developing countries
-
మీకు తెలుసా? ఈ దేశాల్లో ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెటే ముద్దు
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఎన్నికల కోసం ఈవీఎంలను కాదు.. ఇంకా పేపర్ బ్యాలెట్‌నే వాడుతున్నాయి. ఆశ్చర్యకరంగా అనిపించినా ఇదే నిజం కూడా. సాధారణంగా ఎన్నికల నిర్వహణకు కొన్ని పద్ధతులంటూ ఉన్నాయి. పేపర్ బ్యాలెట్, ఈవీఎం వాడకం.. లేదంటే రకరకాల కాంబినేషన్లలో నిర్వహించడమూ జరుగుతోంది. మరి టెక్నాలజీ మీద తప్పనిసరిగా ఆధారపడుతున్న ఈరోజుల్లో.. ఆ దేశాలు ఈవీఎంలను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో చూద్దాం. 👉ప్రపంచంలో నిర్దిష్ట కాలపరిమితితో ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికలు నిర్వహించుకుంటున్నాయి. అందులో 100 దాకా దేశాలు ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ పద్దతినే అవలంభిస్తున్నాయి. 👉పిలిఫ్పైన్స్, ఆస్ట్రేలియా, కోస్టారికా, గువాటెమాలా, ఐర్లాండ్, ఇటలీ, కజకస్థాన్, నార్వే, యూకే.. ఈవీఎంలను ప్రయోగాత్మకంగా పరిశీలించాయి. వాటి ఫలితాల ఆధారంగా చివరకు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు కొనసాగిస్తున్నాయి.👉భద్రత, ఖచ్చితత్వం, విశ్వసనీయత, ఎన్నికల ధృవీకరణ.. ఇవన్నీ ఈవీఎంల వాడకంపై అనుమానాలకు కారణం అవుతున్నాయి. అందుకే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని ఇప్పటికీ ఈవీఎంలను వాడడం లేదు.👉జర్మనీ, నెదర్లాండ్స్, పరాగ్వే దేశాలు ఈవీఎంల వాడాకాన్ని పూర్తిగా ఆపేశాయి. అక్కడ పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.👉2006లో నెదర్లాండ్స్ ఈవీఎంలను నిషేధించింది. 2009లో ఐర్లాండ్, అదే ఏడాది ఇటలీ సైతం ఈవీఎంలను బ్యాన్ చేశాయి. బ్యాలెట్ పేపర్‌తో పాటు రకరకాల కాంబోలో ఎన్నికలు జరుగుతున్నాయి. 👉సాంకేతికలో ఓ అడుగు ఎప్పుడూ ముందుండే జపాన్‌లో.. ఒకప్పుడు ఈవీఎంల వాడకం ఉండేది. కానీ, 2018 నుంచి అక్కడా ఈవీఎంల వాడకం నిలిపివేశారు.👉అగ్రరాజ్యం అమెరికా సహా చాలా దేశాల్లో ఈవీఎంల వాడకం పూర్తిస్థాయిలో జరగడం లేదు. విశేషం ఏంటంటే.. అక్కడ ఇప్పటికీ ఈ-ఓటింగ్‌ను ఈమెయిల్ లేదంటే ఫ్యాక్స్ ద్వారా పంపిస్తారు. అలాగే.. బెల్జియం, ఫ్రాన్స్, కెనడా, మెక్సికో, పెరూ, అర్జెంటీనాలో కొన్ని ప్రాంతాల్లో.. కొన్ని ఎన్నికలకు మాత్రమే ఈవీఎంలను వినియోగిస్తున్నారు.👉2009 మార్చిలో జర్మనీ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈవీఎంల వాడకం రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. ఈవీఎం పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఎన్నికలలో పారదర్శకత అనేది ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని జర్మనీ కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది.👉ప్రపంచవ్యాప్తంగా భారత్, బ్రెజిల్, వెనిజులా సహా పాతిక దేశాలు మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తున్నాయి. అందులో పూర్తి స్థాయి ఎన్నికల్లో ఈవీఎంలను వాడుతోంది సింగిల్ డిజిట్‌లోపు మాత్రమే. మిగతా దేశాలు స్థానిక ఎన్నికల్లో, కిందిస్థాయి ఎన్నికల్లో మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నాయి. 👉భూటాన్, నమీబియా, నేపాల్‌లో భారత్‌లో తయారయ్యే ఈవీఎంలనే ఉపయోగిస్తున్నాయి. 👉ఈవీఎంల విశ్వసనీయతపై చర్చ జరగడం ఇప్పుడు తొలిసారి కాదు. 2009లో సుబ్రమణియన్ స్వామి(అప్పటికీ ఆయన ఇంకా బీజేపీలో చేరలేదు) ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని అభిప్రాయపడ్డ ఆయన.. న్యాయపోరాటానికి సైతం సిద్ధపడ్డారు. అయితే ఇప్పుడు ఈవీఎంల వద్దని, పోస్టల్ బ్యాలెట్ ముద్దు అని పోరాటాలు ఉధృతం అవుతున్న వేళ.. ఆయన మౌనంగా ఉండిపోయారు. -
వర్ధమాన దేశాలపై కార్బన్ ట్యాక్స్ సరికాదు - సీఈఏ కీలక వ్యాఖ్యలు
వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా వర్ధమాన దేశాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ (సీబీఏఎం) వంటి చర్యలు విధించడం సరికాదని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. వాతావరణపరమైన మార్పులకు సంబంధించి చర్యలు తీసుకుంటూ వర్ధమాన దేశాలు అటు సంపన్న దేశాల్లో ప్రజల ప్రాణాలు..ఆస్తులు, వ్యాపారాలు క్షేమంగా ఉండేలా కూడా చూసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. దానికి ప్రతిఫలంగా వాటిపై సీబీఏఎం వంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వర్ధమాన దేశాల పట్ల సంపన్న దేశాలు సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణహిత చర్యలకు రుణ సదుపాయంపై ఆర్థిక వ్యవహారాల విభాగం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన ప్రాంతీయ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా వంటి దేశాలకు చెందిన ఉక్కు, సిమెంటు తదితర రంగాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఇది 2026 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. 2023 అక్టోబర్ 1 నుంచి ట్రయల్ పీరియడ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఉక్కు, సిమెంటు, ఎరువులు తదితర ఏడు రంగాల సంస్థలు తమ కార్యకలాపాల ద్వారా విడుదలయ్యే కర్బన ఉద్గారాల వివరాలను యూరోపియన్ యూనియన్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. భారత ఎగుమతులకు యూరప్ కీలకమైన మార్కెట్లలో ఒకటి కావడంతో కార్బన్ ట్యాక్స్ వల్ల భారతీయ ఎగుమతిదారుల లాభాలపై ప్రభావం పడనుంది. 2022–23లో ఈయూతో భారత వాణిజ్యం 134.71 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులు 74.84 బిలియన్ డాలర్లు, దిగుమతులు 59.87 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
వర్ధమాన దేశాలపై కార్బన్ ట్యాక్స్ సరికాదు
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా వర్ధమాన దేశాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ (సీబీఏఎం) వంటి చర్యలు విధించడం సరికాదని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. వాతావరణపరమైన మార్పులకు సంబంధించి చర్యలు తీసుకుంటూ వర్ధమాన దేశాలు అటు సంపన్న దేశాల్లో ప్రజల ప్రాణాలు..ఆస్తులు, వ్యాపారాలు క్షేమంగా ఉండేలా కూడా చూసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. దానికి ప్రతిఫలంగా వాటిపై సీబీఏఎం వంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వర్ధమాన దేశాల పట్ల సంపన్న దేశాలు సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణహిత చర్యలకు రుణ సదుపాయంపై ఆర్థిక వ్యవహారాల విభాగం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన ప్రాంతీయ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా వంటి దేశాలకు చెందిన ఉక్కు, సిమెంటు తదితర రంగాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఇది 2026 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. 2023 అక్టోబర్ 1 నుంచి ట్రయల్ పీరియడ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఉక్కు, సిమెంటు, ఎరువులు తదితర ఏడు రంగాల సంస్థలు తమ కార్యకలాపాల ద్వారా విడుదలయ్యే కర్బన ఉద్గారాల వివరాలను యూరోపియన్ యూనియన్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. భారత ఎగుమతులకు యూరప్ కీలకమైన మార్కెట్లలో ఒకటి కావడంతో కార్బన్ ట్యాక్స్ వల్ల భారతీయ ఎగుమతిదారుల లాభాలపై ప్రభావం పడనుంది. 2022–23లో ఈయూతో భారత వాణిజ్యం 134.71 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులు 74.84 బిలియన్ డాలర్లు, దిగుమతులు 59.87 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
Azadi Ka Amrit Mahotsav: ప్రధాని పిలుపు ఆచరణీయం
