న్యూఢిల్లీ: భారత్‌ను వచ్చే 25 ఏళ్లలో (2047 నాటికి) అభివృద్ధి చెందిన దేశంగా మారిపోవాలంటూ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు పట్ల భారత పరిశ్రమల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల సందర్భంగా సోమవారం ప్రధాని ఈ పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు అయ్యే నాటికి దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి, దేశీయ తయారీని పెంచే లక్ష్యాన్ని సాధించాలని పారిశ్రామిక రంగాన్ని కోరారు. అంతేకాదు, ఈ దశాబ్దం భారత్‌కు టెకేడ్‌గా ప్రధాని అభివర్ణించారు.
5జీ, సెమీకండక్టర్ల తయారీ, డిజిటల్ సేవల ద్వారా రూపాంతరం చెందడాన్ని ప్రస్తావించారు. దీంతో ప్రధాని పిలుపు స్ఫూర్తినీయం, ఆచరణీయమంటూ పారిశ్రామిక మండళ్లు పేర్కొన్నాయి. ప్రధాన మంత్రి ప్రతిష్టాత్మక స్వప్నమైన ఆత్మనిర్భర భారత్ (స్వావలంబన/స్వయం సమృద్ధి భారత్) సాకారంలో భారత పరిశ్రమలు పోషించనున్న ప్రాధాన్యాన్ని ప్రస్తావించాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తలైన గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ తదితరులు తమ కార్పొరేట్ కార్యాలయాల వద్ద స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొని, సరికొత్త భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, మనవడు పృథ్వీఅంబానీతో కలసి పాల్గొన్నారు.
టెక్నాలజీ భాగస్వామ్యం
టెక్నాలజీ రంగం భవిష్యత్తును ప్రధాని కచ్చితంగా గుర్తించారు. ప్రపంచ జీడీపీపై దీని ప్రభావం 17 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుంది. 2033 నాటికి భారత్‌లో ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ పరిశ్రమ 6 కోట్ల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తుంది. జీడీపీలో 3 లక్షల కోట్ల డాలర్ల విలువను కలిగి ఉంటుంది.
– హరిఓమ్‌రాయ్, లావా ఇంటర్నేషనల్ చైర్మన్, ఎండీ
గర్వంగా ఉంది
తన శక్తిసామర్థ్యాలను ప్రపంచం సందేహిస్తున్నా, మన దేశ నిర్మాణం తీరు పట్ల గర్వంగా ఉన్నాను. అంకుర సంస్థల (స్టార్టప్‌లు) నుంచి క్రీడల (స్పోర్ట్స్) వరకు, మన యువత ప్రపంచ అంచనాలను దాటి రాణిస్తోంది. వచ్చే 25 ఏళ్లలో సిలికాన్ వ్యాలీ కంటే మెరుగైన ప్రపంచ టెక్నాలజీ కేంద్రంగా మనం అవతరించనున్నాం. సంచలనమైన సాంకేతిక టెక్నాలజీలతో త్వరలోనే మనల్ని మనం ఆత్మనిర్భర భారత్‌గా మలుచుకోనున్నాం.
– అనిల్ అగర్వాల్, వేదాంత చైర్మన్
ఎంతో సాధించాం
భారత్‌కు అభివృద్ధి చెందిన దేశా హోదాను తీసుకురావడం అన్నది తక్కువేమీ కాదు. అది మనందరికీ గొప్ప స్ఫూర్తినిస్తుంది. పునరుత్పాదక ఇంధనం సహా కీలకమైన ఎన్నో రంగాల్లో భారత్ స్వావలంబన సాధించేందుకు కట్టుబడి ఉంది. ప్రధాని అంచనాలకు అనుగుణంగా పరిశ్రమలు ఎదగాల్సిన అవసరం ఉంది. ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చే విషయంలో భారత్ వెనుకబడి ఉండరాదు.
– దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్
విద్య, ఆరోగ్యంపై దృష్టి అవసరం
మార్పు దిశగా 130 కోట్ల మంది భారతీయుల సమిష్టి స్ఫూర్తిని ప్రధాని తట్టి లేపారు. ప్రధాని స్వప్నం భారత్ ః 100 అజెండా సాధనకు టెంప్లేట్‌ను నిర్ధేశించింది. ప్రపంచానికి యువత రూపంలో నిపుణులను అందించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. విద్య, ఆరోగ్యం రానున్న సంవత్సరాల్లో దృష్టి సారించాల్సిన రంగాలు.
– చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్
పురోగతికి అడ్డు లేదు
75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను మనం సంబరంగా చేసుకుంటున్నాం. భారత్ అనంతమైన అవకాశాలు, వేగవంతమైన వృద్ధి అంచున నిలుచుంది. మన యువత కలలు, కోరికల మద్దతుతో గొప్ప ప్రజాస్వామ్యం అసలు కథ ఇప్పుడే మొదలైంది. భారత్ పురోగతికి ఎటువంటి అడ్డే లేదు. జై హింద్.
– గౌతమ్ అదానీ, అదానీ గ్రూపు చైర్మన్
పరిశ్రమ కీలక పాత్ర
ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో ప్రైవేటు రంగం ప్రముఖ పాత్ర పోషించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భారత పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది.
– సంజీవ్ మెహతా, ఫిక్కీ ప్రెసిడెంట్
Azadi Ka Amrit Mahotsav: ప్రధాని పిలుపు ఆచరణీయం
Published Tue, Aug 16 2022 4:23 AM | Last Updated on Tue, Aug 16 2022 7:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment