
రూ. 4 లక్షల చొప్పున పరిహారం: నితీశ్
పాట్నా: భూకంపంతో తమ రాష్ట్రంలో 50 మంది మృతి చెందారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కార్యదర్శి స్థాయి అధికారులతో ఆదివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు. మంత్రులు, కార్యదర్శలు జిల్లాల్లోనే ఉండి సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించాలని సూచించినట్టు నితీశ్ కుమార్ తెలిపారు.
అకాల వర్షాలతో అతలాకుతలమైన జిల్లాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలతో పాటు భూకంప బాధిత ప్రాంతాల్లోనూ వీటిని చేపట్టాలని ఆదేశించారు. భూకంప మృతులకు కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గత కొద్ది నెలలుగా ప్రకృతి ఉత్పాతాలతో బీహార్ ప్రజలు తల్లడిల్లారు. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన వర్షాలతో పూర్నియా, ఇతర జిల్లాలు అతలాకుతలమైయ్యాయి. వీటిని నుంచి కోలుకోకముందే భూకంపం సంభవించింది.