Indian industry associations
-
Azadi Ka Amrit Mahotsav: ప్రధాని పిలుపు ఆచరణీయం
న్యూఢిల్లీ: భారత్‌ను వచ్చే 25 ఏళ్లలో (2047 నాటికి) అభివృద్ధి చెందిన దేశంగా మారిపోవాలంటూ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు పట్ల భారత పరిశ్రమల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల సందర్భంగా సోమవారం ప్రధాని ఈ పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు అయ్యే నాటికి దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి, దేశీయ తయారీని పెంచే లక్ష్యాన్ని సాధించాలని పారిశ్రామిక రంగాన్ని కోరారు. అంతేకాదు, ఈ దశాబ్దం భారత్‌కు టెకేడ్‌గా ప్రధాని అభివర్ణించారు. 5జీ, సెమీకండక్టర్ల తయారీ, డిజిటల్ సేవల ద్వారా రూపాంతరం చెందడాన్ని ప్రస్తావించారు. దీంతో ప్రధాని పిలుపు స్ఫూర్తినీయం, ఆచరణీయమంటూ పారిశ్రామిక మండళ్లు పేర్కొన్నాయి. ప్రధాన మంత్రి ప్రతిష్టాత్మక స్వప్నమైన ఆత్మనిర్భర భారత్ (స్వావలంబన/స్వయం సమృద్ధి భారత్) సాకారంలో భారత పరిశ్రమలు పోషించనున్న ప్రాధాన్యాన్ని ప్రస్తావించాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తలైన గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ తదితరులు తమ కార్పొరేట్ కార్యాలయాల వద్ద స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొని, సరికొత్త భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, మనవడు పృథ్వీఅంబానీతో కలసి పాల్గొన్నారు. టెక్నాలజీ భాగస్వామ్యం టెక్నాలజీ రంగం భవిష్యత్తును ప్రధాని కచ్చితంగా గుర్తించారు. ప్రపంచ జీడీపీపై దీని ప్రభావం 17 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుంది. 2033 నాటికి భారత్‌లో ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ పరిశ్రమ 6 కోట్ల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తుంది. జీడీపీలో 3 లక్షల కోట్ల డాలర్ల విలువను కలిగి ఉంటుంది. – హరిఓమ్‌రాయ్, లావా ఇంటర్నేషనల్ చైర్మన్, ఎండీ గర్వంగా ఉంది తన శక్తిసామర్థ్యాలను ప్రపంచం సందేహిస్తున్నా, మన దేశ నిర్మాణం తీరు పట్ల గర్వంగా ఉన్నాను. అంకుర సంస్థల (స్టార్టప్‌లు) నుంచి క్రీడల (స్పోర్ట్స్) వరకు, మన యువత ప్రపంచ అంచనాలను దాటి రాణిస్తోంది. వచ్చే 25 ఏళ్లలో సిలికాన్ వ్యాలీ కంటే మెరుగైన ప్రపంచ టెక్నాలజీ కేంద్రంగా మనం అవతరించనున్నాం. సంచలనమైన సాంకేతిక టెక్నాలజీలతో త్వరలోనే మనల్ని మనం ఆత్మనిర్భర భారత్‌గా మలుచుకోనున్నాం. – అనిల్ అగర్వాల్, వేదాంత చైర్మన్ ఎంతో సాధించాం భారత్‌కు అభివృద్ధి చెందిన దేశా హోదాను తీసుకురావడం అన్నది తక్కువేమీ కాదు. అది మనందరికీ గొప్ప స్ఫూర్తినిస్తుంది. పునరుత్పాదక ఇంధనం సహా కీలకమైన ఎన్నో రంగాల్లో భారత్ స్వావలంబన సాధించేందుకు కట్టుబడి ఉంది. ప్రధాని అంచనాలకు అనుగుణంగా పరిశ్రమలు ఎదగాల్సిన అవసరం ఉంది. ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చే విషయంలో భారత్ వెనుకబడి ఉండరాదు. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ విద్య, ఆరోగ్యంపై దృష్టి అవసరం మార్పు దిశగా 130 కోట్ల మంది భారతీయుల సమిష్టి స్ఫూర్తిని ప్రధాని తట్టి లేపారు. ప్రధాని స్వప్నం భారత్ ః 100 అజెండా సాధనకు టెంప్లేట్‌ను నిర్ధేశించింది. ప్రపంచానికి యువత రూపంలో నిపుణులను అందించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. విద్య, ఆరోగ్యం రానున్న సంవత్సరాల్లో దృష్టి సారించాల్సిన రంగాలు. