హిమాలయ పర్వత ప్రాంత దేశం నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. శనివారం ఉదయం సంభవించిన తీవ్ర భూకంపానికి రాజధాని కఠ్మాండు నగరం శిథిలాల దిబ్బగా మారింది. రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైన భూకంపం తీవ్ర విధ్వంసానికి మృతుల సంఖ్య ఇప్పటికే రెండు వేలకు మించిపోగా, గాయపడినవారి సంఖ్య నాలుగు వేలకు పైగా పెరిగింది. భూకంప కేంద్రం కఠ్మాండుకి 75 కిలోమీటర్ల దూరంలోని లాంజంగ్ జిల్లాలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ జిల్లాతో సహా కఠ్మాండు, భరత్‌పూర్, పొఖారా, కిరీటిపూర్ నగరాలు భారీగా ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి గుైరయ్యాయి.
క్షతగాత్రుల ఆర్తనాదాలు, మృతుల బంధువుల రోదనలు, శిథిలాల నుంచి బయటపడలేని నిస్సహాయుల దైన్యం, గల్లంతైనవారి ఆత్మీయులు ఆందోళనతో సుప్రసిద్ధ చారిత్రక, పర్యాటక కేంద్రంగా విరాజిల్లిన కఠ్మాండు బీభత్స నగరిగా మారింది. భూకంపం తర్వాత సంభవించే తదుపరి ప్రకంపనాల భయం తో బతికి బయటపడ్డవాళ్లంతా గడ్డకట్టే చలిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆరు బయటే గడపాల్సివస్తోంది.
భూకంపం తర్వాత అరగంటకు 6.6 తీవ్రతతోనూ, ఆదివారం ఉదయం 6.7 తీవ్రతతోనూ సంభవించిన తదుపరి ప్రకంపనలు మరిం త నష్టాన్ని కలుగజేశాయి. పైగా మరిన్ని ప్రకంపనలకు అవకాశాలున్నాయని తెలు స్తోంది. అతి సున్నితమైన హిమాలయ పర్వత సానువులు తీవ్ర ప్రకంపనలకు గురై కొండ చరియలు విరిగి పడటం మొదలైంది. ఇది చాలదన్నట్టు ఉరుములతో కూడి న వర్షాలు ముంచుకు రానున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవన్నీ సహాయ కార్యక్రమాలకు తీవ్ర ప్రతిబంధకాలే.
దాదాపు రెండు దశాబ్దాలుగా నిరంతర రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న నేపాల్ ప్రభుత్వ యంత్రాంగం ఒంటరిగా ఈ పెను విపత్తును ఎదుర్కోవడం అసాధ్యం. పొరుగు దేశంగానేగాక, నేపాల్‌తో మనకున్న సుదీర్ఘ చారిత్రక, సాంస్కృతిక అనుబంధాన్ని, మైత్రీ బంధాన్ని దృష్టిలో ఉంచుకొని మన కేంద్ర ప్రభుత్వం అడిగేంత వరకు ఆగకుండానే తక్షణమే యుద్ధ ప్రాతిపదికపై సహాయక చర్యలకు ఉపక్రమించడం, నేపాల్‌లో చిక్కుకు పోయిన భారతీయులను తరలిస్తుండటం ముదావహం.
నిజానికి నేపాల్ భూకంపాన్ని మొత్తంగా దక్షిణ ఆసియాగా పిలిచే భౌగోళిక ప్రాంతమంతటికీ విపత్తుగానే పరిగణించాల్సి ఉంది. మనం గీసే రాజకీయ సరిహ ద్దులకు అతీతమైన భౌగోళిక ఐక్యత దక్షిణాసియాను ఒకటిగా చేసింది. భారత ఉపఖండం ఉన్న భూ ఉపరితల ఫలకం ఉత్తరంగా ఉన్న యురేసియన్ భూ పలకం దిశగా కదులుతుండటం ఫలితంగానే హిమాలయ పర్వత ప్రాంతమంతా తీవ్ర, అతి తీవ్ర భూకంప ప్రాంతంగా ఉంది.
కాబట్టే లాంజంగ్ కేంద్రంగా సంభవించిన భూకంపం నేపాల్, భారత్, చైనా, భూటాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను ప్రభావితం చేసింది. నేపాల్ కంటే తక్కువస్థాయిలోనే అయినా భారత్, టిబెట్, బంగ్లాదేశ్‌లలో ప్రాణనష్టం, ఆస్తినష్టం గణనీయంగా సంభవించాయి. ఆదివారం ఉదయం సంభ వించిన తదుపరి ప్రకంపనలు సైతం దక్షిణ ఆసియా అంతటికీ విస్తరించాయి. తదుపరి భూకంపానికి ఉత్తర భారతమే కేంద్రం కాగలదని సెస్మాలజిస్టులు హెచ్చ రిస్తున్నారు.
కశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలోని హిమాలయాలలో ఎక్కడైనా భూకంప కేంద్రం ఉండవచ్చని చెబుతున్నారు. ఈ భూకంపం నేడే లేదా మరో 50 ఏళ్లకైనా సంభవమేనని చేస్తున్న ఈ హెచ్చరికలను కొట్టిపారేయడానికి వీల్లేదు. ఇవ న్నీ అతి తీవ్ర భూకంప ప్రాంతాలుగా శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. దాని ప్రభావం ఢిల్లీ సహా విశాల ప్రాంతాలపైన తీవ్రంగా ఉంటుంది. భారత్‌లో ఇదే స్థాయి భూకంపం సంభవిస్తే ప్రాణనష్టం పది రెట్లకు పైగా ఉండక తప్పదని అంచ నా. ఆ మూడు ప్రాంతాలే కాదు ఢిల్లీ సహా దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్ర భూకంప ప్రాంతాలని గుర్తించారు. సగానికి పైగా దేశం భూకంప ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదని చాలా కాలం క్రితమే గుర్తించారని మనం విస్మరిస్తున్నాం.
నేపాల్‌లో పెను భూకంపం సంభవించనున్నదని రెండు నెలల క్రితమే శాస్త్ర వేత్తలు కనిపెట్టారు. విపత్తు విరుచుకుపడ్డానికి సరిగ్గా వారం ముందే 50 మంది సెస్మాలజిస్టులు, సామాజిక శాస్త్రవేత్తలు, కార్యకర్తలు అధ్యయనం కోసం, సహా యక చర్యల కోసం నేపాల్‌కు చేరుకున్నారు కూడా. భూకంప శాస్త్రజ్ఞులు ముప్పు సంభవించే ప్రాంతాన్ని గుర్తించగలరేగానీ సరిగ్గా ఎప్పుడు సంభవిస్తుందో చెప్ప లేరు. కాబట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలుండవు.
భూకంప ప్రాంతాలుగా గుర్తించిన ప్రాంతాలు జనసమ్మర్థంతో కిక్కిరిసి ఉండటం, పలు అంతస్తుల సముదాయాలు, భూకంపాలకు నిలవలేని నిర్మాణాలు ఎందుకు ఉంటు న్నట్టు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది. అస్థిత్వంలో ఉన్నదో లేదో కూడా తెలియని నేపాల్ ప్రభుత్వం కాదు. మూసపోత నగరీకరణను ప్రపంచమంతటికీ విస్తరింపజేస్తున్న ప్రపంచ శక్తులు. శతాబ్దాల తరబడి ప్రపంచంలోని వివిధ ప్రాం తాల భిన్న వాతావారణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా, ఆయా ప్రాంతా లకు విలక్షణమైన ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే వైవిధ్యభరితమైన జనావాసా లు, నిర్మణ కౌశలమూ అభివృద్ధి చెందాయి. అవి ఆయా జాతుల, ప్రజల సాంస్కృ తిక వారసత్వంగా నిలిచాయి.
శాస్త్రసాంకేతిక విజ్ఞాన ప్రగతితో ప్రకృతిని శాసించగ లమనే అహంకారం ప్రకృతికి అనుగుణ్యమైన ఆ జీవన విధానాన్ని, వైవిధ్యాన్ని నిర్మూలిస్తోంది. దీర్ఘకాలికమైన ప్రకృతి పరిణామాలను, విపత్తులను హ్రస్వ దృష్టి తో, తక్షణ లాభాపేక్షతో ఉపేక్షిస్తున్నది. కాబట్టే మనం నిర్మించుకున్న నాగరికతా సౌధాలే మనకు సమాధులుగా మారే పరిస్థితి ఏర్పడుతోంది.
దురాశాపూరితంగా ప్రకృతిని కొల్లగొట్టి, వాతావారణ పరిస్థితులను మార్చి మనం సృష్టించుకుంటున్న ఉత్పాతాలన్నిటికీ శాస్త్ర సాంకేతిక ప్రగతి పరిష్కారం చూపగలదనే భ్రమలను పెంచుకుంటున్నాం. సునామీలు, భూకంపాలు అలాంటి భ్రమలను తునాతునకలు చేసే హెచ్చరికలు. ఇకనైనా ఆ హెచ్చరికలను పట్టించుకుందామా?
వేచి చూసి కాటేసిన పీడకల
Published Mon, Apr 27 2015 12:32 AM | Last Updated on Sat, Oct 20 2018 6:37 PM
Advertisement
Advertisement