న్యూఢిల్లీ: భారత్‌ను వచ్చే 25 ఏళ్లలో (2047 నాటికి) అభివృద్ధి చెందిన దేశంగా మారిపోవాలంటూ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు పట్ల భారత పరిశ్రమల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల సందర్భంగా సోమవారం ప్రధాని ఈ పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు అయ్యే నాటికి దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి, దేశీయ తయారీని పెంచే లక్ష్యాన్ని సాధించాలని పారిశ్రామిక రంగాన్ని కోరారు. అంతేకాదు, ఈ దశాబ్దం భారత్‌కు టెకేడ్‌గా ప్రధాని అభివర్ణించారు. 5జీ, సెమీకండక్టర్ల తయారీ, డిజిటల్ సేవల ద్వారా రూపాంతరం చెందడాన్ని ప్రస్తావించారు. దీంతో ప్రధాని పిలుపు స్ఫూర్తినీయం, ఆచరణీయమంటూ పారిశ్రామిక మండళ్లు పేర్కొన్నాయి. ప్రధాన మంత్రి ప్రతిష్టాత్మక స్వప్నమైన ఆత్మనిర్భర భారత్ (స్వావలంబన/స్వయం సమృద్ధి భారత్) సాకారంలో భారత పరిశ్రమలు పోషించనున్న ప్రాధాన్యాన్ని ప్రస్తావించాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తలైన గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ తదితరులు తమ కార్పొరేట్ కార్యాలయాల వద్ద స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొని, సరికొత్త భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, మనవడు పృథ్వీఅంబానీతో కలసి పాల్గొన్నారు. టెక్నాలజీ భాగస్వామ్యం టెక్నాలజీ రంగం భవిష్యత్తును ప్రధాని కచ్చితంగా గుర్తించారు. ప్రపంచ జీడీపీపై దీని ప్రభావం 17 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుంది. 2033 నాటికి భారత్‌లో ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ పరిశ్రమ 6 కోట్ల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తుంది. జీడీపీలో 3 లక్షల కోట్ల డాలర్ల విలువను కలిగి ఉంటుంది. – హరిఓమ్‌రాయ్, లావా ఇంటర్నేషనల్ చైర్మన్, ఎండీ గర్వంగా ఉంది తన శక్తిసామర్థ్యాలను ప్రపంచం సందేహిస్తున్నా, మన దేశ నిర్మాణం తీరు పట్ల గర్వంగా ఉన్నాను. అంకుర సంస్థల (స్టార్టప్‌లు) నుంచి క్రీడల (స్పోర్ట్స్) వరకు, మన యువత ప్రపంచ అంచనాలను దాటి రాణిస్తోంది. వచ్చే 25 ఏళ్లలో సిలికాన్ వ్యాలీ కంటే మెరుగైన ప్రపంచ టెక్నాలజీ కేంద్రంగా మనం అవతరించనున్నాం. సంచలనమైన సాంకేతిక టెక్నాలజీలతో త్వరలోనే మనల్ని మనం ఆత్మనిర్భర భారత్‌గా మలుచుకోనున్నాం. – అనిల్ అగర్వాల్, వేదాంత చైర్మన్ ఎంతో సాధించాం భారత్‌కు అభివృద్ధి చెందిన దేశా హోదాను తీసుకురావడం అన్నది తక్కువేమీ కాదు. అది మనందరికీ గొప్ప స్ఫూర్తినిస్తుంది. పునరుత్పాదక ఇంధనం సహా కీలకమైన ఎన్నో రంగాల్లో భారత్ స్వావలంబన సాధించేందుకు కట్టుబడి ఉంది. ప్రధాని అంచనాలకు అనుగుణంగా పరిశ్రమలు ఎదగాల్సిన అవసరం ఉంది. ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చే విషయంలో భారత్ వెనుకబడి ఉండరాదు. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ విద్య, ఆరోగ్యంపై దృష్టి అవసరం మార్పు దిశగా 130 కోట్ల మంది భారతీయుల సమిష్టి స్ఫూర్తిని ప్రధాని తట్టి లేపారు. ప్రధాని స్వప్నం భారత్ ః 100 అజెండా సాధనకు టెంప్లేట్‌ను నిర్ధేశించింది. ప్రపంచానికి యువత రూపంలో నిపుణులను అందించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. విద్య, ఆరోగ్యం రానున్న సంవత్సరాల్లో దృష్టి సారించాల్సిన రంగాలు. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ పురోగతికి అడ్డు లేదు 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను మనం సంబరంగా చేసుకుంటున్నాం. భారత్ అనంతమైన అవకాశాలు, వేగవంతమైన వృద్ధి అంచున నిలుచుంది. మన యువత కలలు, కోరికల మద్దతుతో గొప్ప ప్రజాస్వామ్యం అసలు కథ ఇప్పుడే మొదలైంది. భారత్ పురోగతికి ఎటువంటి అడ్డే లేదు. జై హింద్. – గౌతమ్ అదానీ, అదానీ గ్రూపు చైర్మన్ పరిశ్రమ కీలక పాత్ర ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో ప్రైవేటు రంగం ప్రముఖ పాత్ర పోషించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భారత పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. – సంజీవ్ మెహతా, ఫిక్కీ ప్రెసిడెంట్ -
గుర్తుకు రావడం లేదు...!
ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియా కేసులు పెరిగిపోతున్నాయి... ప్రతీ ఏడాది దాదాపు కోటి వరకు కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. అరవై ఏళ్లు, అంతకు పైబడిన వయసు వాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుండడంతో డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అయితే నలభై నుంచి యాభై ఏళ్ల మధ్య వయసున్న వారు కూడా ఈ రకమైన సమస్యలతో బాధపడుతున్నట్టు తాజాగా కేసులు బయటపడడం పట్ల డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వివిధదేశాల్లో ఐదు కోట్లకు పైగానే ఈ పేషంట్లు ఉన్నారు. వీరిలో 60 శాతం వరకు తక్కువ, మధ్య ఆదాయ (లో అండ్ మిడిల్ ఇన్కమ్) దేశాల్లోనే (ప్రపంచబ్యాంక్ వర్గీకరించిన ఈ ఆదాయ దేశాల జాబితాలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలున్నాయి) నివసిస్తున్నారు. డిమెన్షియా పేషంట్ల సంఖ్య 2030 కల్లా ఎనిమిదిన్నర కోట్లకు, 2050 కల్లా 15 కోట్లు దాట వచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహేచ్‌ఓ) అంచనా. పరిష్కారం ఏమిటీ ? జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మాటల కోసం తడుముకోడం, తెలిసిన మనుషులను కూడా గుర్తించకలేకపోవడం, ఏవైనా వస్తువుల కోసం పదే పదే వెతుక్కోవడం, ఏవైనా సులభమైన కూడికలు కూడా చేయలేకపోవడం వంటివి అల్జీమర్స్ లక్షణాలు. అల్జీమర్స్‌తో పాటు ఇతర రూపాల్లోని చిత్తవైకల్యాన్ని డిమెన్షియాగా పరిగణిస్తున్నారు. మనదేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు అధికరక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్టు ఓ అంచనా. ఇలాంటి వారికి వయసు పెరిగే కొద్ది అల్జీమర్స్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. సాథారణంగా 65 ఏళ్ల వయసు వారిలో ఇలాంటì లక్షణాలుæ కనిపిస్తున్నట్టు, ఓ సారి ఆల్జీమర్స్ బారిన పడ్డాక దాని నుంచి పూర్తిస్థాయిలో బయటపడడం మాత్రం సాధ్యం కాదని డా.నస్లీ ఇచ్ఛపోరియా అభిప్రాయపడ్డారు. అయితే దీని బారిన పడకుండా చురుకుగా చైతన్యవంతంగా వ్యవహరించడంలో మెదడు పనితీరు కీలకం అవుతుందని చెప్పారు. ఆరోగ్యపరిరక్షణకు మంచి ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయమం. సామాజిక సంబంధాలు కలిగి ఉండడంతో పాటు కుటుంబసభ్యులతో గడపడం, మనుషులను కలుసుకోవడం చేస్తుండాలని సూచించారు. ‘వాయుకాలుష్యం కూడా అల్జీమర్స్‌కు ఓ కారణంగా తెలుస్తోంది. గాలిలో కాలుష్యం శ్వాసకోస వ్యాధులకు దారితీస్తుందని ప్రజలు భావిస్తున్నా, మెదడు కణాలు క్రమక్రమంగా బలహీనపడేందుకు, మెదడుకు అందే రక్తప్రసారం తగ్గిపోయేందుకు కారణమవుతోంది. వాయుకాలుష్యంలో భాగంగా ఉన్న లెక్కకు మించిన ర సాయనాలు మెదడు సరిగా పనిచేయకుండా చేస్తున్నాయి.’ అని డా.నస్లీ తెలిపారు. భారత్‌లో పౌరుల సగటు ఆయుర్ధాయం పెరుగుదల వల్ల కూడా పెద్ద వయసు వారి సంఖ్య పెరుగుతుండడంతో వారిలో అల్జీమర్స్‌కు కారణం అవుతోంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి లేనివారు, మెదడును చురుకుగా, చైతన్యవంతంగా ఉంచకుండా స్తబ్దుగా ఉండేవాళ్లు ఎక్కువగా అల్జీమర్స్ బారిన పడే అవకాశాలున్నాయి. మెదడును క్రియాశీలంగా ఉపయోగించకపోతే పెద్దవయసులో క్రమంగా మతిమరుపుతో పాటు అల్జీమర్స్‌లోని ఇతర లక్షణాల బారిన పడాల్సి వస్తుంది ’ అని డా. హేమంత్ సంత్ పేర్కొన్నారు. -
భూగోళంపై ఆకలి కేకలు
వాతావరణంలో ఏర్పడిన తీవ్రమైన మార్పులతో ప్రపంచ ప్రజల ఆకలి అనూహ్యంగా పెరిగిపోతోంది. ఆహార కొరత కొద్దిగా తగ్గుముఖం పడుతుందనుకుంటున్న తరుణంలో ప్రస్తుతం జనాభాలో ప్రతి ఎనిమిదిమందిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. తీవ్రమైన వాతావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణమని కూడా స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన 2018 పౌష్టికాహారం, ఆహారభద్రతా రిపోర్టు ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై హెచ్చరికలు జారీచేసింది. 2015 నుంచి గత మూడేళ్ళుగా వరసగా ప్రపంచ ప్రజలు ఆకలితీవ్రత ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోందని అధ్యయనం తేల్చిచెప్పింది. గత ఒక్క యేడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా 8.21 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికాలు తీవ్రమైన ఆహార కొరతతోనూ, పౌష్టికాహారలోపాన్నీ ఎదుర్కొంటున్నాయి. ఆసియాలో 50 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఓ వైపు కరువు కాటకాలు తాండవిస్తోంటే, మరోవైపు నదులు, సముద్రాలు పొంగిపొర్లి వరదలు ముంచెత్తుతున్నట్టు ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ రెండు భిన్నమైన పరిస్థితులే 2017లో ఆర్థిక కుంగుబాటుకీ, ఆకలికీ కారణమౌతున్నాయని గుర్తించింది. దీంతో దాదాపు కోటి మంది ప్రజలు ఆకలి నుంచి విముక్తికోసం అర్థిస్తున్నట్టు వెల్లడయ్యింది. ప్రపంచవ్యాప్తంగా నమోదౌతోన్న అధిక ఉష్టోగ్రతలు చివరకు ఆకలి ప్రపంచాన్ని సృష్టించాయని ఆక్స్‌ఫామ్ జిబిలో ఆహారమూ, వాతావరణ విధానాల శాఖాధిపతి రాబిన్ వ్యాఖ్యానించారు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా 2018లో సైతం తీవ్రమైన వాతావరణ సంక్షోభాన్ని చూసామన్నారు. గత కొద్ది నెలలుగా పరిస్థితి మరింత భయానకంగా తయారైందన్నారు. ఐక్యరాజ్య సమితి రిపోర్టు ప్రకారం ప్రపంచంలో తీవ్రమైన వాతావరణ సంక్షోభం ఉన్నప్రాంతాల్లోనే ఎక్కువ మంది ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వర్షపాతంలో మార్పుల వల్ల గత ఐదేళ్ళలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయనీ, దీనివల్ల గోధుమ, వరి లాంటి కీలక పంటలు దెబ్బతింటున్నాయనీ రిపోర్టు వెల్లడించింది. కరువు కాటకాలను తట్టుకునేందుకు తక్కువ నీళ్ళు అవసరమైన పంటలను వేయడం వర్షపాతానికి అనుగుణంగా పంటమార్పిడీ పద్ధతులను అవలంభించక తప్పని పరిస్థితి రైతులకు ఎదురయ్యింది. యూనిసెఫ్, వ్యవసాయాభివృద్ధి సహాయక సంస్థ, ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్యసంస్థ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత, పౌష్టికాహారం 2018 నివేదికని ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసింది. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికి ఆకలినీ, పౌష్టికాహారలోపాన్నీ జయించాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే తక్షణమే తీవ్ర వాతావరణ మార్పులపై స్పందించాలని ఈ రిపోర్టు ముందు మాటలో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 6.72 కోట్ల మంది ప్రజలు అధిక బరువుతో బాధపడుతున్నారు. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు స్తూలకాయంతో అవస్త పడుతున్నవారే. పౌష్టికాహారలోపమే దీనికి కారణం. ప్రపంచవ్యాప్తంగా 1.51 కోట్ల మంది ఐదేళ్ళలోపు పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. ఐదేళ్ళలోపు పిల్లలు ఉండాల్సిన ఎత్తుకంటే చాలా పొట్టిగా ఉండడానికి సైతం పౌష్టికాహారలోపమే కారణం. అయితే 2012లో ప్రపంచవ్యాప్తంగా 1.65 కోట్ల మంది చిన్నారులు ఎదుగుదలా లోపంతో ఉన్నారు. 2012 కంటే ఇప్పుడు కొంత మెరుగైనా మొత్తం ఆసియాలోనే 55 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులను ఎదుగుదల లోపం బాధపెడుతోంది. ప్రతి ముగ్గురు గర్భిణీల్లో ఒకరు రక్తహీనతతో అనారోగ్యంపాలవుతున్నారు. ఇది వారి పిల్లల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 40 శాతం పిల్లలకే ఆరునెలల పాటు తప్పనిసరిగా యివ్వాల్సిన తల్లిపాలు లభ్యం అవుతున్నట్టు ఈ నివేదిక తేల్చింది. -
నాసాను చూసి..!
వాషింగ్టన్: నాసా శాస్త్రవేత్తలు తయారుచేసిన 'యాంటీ-గ్రావిటీ సూట్' ను ఆదర్శంగా తీసుకున్న ఓ కంపెనీ 'మిరాకిల్ సూట్' అనే పేరుతో ప్రసవంలో ఎక్కవ రక్తస్రావం అవకుండా ఉండేందుకు కొత్త ఆవిష్కరణను చేసింది. కాలిఫోర్నియాలోని జోఎక్స్ కార్పొరేషన్ అనే స్టార్టప్ కంపెనీ సూట్ లో ప్రెజర్ ను ఉపయోగించి మహిళలకు ప్రసవాన్ని చేయడం వల్ల ఎక్కువ రక్తాన్ని కోల్పోకుండా ఉండేలా చేసింది. మిలటరీ, ఏవియేషన్ రంగాల్లో లాగా ఎక్కువ ప్రెజర్ తో అవసరం ఉండదు కాబట్టి, పాత తరహా జీ-సూట్ మోడల్ లోనే ఈ సూట్ ను తయారుచేశారు. తాజాగా నాసా ఏమ్స్ పరిశోధనా కేంద్రం, మరికొన్ని పరిశోధనా కేంద్రాలు చేసిన స్టడీల్లో