో నాకు గాయాలవలేదు. కొద్ది సెకన్లలో తేరుకుని బయటకు పరుగెత్తాను. నా కళ్ల ముందు ఓ భయంకర అనుభవం. వర్ణించలేని విషాదం. వేలమంది ఇళ్ల కిటికీలోంచి, అంతస్తు పైనుంచి, ఎక్కడ నుంచి బడితే అక్కడి నుంచి భయంతో కిందికి దూకేస్తున్నారు. పెద్ద పెద్ద భవంతులు మొదలు నరికిన చెట్ల మాదిరిగా పడిపోతున్నాయి. వాహనాలు నియంత్రణ కోల్పోయి ఎటుపడితే అటు గుద్దుకుని తీవ్ర భీభత్సం సృష్టించాయి. కాసేపట్లోనే పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా తయారైంది. ఒకరి సలహాతో దగ్గరలో ఉన్న ఓ మైదాన ప్రాంతానికి పరుగుతీసి నిల్చున్నాను.
నాతోపాటు ఓ యూరోపియన్ టూరిస్టు వచ్చి నిల్చుని చెప్పాడు. అక్కడ ఉన్న భారీ టవర్ కూలిపోయి దానికింద వేలమంది పడిపోయారని. కాసేపట్లో వేలమందిమి ఒకే మైదాన ప్రాంతంలో పోగయ్యాం. మా వస్తువులు తెచ్చుకుందామని హోటల్కు వెళితే మరోసారి ప్రకంపనలు వచ్చాయి. దాంతో మేమంతా చనిపోతున్నామని ఏడ్వడం ప్రారంభించాం. కళ్లు మూసుకుని దేవుడిని ప్రార్థించి తెరిచి చూసేవరకు ఖాట్మండు అంతా బూడిదమయమైంది.
ఓ భారీ బాంబును ఖాట్మండుపై వేశారా అన్నట్లుగా కనిపించింది. హాలీవుడ్ సినిమాలో కనిపించే భయంకర వాతావరణం అక్కడ కనిపించింది. ఏడుస్తున్నారు.. పరుగెత్తుతున్నారు.. కళ్ల వెంట ఆపుకోకుండా నీళ్లొస్తున్నాయి. అది నిజంగా ఒక మహా ప్రళయం' అంటూ ఇంగ్లాండుకు చెందిన సాహసి క్రిస్టినా బెర్రీ(25) నేపాల్ భూకంపానికి సంబంధించి తన అనుభవాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఆ తర్వాత ఎయిర్ పోర్ట్ ప్రయత్నం కూడా విఫలమవడంతో తిరిగి అక్కడే నిద్ర లేకుండా ఉండిపోయానని చెప్పింది.