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ పురోగతికి అడ్డు లేదు 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను మనం సంబరంగా చేసుకుంటున్నాం. భారత్ అనంతమైన అవకాశాలు, వేగవంతమైన వృద్ధి అంచున నిలుచుంది. మన యువత కలలు, కోరికల మద్దతుతో గొప్ప ప్రజాస్వామ్యం అసలు కథ ఇప్పుడే మొదలైంది. భారత్ పురోగతికి ఎటువంటి అడ్డే లేదు. జై హింద్. – గౌతమ్ అదానీ, అదానీ గ్రూపు చైర్మన్ పరిశ్రమ కీలక పాత్ర ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో ప్రైవేటు రంగం ప్రముఖ పాత్ర పోషించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భారత పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. – సంజీవ్ మెహతా, ఫిక్కీ ప్రెసిడెంట్ -
పరిశ్రమ ధైర్యంగా రిస్క్ చేయాలి
న్యూఢిల్లీ: ఇబ్బందులు వచ్చినా (రిస్క్) తట్టుకుని నిలబడదామన్న సాహసోపేత ధోరణిని భారత్ పరిశ్రమ పెంపొందించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. కరోనా తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్న భారత్ ఎకానమీ తిరిగి వేగం పుంజుకుంటోందని కూడా ఆయన బుధవారం పేర్కొన్నారు. ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ– కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు ఇవీ... ► దేశ ప్రయోజనాల పరిరక్షణలో ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం ఇటీవల కీలక సంస్కరణలను తీసుకువచ్చింది. ఇవి సాహసోపేత నిర్ణయాలు. మహమ్మారి సమయంలోనూ సంస్కరణల బాటలో ప్రభుత్వం కొనసాగింది. ఏదో బలవంతంగా నిర్ణయాలను తీసుకోలేదు. ఆయా చర్యలు సత్ఫలితాలు అందిస్తాయనే ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ► భారత్ పరిశ్రమకు అవసరమైన మద్దతును అందించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మరిన్ని సంస్కరణలు తీసుకురావడానికి వెనుకాడబోదు. ► భారతదేశ స్వయం స్వావలంభన నినాదం విజయవంతం కావాలి. ఈ బాధ్యత ప్రధానంగా భారత పరిశ్రమపైనే ఉంది. ► దేశ అభివృద్ధి, సామర్థ్యంపై పూర్తి విశ్వాసం వ్యక్తమవుతున్న ప్రస్తుత వాతావరణాన్ని పురోభివృద్ధికి ఒక అవకాశంగా మలుచుకోవాలని పారిశ్రామిక రంగాన్ని కోరుతున్నారు. ► కొత్త ప్రపంచంతో కలిసి నడవడానికి భారత్ ఇప్పుడు పూర్తి సన్నద్దంగా ఉంది. ఆయా శక్తి సామర్థ్యాలను సమకూర్చుకుంది. ఒకప్పుడు భారత్‌కు విదేశీ పెట్టుబడులు అనేవి కష్టం. ఇప్పుడు అన్ని రకాల పెట్టుబడులనూ స్వాగతించే స్థితిలో ఉన్నాం. ► పన్నుల వ్యవస్థను సంస్కరించుకున్నాం. సరళతరం చేసుకున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పోటీపూర్వక కార్పొరేట్ పన్ను విధానాన్ని రూపొందించుకుని, అనుసరిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా అమలుకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న పరోక్ష పన్నుల సమగ్ర విధానం– వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుల్లోకి తీసుకుని రావడమేకాదు, వసూళ్లలో సైతం రికార్డులను నమోదుచేసుకుంటున్నాం. ► కార్మిక చట్టాలను హేతుబద్దీకరణకు కేంద్రం పెద్దపీట వేసింది. అలాగే మెజారిటీ ప్రజల జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని సంస్కరణల ద్వారా మార్కెట్‌తో అనుసంధానిస్తున్నాం. ► ప్రభుత్వం తీసుకున్న పలు సంస్కరణలు, సంబంధిత చర్యల ఫలితంగానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ), విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి చేరాయి. ► స్టార్టప్స్ విషయంలో పెట్టుబడిదారుల స్పందన అనుహ్యంగా ఉంది. భారత్‌కు మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయనడానికి సంకేతమిది. భారత్‌కు ప్రస్తుతం 60 యూనికార్న్స్ (100 కోట్ల డాలర్ల విలువను చేరిన కంపెనీలను యూనికార్న్‌గా వ్యవహరిస్తారు) ఉన్నాయి. వీటిలో 21 గత కొద్ది నెలల్లోనే ఈ స్థాయిని అందుకున్నాయి. ► సూక్ష్మ, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నిధులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడ్డానికి ఉద్దేశించిన ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు నుంచి బ్యాంకింగ్ డిపాజిటర్ల ప్రయోజనాలకు ఉద్దేశించిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) యాక్ట్, 1961 సవరణ వరకూ (డిపాజిట్లపై బీమా రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ పెంపు) పలు బిల్లులను ప్రవేశపెట్టాం. సంస్కరణలపై ప్రభుత్వ సంకల్పాలనికి ఈ చర్యలు ఉత్తేజాన్ని ఇస్తున్నాయి. ► గత ప్రభుత్వాలు చేసిన ఎన్నో తప్పిదాలను కేంద్రం సరిదిద్దుతోంది. రెట్రో ట్యాక్స్ రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇందులో ఒక భాగం. మౌలికానికి ఫారెక్స్ నిల్వలు!: గడ్కరీ సూచన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నియంత్రణలో భారీగా ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలను (జూలై 30తో ముగిసిన వారంలో రికార్డు స్థాయిలో 621 బిలియన్ డాలర్లు. రూపాయిల్లో దాదాపు 44 లక్షల కోట్లు) దేశ మౌలిక రంగం పురోభివృద్ధికి వినియోగించుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి విధాన రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... భారత్‌కు మిగులు డాలర్ నిల్వలు ఉన్నాయి. వీటిని దేశ మౌలిక రంగం పురోభివృద్ధికి వినియోగించుకోడానికి ఉద్దేశించిన విధాన రూపకల్పనపై ఆర్బీఐ గవర్నర్‌తో చర్చించాలని నేను నిర్ణయించుకున్నాను. దేశంలో మౌలిక రంగంసహా పలు కీలక ప్రాజెక్టులకు ప్రస్తుతం చౌక వడ్డీరేటుకు నిధులను సమకూర్చుకోవాల్సి ఉంది. విద్యుత్ శాఖకు అనుబంధంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్–పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇది భారత్ విద్యుత్ రంగానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఇదే విధంగా ఇండియన్ రైల్వేలకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. ఈ తరహాలోనే భారత్ జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి కూడా ఒక ఫైనాన్షియల్ అనుబంధ సంస్థ ఉండాలి. రోడ్డు ప్రాజెక్టుల్లో భారీగా విదేశీ నిధులు వచ్చే లా కొత్త వ్యవస్థ రూపకల్పన తక్షణం జరగాలి. -
ద్వైపాక్షిక బంధాలు బలపడతాయ్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఎన్నికవడాన్ని భారత పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇది తోడ్పడగలదని ఆకాంక్షించాయి. ‘రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడుల బంధాలు పెరుగుతున్నాయి. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడం వంటి ఉమ్మడి ఎజెండా అమలుకు ఇరు పక్షాలు కలిసి పనిచేయాలి‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ తెలిపారు. ‘బైడెన్–కమలా సారథ్యంలో భారత్–అమెరికా ఆర్థిక సంబంధాలు మరింతగా బలపడగలవు. అధునాతన శాస్త్రీయ పరిశోధనలు.. అభివృద్ధి కార్యకలాపాలు, వ్యూహాత్మక రంగాల్లో వ్యాపార వర్గాల మధ్య సహకారం పెరగగలదు‘ అని అసోచాం సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా మధ్య పటిష్టమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయని .. ఇవి మరింత బలోపేతం కాగలవని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ చెప్పారు. నాయకత్వం అంటే విధానాలతో పాటు వ్యక్తిత్వం కూడా అన్న పాఠాన్ని అమెరికా ఎన్నికలు తెలియజేశాయని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. 