పాకిస్తాన్ లో ప్రసవం కోసం వచ్చిన 14 మంది గర్భిణీ స్త్రీలలో 13 మంది మహిళల ప్రాణాలను ఈ సూట్ కాపాడినట్లు తేలింది. ఈజిప్టు, నైజీరియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 50 శాతం రక్తస్రావ మరణాలను తగ్గించినట్టు మరో పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, శిశు మరణాలకు తగ్గించేందుకు కృషి చేస్తున్నఓ సంస్థ ఈ సూట్ గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు స్త్రీ, శిశు మరణాల రేటు తగ్గించడానికి చాలా ప్రయత్నించామని అయినా ఇంత పెద్ద మొత్తంలో ఫలితాలు రాబట్టలేకపోయామని పేర్కొంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ), ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజిస్ట్స్ లు ఈ మిరాకిల్ సూట్ ను అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉపయోగించుకోవాలని సూచించాయి. ఇప్పటివరకు 20 దేశాలు స్పందించి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నాయి. ప్రపంచంలో ప్రతి ఏడాది 70,000 మంది మహిళలు డెలివరీ సమయంలో రక్తస్రావం కారణంగా మరణిస్తున్నారు. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 579 కోట్లు
♦ వర్ధమాన దేశాలు దెబ్బతీసినా ఆదుకున్న దేశీయ వ్యాపారం ♦ 34 శాతం వృద్ధితో రూ. 580 కోట్లకు... ♦ మొత్తం ఆదాయం రూ.3,986 కోట్లు; 3శాతం వృద్ధి ♦ యూఎస్ఎఫ్డీఏ హెచ్చరికలపై సానుకూలంగా స్పందిస్తున్నాం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ; రష్యా, ఇతర వర్ధమాన దేశాల వ్యాపారం దెబ్బతీసినా దేశీయ వ్యాపారం ఆదుకోవడంతో డాక్టర్ రెడ్డీస్ స్థిరమైన ఫలితాలను ప్రకటించగలిగింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో నికర లాభం స్వల్పంగా ఒక శాతం పెరిగి రూ. 574 కోట్ల నుంచి రూ. 579 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం 3 శాతం వృద్ధితో రూ. 3,843 కోట్ల నుంచి రూ. 3,968 కోట్లుగా నమోదయ్యింది. వర్ధమాన దేశాల్లో నెలకొన్న ఆర్థిక మందగమన ప్రభావం ఫలితాలపై పడినట్లు డాక్టర్ రెడ్డీస్ కో-చైర్మన్ అండ్ సీఈవో జీవీ ప్రసాద్ తెలిపారు. సమీక్షా కాలంలో రష్యా, వెనెజులాతో సహా ఇతర వర్థమాన దేశాల వ్యాపారం 28 శాతం క్షీణించి రూ. 884 కోట్ల నుంచి రూ. 640 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో దేశీయంగా అమ్మకాలు 34 శాతం పెరిగి రూ. 433 కోట్ల నుంచి రూ. 580 కోట్లకు పెరిగాయి. ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తి మాట్లాడుతూ ఈ త్రైమాసికంలో ఇండియాలో 5 ఉత్పత్తులు విడుదల చేయడం వల్ల వ్యాపారం వృద్ధి చెందడానికి కారణంగా పేర్కొన్నారు. కీలకమైన ఉత్తర అమెరికా వ్యాపారం 18 శాతం వృద్ధితో రూ. 1,942 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో ఆర్అండ్డీ కేటాయింపులు 5.1 శాతం క్షీణించి రూ.409 కోట్లకు పరిమితమయ్యింది. ఈ త్రైమాసికంలో మొత్తం నాలుగు ఔషధాలకు అనుమతులు లభించాయి. దిద్దుబాటు చర్యలు మూడు యూనిట్లకు జారీ చేసిన హెచ్చరికల లేఖపై స్పందించామని, యూఎస్ఎఫ్డీఏ సూచనల మేరకు తగు చర్యలు చేపట్టినట్లు డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ తెలిపారు. హెచ్చరికల తర్వాత గడువు విధించిన డిసెంబర్ 7లోగా వివరణ జారీ చేశామని, అంతే కాకుండా 45 రోజుల్లో చేపట్టిన దిద్దుబాటు చర్యలను తెలియచేస్తూ మరో లేఖ రాసినట్లు తెలిపారు. తాము తీసుకున్న చర్యలను వివరిస్తూ త్వరలోనే మరో లేఖ రాయనున్నట్లు తెలిపారు. తాము తీసుకున్న చర్యలకు యూఎస్ఎఫ్డీఏ సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ హెచ్చరికలు, ఆయిల్ ధరలు తగ్గడం వంటి కారణాలతో వచ్చే ఆర్థిక సంవత్సరం మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. -
కలిమి మండిస్తున్న కొలిమి
