![జూన్ 27న సినీ తారలతో టీ డిన్నర్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71430198754_625x300_0.jpg.webp?itok=xChVui24)
జూన్ 27న సినీ తారలతో టీ డిన్నర్
‘సాక్షి’ ఆధ్వర్యంలో చారిటీ కార్యక్రమం
జూన్ 27న సినీ తారలతో టీ డిన్నర్
వచ్చే మొత్తాన్ని బాధితులకు అందజేయనున్న ‘నావా’
హైదరాబాద్: ఏప్రిల్ 25న నేపాల్‌లో వచ్చిన భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. రెండు నెలలు గడుస్తున్నా అక్కడి పరిస్థితుల్లో మార్పు రాలేదు. చిరు దేశం అంత పెద్ద భూకంపం ధాటికి అన్ని రకాలుగా చితికిపోయింది. అక్కడి ఇళ్లు, స్కూళ్లు, ఆసుపత్రులు శిథిలమయ్యాయి. నేపాల్ దేశానికి ముఖ్య ఆర్థిక వనరైన టూరిజం తగ్గిపోయింది. భూప్రకంపనలు ఇంకా కొనసాగుతుండడమే దీనికి ప్రధాన కారణం. జీవనాధారం లేక ప్రజా జీవితం అగమ్యగోచరంగా మారింది.
ప్రకృతి ప్రకోపానికి గురయిన అక్కడి ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పొరుగు దేశపౌరులుగా నేపాల్ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యతను అందరం పంచుకుందాం. వీలైనంత సాయమందిద్దాం... సాక్షి మీడియా సామాజిక బాధ్యతతో బాధితులకు సహాయం అందించటానికి అవకాశం కల్పిస్తోంది. నేపాల్ భూకంప బాధితులకు విరాళాలు అందించేందుకు తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌తో కలసి ఒక చారిటీ కార్యక్రమాన్ని చేపట్టింది.
వివరాలివి: తాజ్ ఫలక్‌నుమాలో జూన్ 27న జరిగే ఈ కార్యక్రమంలో నటి రెజీనా సహా పలువురు సినీతారలతో కలసి టీ, డిన్నర్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి తగు మొత్తంతో కూడిన డోనర్ పాస్‌లు విక్రయిస్తారు. పాస్‌ల ద్వారా వచ్చే మొత్తాన్ని నేపాల్ బాధితులకు నేపాల్ ఆర్మీ వైవ్స్ అసోసియేషన్(నావా) వారు అందచేయనున్నారు. ఇతర వివరాలకు, డోనర్ పాస్‌ల కోసం 9989613749, 9000913320, 040-66298518 నంబర్‌లను సంప్రదించవచ్చు. చెక్ ద్వారా తమ విరాళాలను పంపాలనుకునే వారు... నేపాల్ ఆర్మీ వైవ్స్ అసోసియేషన్, ఫ్లాట్ నంబర్ 401, పీఎస్‌ఆర్ మెన్షన్, హోలీమేరీ బిజినెస్ సూల్ దగ్గర, లీలా నగర్, ధరమ్ కరమ్ రోడ్, అమీర్‌పేట్, హైదరాబాద్... అడ్రస్‌కి పంపించవచ్చు.