
నరక మేంటో తెలిసింది
సాక్షి, న్యూఢిల్లీ: ‘నరకం ఎలా ఉంటుందో చూశాం. ప్రత్యక్షంగా అనుభవించాం. జీవితం లో ఇలాంటి విధ్వంసం ఎన్నడూ చూడలేదు. పశుపతి నాథుడి దయవల్లే బతికి బయటపడ్డాం’ ఇది నేపాల్ లోని కఠ్మాండు భూకంపం నుంచి సురక్షితంగా బయపడి ఢిల్లీ చేరుకున్న తెలుగువారి ప్రతిస్పందన. స్థానిక ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఎన్నో ఇబ్బం దులు పడ్డామని, భారతీయ వాయుసేన చొరవతోనే ఢిల్లీకి చేరుకోగలిగామన్నారు.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఢిల్లీకి చేరుకున్న బాధితుల్లో మొత్తం 54 మంది తెలుగువారున్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్, హయత్‌నగర్‌కు చెందిన 35 మంది, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మార్టేరు, రావులపాలెం, వెలుగులేరుకి చెందిన 19 మంది ఉన్నారు. ఢిల్లీలోని ఏపీభవన్, తెలంగాణ భవన్ సిబ్బంది బాధితులను ఆయా భవన్‌లకు తరలించి, వసతి ఏర్పాటు చేశారు.
పశుపతినాథ్ దయతోనే..
భయంకరమైన భూకంపం బారి నుంచి ఆ పశుపతినాథుడి దయతోనే బయటపడగలిగినట్టు హైదరాబాద్, హయత్‌నగర్ మండలం శాంతినగర్ కాలనీ వాసులు తెలిపారు. 35 మంది పశుపతినాథ్ యాత్రకు వెళ్లినట్టు చెప్పారు. ‘మేం పశుపతినాథ్ దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటే ఈ ప్రళయం చోటుచేసుకుంది. అప్పుడు మేమంతా బస్సులో ఉన్నాం. బస్సు ఒక్కసారిగా ఊగడం మొదలయ్యింది. మేమంతా భయంతో ఆ దేవుణ్ని తలచుకుంటూ కూర్చున్నాం. కొద్దిసేపటి తర్వాత ఒక ఓపెన్‌ప్లేస్‌కి మా బస్సును తీసుకెళ్లాక ఊపిరి పీల్చుకున్నాం’ అని శాంతినగర్‌కి చెందిన శశికళ కన్నీటి పర్యంతమయ్యారు.
స్వస్థలాలకు బాధితులు: ఢిల్లీ ఏపీభవన్‌కి చేరుకున్న 54 మంది బాధితులను నాలుగు విమానాల్లో ఆదివారం సాయంత్రానికే వారి స్వస్థలాలకు పంపినట్టు సిబ్బంది తెలిపారు. మరికొందరు ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని, భారత విదేశాంగశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ తెలుగు రాష్ట్రాల వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు.
కాగా, ఆది వారం మధ్యాహ్నం 12-50 గంటల సమయం లో మరోమారు ఢిల్లీలో భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. దీంతో ఏపీ భవన్‌లోని వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఆది వారం రాత్రి మరో తొమ్మిది మంది బాధితులు ఢిల్లీకి చేరుకున్నారని, వీరిలో ఐదుగురు హైదరాబాద్‌కి చెందిన వారు, నలుగురు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారు ఉన్నారని ఏపీ భవన్ సిబ్బం ది తెలిపారు. సోమవారం ఉదయం వీరిని స్వస్థలాలకు పంపనున్నట్టు తెలిపారు.
భీతావహులై.. పరుగులు తీశాం
ఏపీ భవన్‌కి చేరుకున్న కొందరు బాధితులు మీడియాతో మాట్లాడుతూ ‘భూకంపం వచ్చినప్పుడు మేం పశుపతినాథ్ ఆలయం దగ్గరున్నాం. ఒక్కసారిగా బిల్డింగ్‌లు కూలిపోవడం చూసి భయంతో పరుగులు తీశాం. మాతోపాటు వచ్చిన వాళ్లలో కొందరు ఆలయంలో, మరికొందరు ఆలయ గోశాలలో తలదాచుకున్నారు. జనమంతా రోడ్లమీదికి వచ్చేశారు.
బిల్డింగ్‌లు కూలిపోయా యి. మేం బయటపడ్డాం. నెమ్మదిగా అక్కడి నుంచి కఠ్మాండు ఎయిర్‌పోర్టుకి వచ్చాం. అక్కడ మన ఎయిర్‌ఫోర్స్ విమానాల్లో ఢిల్లీకి వచ్చాం. ఇంకా నాలుగైదు వేల మంది తెలుగువాళ్లు కఠ్మాండులోనే ఉన్నారు. సరైన సమాచారం అందక అంతా ఇబ్బంది పడుతున్నారు’ అని తూర్పుగోదావరి జిల్లా మార్టేర్ ప్రాంతానికి చెందిన బాధితులు తెలిపారు.