ఫేస్బుక్ కలిపింది వారందరినీ!
నేపాల్ భూకంపం బారిన పడిన దాదాపు 70 లక్షల మంది తమ స్నేహితులు, కుటుంబసభ్యులను కలిసేందుకు ఫేస్బుక్ను ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అంతేకాదు.. బాధితులను ఆదుకునేందుకు రెండు రోజుల్లో దాదాపు రూ. 64 కోట్ల విరాళాలను కూడా ఫేస్బుక్ సేకరించింది. తాము 'సేఫ్టీచెక్' అనే ఆప్షన్ను యాక్టివేట్ చేశామని, దాంతో దాదాపు 70 లక్షల మంది సురక్షితంగా ఉన్నట్లు అందులో మార్క్ అయిందని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ చెప్పారు.
ఆ విషయాన్ని వాళ్లు దాదాపు 15 కోట్ల మంది స్నేహితులకు, బంధువులకు తెలియజేశారని కూడా వివరించారు. దానివల్ల సహాయ కార్యక్రమాలు చేపట్టడం కూడా సులువైంది. నేపాల్ బాధితులను ఆదుకోడానికి విరాళాలు ఇవ్వాలని ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వగా, రెండు రోజుల్లో దాదాపు రూ. 64 కోట్ల వరకు వసూలయ్యాయి. ఫేస్బుక్ యాజమాన్యం దానికి అదనంగా మరో రూ. 13 కోట్లు విరాళం ఇవ్వనుంది. వాట్సప్ ద్వారా కూడా ఆ ప్రాంతంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుంటూ ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు. ఇప్పటివరకు నేపాల్ భూకంప విలయంలో సుమారు 6 వేల మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది సుమారు 10 వేల వరకు కూడా చేరొచ్చని అంచనా.