
ఇది నాకు పునర్జన్మ : సందీప్‌రెడ్డి
శాతవాహన యూనివర్సిటీ : నేపాల్‌ను భయబ్రాంతులకు గురిచేసిన భూకంప ప్రదేశం నుంచి ఓ ఎంబీబీఎస్ విద్యార్థి సురక్షితంగా తల్లిదండ్రుల ఒడిచేరారు. కళ్లెదుటే భవనాలు ఊగిపోతుంటే.. తమకెక్కడ ముప్పు వస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నామని మంగళవారం మీడియూ ఎదుట వెల్లడించారు. వివరాలు ఇవీ.. కరీంనగర్ నగరానికి చెందిన కె.సందీప్‌రెడ్డి కఠ్మాండు సమీపంలో బరత్‌పూర్, చింతవాన్‌లో కాలేజ్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. శనివారం ఒక్కసారిగి భూకంపం రావడంతో హడలిపోయాడు. ఆరోజు సెలవు దినం కావడంతో కళాశాలలో ఎవరూ లేరు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులకు భూకంప ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో అందరూ అప్రమత్తమయ్యూరు. మెడికల్ కళాశాలలోని వ్యాధిగ్రస్తులు, విద్యార్థులను యూజమాన్యం డేరాల్లోకి తరలించింది. ముందస్తు హెచ్చరికలతోనే వారు ప్రాణాలతో గట్టెక్కారు. అధికారులు కేటాయించిన వాహనాల సాయంతో ఆదివారం గోరఖ్‌పూర్ చేరుకున్నారు.
సోమవారం న్యూఢిల్లీ చేరిన వారిని ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ తరలించారు. అందులోని సందీప్‌రెడ్డి మంగళవారం కరీంనగర్ చేరి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచి ఇరవై ఐదుగురు అక్కడ విద్యనభ్యసిస్తున్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇండియన్ ఎంబసీతోపాటు, కళాశాల యాజమాన్యంతో ప్రతీరెండుగంటలకోఆరి మాట్లాడారు. దీంతో బాధితులను తక్షణమే సొంతప్రాంతాలకు తరలించారు. కాగా, తామున్న ప్రదేశంలో ప్రాణనష్టం జరగకపోయినా కళ్లెదుటే భవనాలు పగుళ్లు చూపడం, గాలికి చెట్టు ఊగినట్లు భవనాలు ఊగిపోవడం చూస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నామని సందీప్‌రెడ్డి తన అనుభూతి వెల్లడించారు. భూకంపం ప్రభావం నుంచి తప్పించుకోవడం తనకు పునర్జన్మనిచ్చినట్లయిందని ఆనందం వ్యక్తం చేశారు. పరిస్థితులు చక్కబడ్డాక వైద్యవిద్య చదివేందుకు అక్కడకు వెళ్తానని ఆయన చెప్పారు.