2019లో భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 150 బిలియన్ డాలర్లుగా నమోదైంది. పరస్పర ఆర్థిక సహకారంతో దీన్ని 500 బిలియన్ డాలర్ల లక్ష్యానికి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. స్వాగతించిన ఐటీ పరిశ్రమ..: జో బైడెన్ ఎన్నికపై దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ హర్షం వ్యక్తం చేసింది. ‘స్థానికంగా పెట్టుబడులు, ఉపాధి కల్పన వంటి చర్యల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు భార త టెక్నాలజీ రంగం కీలక తోడ్పాటు అందిస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపర్చడం, మరిన్ని ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాల్లో అమెరికా కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై నాస్కామ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది‘ అని పేర్కొంది. ‘ఇది చారిత్రకమైన రోజు. అవరోధాలన్నీ తొలగిపోవడం హర్షించతగ్గ పరిణామం. ఏకత్వానికి, సమిష్టి తత్వానికి ఇది గెలుపు‘ అని సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యం గెలిచింది‘ అని టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్ణానీ ట్వీట్ చేశారు. -
పరిశ్రమలకు ఊతం
సీఐఐ సదస్సులో సీఎం సిద్ధరామయ్య కేపీసీసీ నియామకాల రద్దు సబబే విపక్షాల అనవసర రాద్ధాంతం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలోని ప్రస్తుత పరిశ్రమలు, కొత్తగా స్థాపించబోయే పరిశ్రమలకు ప్రాథమిక సదుపాయాలను కల్పించడానికి కొత్త విధానాన్ని రూపొందిస్తామని, తద్వారా పారిశ్రామిక ప్రగతికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. నగరంలోని ఓ హోటల్లో భారతీయ పరిశ్రమల సంఘాల సమాఖ్య (సీఐఐ) శుక్రవారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఐటీ రంగాన్ని మరింతగా అృవద్ధి పరచడానికి ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ కనబరుస్తుందని తెలిపారు. ప్రపంచ పెట్టుబడుల్లో కర్ణాటకను అత్యంత ప్రాధన్యతా గమ్య స్థానంగా తీర్చి దిద్దడానికి గత ఏడాది ప్రారంభించిన ‘4ఐ’ విధానానికి పారిశ్రామిక రంగం నుంచి చక్కటి స్పందన లభించిందని చెప్పారు. నియామకాల రద్దు సబబే కేపీఎస్సీ ద్వారా 2011లో చేపట్టిన నియామకాలను రద్దు చేయడం సబబేనని ముఖ్యమంత్రి సమర్థించుకున్నారు. అప్పట్లో కేఏఎస్ గ్రూపు-1, గ్రూపు-2 ఉద్యోగాలకు 362 మంది ఎంపిక కాగా, ఇందులో అవకతవకలు చోటు చేసుకున్నాయని తేలడంతో రాష్ట్ర మంత్రి వర్గం గురువారం ఆ నియామకాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీఐడీ కూడా దర్యాప్తు చేపట్టి, అవకతవకలు నిజమేనని తేల్చిందని చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎస్. నిజలింగప్ప 14వ వర్ధంతిని పురస్కరించుకుని విధాన సౌధలోని ఆయన విగ్రహానికి శుక్రవారం నివాళులు అర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ విషయంలోనైనా న్యాయ శాఖ, అడ్వొకేట్ జనరల్, సీఐడీ అభిప్రాయాలను పక్కన పెట్టడం సాధ్యం కాదని చెప్పారు. అవినీతిని అంతమొందించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న క్రమంలో, ఇలాంటి అవకతవకలను ఎలా సహించగలమని ప్రశ్నించారు. దీని వల్ల కొందరికి అన్యాయం జరిగి ఉన్నప్పటికీ, అవినీతికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అప్పట్లో 1,085 గెజిటెడ్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించగా, 362 మంది ఎంపికయ్యారని తెలిపారు. పరీక్షలకు హాజరైన వారిలో ఇద్దరు మినహా మిగిలిన వారందరికీ ఒకే విధమైన మార్కులు వచ్చాయంటూ, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఇలాంటి విషయాల్లో రాజకీయాలు వద్దని ఆయన హితవు పలికారు.