డర్టీ సెల్ఫీ..
ఈ మధ్యకాలంలో మనుషులు సరిగా కనిపించకపోయినా..వారిచేతిలో స్మార్ట్ ఫోన్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది కూడా వారి తలకంటే ఎత్తుగా.. అద్దంలో చూసుకుంటున్నట్లుగా.. దానికి ముద్దుగా వారు పెట్టుకున్న పేరు సెల్ఫీ. గతంలో అవతలి వ్యక్తికి నష్టం జరిగాక మాత్రమే ఎదుటవారి స్వార్థం తెలిసేది. కానీ, ఇప్పుడు మాత్రం నష్టం జరుగుతుండగానే తెలుస్తోంది. అది కూడా ఎంతటి భయంకరమైన స్వార్థమో చెప్పేందుకు తాజా సెల్ఫీలే ఉదాహరణ.
మానవత్వం పనిచేయాల్సిన చోట కూడా వెర్రి వేశాలు, తిక్క చేష్టలు, ఆలోచన లేని పనులు ఈ సెల్ఫీల ద్వారా ఆవిష్కృతమవుతున్నాయి. అది ఎంతగా అంటే కళ్లేదుటే ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు. అక్కడా ఇక్కడా ఎక్కడా అనే సందర్భమే లేకుండా కొన ఊపిరితో కొట్టుకునేవారి నుంచి చచ్చిన శవాన్ని సైతం వదిలిపెట్టడం లేదు. ఎదుటవారిని బాధను, నిస్సహయతను వినోద వస్తువులుగా.. ఫొటోలకు పనికొచ్చే పనిముట్లుగా భావించి సెల్ఫీలంటూ ఫొటోలు తీస్తున్నారే తప్ప మానవత్వాన్ని మాత్రం ప్రదర్శించలేదు.
నేపాల్ను భూప్రళయం అతలాకుతలం చేసి శవాల దిబ్బగా మారిస్తే...మరికొందరు మహరాజులు మాత్రం...నవ్విపోదురు నాకేంటి అన్నట్లు విషాదానికి చిహ్నంగా మిగిలిన చారిత్రక శిథిలాల దగ్గర పళ్లికిలిస్తూ ఫోటోలు దిగి ఫేస్బుక్ల్లో పోస్ట్ చేయటం చూస్తుంటే మనం ఎటు పోతున్నామనే అనుమానం వస్తోంది. తాజాగా నేపాల్ భూకంప సమయంలో కూడా ఇలాంటి దృశ్యాలే దర్శనమిచ్చాయి. ఇటువంటి సంఘటనలు చూస్తుంటే మనం ఎటువైపు వెళ్తున్నామా అనే అనుమానం వస్తోంది. సెల్ఫీలు..'సెల్ఫీ'ష్కు నిదర్శనంగా మారిందా అని ప్రశ్నించుకోక తప్పదు.
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే... చుట్ట వెలిగించుకోవటానికి నిప్పు అడిగాడట ఇంకొకడు అన్న సామెతలాగా.. ఓవైపు ప్రాణాలు పోతున్నా...కాపాడాలనే స్పృహ లేనంతగా సెల్ఫీ పిచ్చి ముదిరిపోయింది. మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్నవాడు మనిషన్నవాడు అన్నట్లు... మనిషి నైతిక విలువలకు తిలోదకాలిస్తూ..ఆపదలో ఉండేవారికి కాపాడాలనే ఇంగిత జ్ఞానాన్ని కూడా మరిచిపోతున్నారు.
సెల్ఫీకి ఉపయోగించే సమయాన్ని నా కోసం కాకుండా మన కోసం అనేదానికి వినియోగిస్తే.. వచ్చే ఆత్మ తృప్తి ఎంత డబ్బుపెట్టి కొన్నా రాదనేది సత్యం. ఆస్తులు రాసివ్వడమే.. అవసరానికి అప్పు ఇవ్వటమో కాదు...జస్ట్ రోడ్డు దాటలేని వారికి చేయిచ్చి...వారిని రోడ్డు దాటించి చూడంది. అప్పుడు మనకు కలిసే సంతృప్తి దేనితోనూ కొలవలేము. సెల్ఫీ అంటే నిన్ను నీవు తీసుకోవటం కాదు. నిన్ను కాకుండా నీ మనసును టచ్ చేసి చూస్తే తెలుస్తుంది. అలా కాకుంటే చివరికి మిగిలేది డర్టీ సెల్ఫీనే.
(వెబ్ సైట్ ప్రత్యేకం)