భూకంప మృతులు 4 వేలు
నేపాల్‌లో కొనసాగుతున్న సహాయ చర్యలు;
మృతుల సంఖ్య 5 వేలకు చేరే అవకాశం
నిత్యావసరాల కొరతతో అల్లాడుతున్న బాధితులు
భూప్రకంపనలతో ప్రాణభయంతో ప్రజలు
ఆరుబయట ప్లాస్టిక్ టెంట్లలోనే జీవనం;
సాయం కోసం ఎదురుచూపులు
అంతర్జాతీయ సాయం కోసం వేడుకోలు
సహాయ చర్యల్లో ముమ్మరంగా భారత్ బృందాలు
నేపాల్ చేరిన భారత సామగ్రి
కఠ్మాండు: నేపాల్‌లో విలయం మిగిల్చిన విషాదం కొనసాగుతోంది. భూకంప మృతుల సంఖ్య సోమవారం నాటికి దాదాపు 4 వేలకు, క్షతగాత్రుల సంఖ్య 7 వేలకు చేరింది. ఒక్క కఠ్మాండు లోయలోనే సుమారు 11 వందల మంది మృత్యువాత పడ్డారు. వారిలో అసోంకు చెందిన 8 మంది మహిళలు కూడా ఉన్నారు. సింధుపాల్ చౌక్‌లో 875 మంది చనిపోయారు. సహాయ బృందాలు చేరని ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా పర్వతప్రాంతాల్లోని చిన్న చిన్న జనావాసాలు మంచుచరియల కింద కూరుకుపోయాయి. భూకంపం వచ్చి దాదాపు 3 రోజులు కావస్తుండటంతో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి ప్రాణాలపై ఆశలు వదిలేసుకునే పరిస్థితి నెలకొంది. దాంతో మృతుల సంఖ్య 5 వేలు దాటొచ్చని అధికారులు భావిస్తున్నారు.
అంటువ్యాధుల భయంతో మృతులకు అధికారులు సామూహిక దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేలాదిమంది బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ స్థాయి భారీ విలయాన్ని ఎదుర్కొనే సామర్థ్యం లేని నేపాల్ ప్రభుత్వం అంతర్జాతీయ సాయం కోసం అర్థిస్తోంది. సహాయ చర్యల నిపుణులు, వైద్యులు, ఔషధాలు, టెంట్లు, దుప్పట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్, తాగునీరు, ఇంధనం.. మొదలైన నిత్యావసరాలను పంపించాలని కోరుతోంది. సహాయ చర్యల్లో పాలుపంచుకునే హెలీకాప్టర్లు, ఇతర వాహనాలు కూడా ప్రభుత్వం వద్ద పరిమితంగానే ఉన్నాయి. నేపాల్‌లో ఆహారం, తాగునీటి కొరత తీవ్రంగా ఉందని, దాదాపు 10 లక్షల మంది చిన్నారులకు తక్షణం మానవతాసాయం అవసరమని ఐక్యరాజ్య సమితి సంస్థలు పేర్కొన్నాయి.
సాయం అందిస్తూ.. అనేక దేశాల నుంచి వచ్చిన రక్షక నిపుణులు, సహాయ బృందాలు, వైద్యులు ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. పలు దేశాలు భారీగా సహాయ సామగ్రిని పంపిస్తున్నాయి. వర్షంతో పాటు నిలిచిపోయిన విద్యుత్, రవాణా, సమాచార సౌకర్యాలు సహాయ చర్యలను ఆటంకపరుస్తున్నాయి. స్వదేశం కోసం వెళ్లేందుకు బారులు తీరిన బాధితులు, వివిధ దేశాల నుంచి పలు విమానాల్లో భారీగా వస్తున్న సహాయ సామగ్రితో కఠ్మాండులోని ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది.
భారత్ ఆపన్నహస్తం.. పొరుగుదేశం నేపాల్‌కు ఆపన్న హస్తం అందించడంలో భారత్ ముందుంది. జాతీయ విపత్తు స్పందన దళానికి(ఎన్‌డీఆర్‌ఎఫ్) చెందిన 10 బృందాలు, 13 సైనిక విమానాలు సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి.
ఎన్‌డీఆర్‌ఎఫ్ చీఫ్ ఓపీ సింగ్ నేపాల్‌కు వెళ్లి స్వయంగా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రులకు చెందిన వైద్య బృందం వైద్య సేవలందిస్తోంది. మరింతమంది నిపుణులను, సిబ్బందిని, సహాయ సామగ్రిని పంపించేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. 011-1078 నంబర్‌తో ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. నేపాల్‌నుంచి సోమవారం రాత్రి వరకు 30 మంది విదేశీయులు, 5370 మంది భారతీయులు భారత్ చేరుకున్నారు.