ఐదు రోజులుగా కొన ఊపిరితో శిథిలాల కింద..
కఠ్మాండు: నేపాల్లో సహాయక చర్యలకోసం తీవ్రంగా శ్రమిస్తోన్న సైనికుల ముఖాల్లో చిరునవ్వులు పూస్తున్నాయి. వారు మరింత వేగంగా పనిచేయాలన్న ఆలోచనలు వేగం పుంజుకుంటున్నాయి. అందుకు ప్రధాన కారణం.. మృత్యుదిబ్బలా మారిన కఠ్మాండులో శిథిలాల కింద నుంచి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నవారు కొద్ది కొద్దిగా బయటపడుతున్నారు. శరవేగంగా శిథిలాలు తొలగిస్తున్న గాంగ్బూ అనే గ్రామంలో దేవీ ఖాడ్కా (24) అనే మహిళ ప్రాణాలతో బయటపడింది.
భూకంపం ధాటికి కుప్పకూలిన జనసేవా అనే అతిథి గృహ శిథిలాల కింద ఆమె పడిపోయింది. అయితే నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇజ్రాయెల్ సైన్యం కలసి అక్కడ శిథిలాలను తొలగించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆమెకు గాయాలు కూడా అయ్యాయి. గత ఏప్రిల్ 25న నేపాల్లో రిక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతతో భూకంపం సంభవించి 5,000మంది చనిపోగా.. 12,000మందికి పైగా గాయాలయ్యాయి.