- సీఐఐ సదస్సులో సీఎం సిద్ధరామయ్య
- కేపీసీసీ నియామకాల రద్దు సబబే
- విపక్షాల అనవసర రాద్ధాంతం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలోని ప్రస్తుత పరిశ్రమలు, కొత్తగా స్థాపించబోయే పరిశ్రమలకు ప్రాథమిక సదుపాయాలను కల్పించడానికి కొత్త విధానాన్ని రూపొందిస్తామని, తద్వారా పారిశ్రామిక ప్రగతికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. నగరంలోని ఓ హోటల్‌లో భారతీయ పరిశ్రమల సంఘాల సమాఖ్య (సీఐఐ) శుక్రవారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఐటీ రంగాన్ని మరింతగా అృవద్ధి పరచడానికి ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ కనబరుస్తుందని తెలిపారు. ప్రపంచ పెట్టుబడుల్లో కర్ణాటకను అత్యంత ప్రాధన్యతా గమ్య స్థానంగా తీర్చి దిద్దడానికి గత ఏడాది ప్రారంభించిన ‘4ఐ’ విధానానికి పారిశ్రామిక రంగం నుంచి చక్కటి స్పందన లభించిందని చెప్పారు.
నియామకాల రద్దు సబబే
కేపీఎస్‌సీ ద్వారా 2011లో చేపట్టిన నియామకాలను రద్దు చేయడం సబబేనని ముఖ్యమంత్రి సమర్థించుకున్నారు. అప్పట్లో కేఏఎస్ గ్రూపు-1, గ్రూపు-2 ఉద్యోగాలకు 362 మంది ఎంపిక కాగా, ఇందులో అవకతవకలు చోటు చేసుకున్నాయని తేలడంతో రాష్ట్ర మంత్రి వర్గం గురువారం ఆ నియామకాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై సీఐడీ కూడా దర్యాప్తు చేపట్టి, అవకతవకలు నిజమేనని తేల్చిందని చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎస్. నిజలింగప్ప 14వ వర్ధంతిని పురస్కరించుకుని విధాన సౌధలోని ఆయన విగ్రహానికి శుక్రవారం నివాళులు అర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ విషయంలోనైనా న్యాయ శాఖ, అడ్వొకేట్ జనరల్, సీఐడీ అభిప్రాయాలను పక్కన పెట్టడం సాధ్యం కాదని చెప్పారు. అవినీతిని అంతమొందించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న క్రమంలో, ఇలాంటి అవకతవకలను ఎలా సహించగలమని ప్రశ్నించారు.
దీని వల్ల కొందరికి అన్యాయం జరిగి ఉన్నప్పటికీ, అవినీతికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అప్పట్లో 1,085 గెజిటెడ్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించగా, 362 మంది ఎంపికయ్యారని తెలిపారు. పరీక్షలకు హాజరైన వారిలో ఇద్దరు మినహా మిగిలిన వారందరికీ ఒకే విధమైన మార్కులు వచ్చాయంటూ, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఇలాంటి విషయాల్లో రాజకీయాలు వద్దని ఆయన హితవు పలికారు.