విశ్లేషణ ధనిక దేశాల ప్రజల జీవనశైలిని గురించి పల్లెత్తు మాట అనకూడదు కాబట్టి, మళ్లీ త్యాగాలు చేసే బాధ్యత అభివృద్ధి చెందుతున్న దేశాల భుజస్కంధాల మీదే పడుతోంది. పేద దేశాల భవిష్యత్ చిత్రపటం ఎంత దారుణంగా ఉందో ఆవిష్కరించే అన్ని రకాల వివరాలు ఇప్పుడు మన ముందు ఉన్నాయి. ఈ అధ్యయనాలను గురించి అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన విద్యావేత్తలు, సంప్రతింపుల నిపుణులు పదేపదే వల్లిస్తున్నారు కూడా. అయితే ధనిక దేశాలను హెచ్చరిస్తూ వచ్చే నివేదికలన్నీ చెవిటివాని ముందు శంఖు ఊదిన రీతిలో ప్రయోజనం లేకుండా మిగిలి పోతున్నాయి. ఫ్రాన్స్‌లో 2003లో కేవలం ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగిన ఫలితంగానే 10,000 మంది రాలిపోయారు. ఇంత జరుగుతున్నా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాలే త్యాగాలు చేయాలని చెబుతుంటారు. ధనిక దేశాల వారి జీవన శైలి చెక్కుచెదిరే పరిస్థితులు తలెత్తకూడదు. ధనిక దేశాల ప్రజలు సాగిస్తున్న జీవన విధానమే పర్యావరణంలో ఉత్పాతాలకు కారణమవుతున్నదని ప్రపంచమంతా చూస్తుండగానే మన ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మోదీ సరిగ్గా గురి చూసి కొట్టిన సంగతిని గుర్తించవలసిందే. పాశ్చాత్య దేశాల ప్రజల జీవన విధానం గురించి నోరు విప్పడమే పెద్ద నేరంలా భావిస్తారు. అసలు ఆ అంశాన్ని లేవనెత్తడమే మర్యాదను ఉల్లంఘించడం కింద కూడా ప్రకటిస్తారు. మొత్తంగా ధనిక దేశాలను నిలదీయడమే రాజకీయంగా తప్పన్నట్టు మాట్లాడతారు. 'ఏదిఏమైనా ఎవరో కొద్దిమంది అనుసరించే జీవన విధానం ఇప్పటికీ అభివృద్ధి అనే నిచ్చెన మొదటి మెట్టు దగ్గర ఉండిపోయిన దేశాల అవకాశాలకు అడ్డంకిగా నిలవరాదు' అని కూడా 'ఫైనాన్షియల్ టైమ్స్'వారి అభిప్రాయసేకరణ పుస్తకంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. మోదీ రాసిన ఈ మాటలు అందరికీ వందనీయుడైన పర్యావరణవేత్త స్వర్గీయ అనిల్ అగర్వాల్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని నాకు గుర్తుకు వచ్చేటట్టు చేశాయి. అగర్వాల్ ఒక సందర్భంలో ఇలా రాశారు, 'ఒక సగటు అమెరికా పౌరుడు వినియోగించిన స్థాయిలోనే ఒక మధ్య తరగతి భారతీయుడు కూడా విద్యుత్‌ను వినియోగించినట్టయితే ఈ ప్రపంచం యాభై ఏళ్ల క్రితమే ఉడికిపోయి ఉండేది.'ఆయన సత్యమే చెప్పారు. అయినా మీరు ధనిక దేశాల ప్రజల జీవనశైలిని గురించి ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారి దగ్గర నుంచి మనకు వస్తున్న సమాధానం మండిపాటు మాత్రమే. నేను కూడా కొన్నేళ్ల క్రితం ఇలా ప్రశ్నించే పని చేసినందుకు అలాంటి ఆగ్రహాన్నే చవి చూశాను. ధాన్యం పండించడం కంటే, గొడ్డు మాంసం తినడమే పర్యావరణానికి ఎంతో ప్రమాదకరమని చెబుతూ, ఆ అంశం మీద వెలువడిన పలు అధ్యయనాలను ఒక వ్యాసంలో ఉటంకించాను. దీనితో ఒక పద్ధతి ప్రకారం సోషల్ మీడియా ద్వారా తిట్ల దండకంతో నా మీద దండయాత్ర జరిగింది. మూడు భూగోళాలు ఎలా వస్తాయి? మూడు సంవత్సరాల క్రితమే, అంటే 2012లోనే వరల్డ్‌వైడ్ ఫండ్ (డబ్ల్యు. డబ్ల్యు. ఎఫ్.) 'లివింగ్ ప్లానెట్' (జీవ వైవిధ్యం, పర్యావరణం పద్ధతులు, సహజ వనరులతో కూడిన భూగోళాన్ని ప్రస్తావించడానికి వాడుతున్న పదబంధం) పేరుతో నివేదికను విడుదల చేసింది. నిజానికి ఆ సంస్థ ప్రతి రెండేళ్లకూ ఒకసారి ఇలాంటి ఒక నివేదికను ప్రపంచం ముందు పెడుతూ ఉంటుంది. అయితే 2012 నివేదికలో, 'భూగోళం మనకు అందివ్వగల వనరులకు మించి యాభైశాతం అదనంగా వనరులను వినియోగించు కుంటున్నాం. అంటే మనం ఇవాళ 1 1/2 భూగోళం వంటిదాని మీద నివశిస్తున్నామన్నమాట'అని డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్. పేర్కొన్నది. 'ఇదే పద్ధతిని మనం కొనసాగిస్తే 2050 నాటికి మనకి మూడు భూగోళాలు అవసరమవుతాయి'అని ఆ సంస్థ సంచాలకుడు జిమ్ లీపే చెప్పారు. ఇంతకు మించిన సుస్పష్టమైన, గట్టి హెచ్చరిక మరొకటి ఉండదు. ప్రపంచంలో ఉష్ణోగ్రత రెండు డిగ్రీలకు దాటకుండా చూడడం కోసం ఉద్గారాల ప్రమాణాలను అదుపుచేయాలని ఆకాంక్షించడం ముమ్మాటికీ ఆహ్వానించదగిన వైఖరే. కానీ ఇక్కడే పట్టించుకోని సంగతి, లేదా ఉద్దేశ పూర్వకంగానే జరుగుతున్నదేనని భావించినా భావించవలసిన సంగతి- అది, వినియోగం మీద నిష్కర్షగా కోత విధించుకోకపోవడం. మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ పెరుగుదల నమూనాయే వినియోగాన్ని ప్రోత్సహిం చేదిగా కనిపిస్తూ ఉండడం, దీనితోనే స్థూల దేశీయోత్పత్తిని లెక్క కట్టడం, ఇదంతా ప్రకృతి వనరులను కేవల వినియోగ వస్తువుగా చూసేటట్టు చేయడంతో సంక్షోభానికి తెర లేచింది. ఈ విధమైన వినియోగ ధోరణి ఏ మాత్రం సమర్థనీయం కాదని డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్. నివేదిక తేల్చిచెప్పింది. అయినప్పటికీ ఈనాటికి కూడా ఏ ఒక్కరు వినియోగాన్ని తగ్గించుకోవడం గురించి నోరెత్తి మాట్లాడడం లేదు. ఒక వేళ ఎవరైనా ఆ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారి మీద అభివృద్ధి నిరోధకులన్న ముద్ర పడిపోతుంది. మనవారూ దోషులే అవుతారు! ధనికదేశాల ప్రజలు, జాతులు పర్యావరణం మీద చూపుతున్న ప్రభావం, తక్కువ ఆదాయం కలిగిన దేశాల ప్రజల ద్వారా పడే ప్రభావం కంటే ఆరు రెట్లు ఎక్కువ. ఇందుకు సంబంధించి 'ది గార్డియన్' పత్రిక కూడా ఒక నివేదికను ప్రచురించింది. అమెరికాలో జన్మిస్తున్న ప్రతి శిశువు తన తల్లిదండ్రుల ద్వారా జనించే కర్బన ఉద్గారాలకు మరో 9,441 టన్నుల ఉద్గారాలను జత చేస్తున్నాడని ఆ నివేదికలోనే చదివాను. అదే బంగ్లాదేశ్‌లో అయితే 1,384 టన్నులు, చైనాలో 56 టన్నుల ఉద్గారాలను శిశువులు జత చేస్తున్నారు. కానీ పశ్చిమ దేశాల జీవన విధానం మోజులో పడిన అభివృద్ధి చెందుతున్న దేశాల కూడా జనాభా వినియోగ సంస్కృతిని విశేషంగా పెంచుకుంటున్నది. ఇందులో భారత్ కూడా ఒకటి. పాశ్చాత్య దేశాల ప్రజల జీవన విధానాన్ని అనుసరించబోమని భారత్‌లోని మధ్య తరగతి ప్రజలు ప్రతిన పూనాలి. లేకుంటే వీరు కూడా ధనిక దేశాల ప్రజల వలే పర్యావరణకు జరుగుతున్న హానికి సంబంధించి దోషులుగానే మిగులుతారు. ఉద్గారాల ఉత్పత్తి మీద తలసరి లెక్కలు పరిశీలించకుండా నెపాన్ని ఇతరుల మీదకు తోసివేయడం చాలా సులభం కూడా. ఎంత తేడా? గడచిన బుధవారం బ్రిటిష్ సంస్థ ఆక్స్‌ఫామ్ ‘కర్బనాల అసమతుల్యతలో తీవ్రత’ను వివరిస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. ఆయా దేశాలు విడుదల చేస్తున్న కర్బనాలను గురించి ఇందులో లెక్కకట్టడం జరిగింది. జీవనశైలి ద్వారా జరిగే వినియోగం వల్ల విడుదలయ్యే 50 శాతం ఉద్గారాలకు ప్రపంచ ంలో ఉన్న కేవలం 10 శాతం ధనిక దేశాలే కారణమని ఆ నివేదిక వెల్లడించింది. దీనితో పాటు, ఇలాంటి జీవనశైలి వినియోగంతో విడుదలయ్యే మరో 10 శాతం ఉద్గారాలకు కారణం 50 శాతంగా ఉన్న పేదదేశాలని కూడా ఆ నివేదిక తేల్చి చెప్పింది. బలమైన ఆర్థిక వ్యవస్థలుగా అవతరిస్తున్న లేదా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలని పిలిచే దేశాల వల్లనే ఉద్గారాల పట్టిక తారుమారవుతున్నదన్న భ్రమను ఆక్స్‌ఫామ్ నివేదిక పటాపంచలు చేస్తుండగా, నిజమేమిటో మన కళ్ల ముందు నిలిచింది. ధనిక దేశాల జీవనశైలే భూగోళాన్ని ఎక్కువగా నష్టపరుస్తున్నదన్నదే సత్యం. ధనిక దేశాల ప్రజల జీవనశైలిని గురించి పల్లెత్తు మాట అనకూడదు కాబట్టి, మళ్లీ త్యాగాలు చేసే బాధ్యత అభివృద్ధి చెందుతున్న దేశాల భుజస్కంధాల మీదే పడుతోంది. ఈ ధోరణిని మార్చకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు. పైగా ధనిక దేశాలు ఆచరణాత్మకమైన ఒక కార్యక్రమం చేపట్టాలని అనుకోవడం వల్ల, అందుకు ప్రతిఫలంగా వంద బిలియన్ డాలర్ల వాతావరణ రక్షణ నిధి ఆ దేశాల భోజ్యమవుతోంది. పేద దేశాల భవిష్యత్ చిత్రపటం ఎంత దారుణంగా ఉందో ఆవిష్కరించే అన్ని రకాల వివరాలు ఇప్పుడు మన ముందు ఉన్నాయి. ఈ అధ్యయనాలను గురించి అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన విద్యావేత్తలు, సంప్రతింపుల నిపుణులు పదేపదే వల్లిస్తున్నారు కూడా. అయితే ధనిక దేశాలను హెచ్చరిస్తూ వచ్చే నివేదికలన్నీ చెవిటివాని ముందు శంఖు ఊదిన రీతిలో ప్రయోజనం లేకుండా మిగిలిపోతున్నాయి. ఫ్రాన్స్‌లో 2003లో కేవలం ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగిన ఫలితంగానే 10,000 మంది రాలిపోయారు. ఇంత జరుగుతున్నా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాలే త్యాగాలు చేయాలని చెబుతుంటారు. ధనిక దేశాల వారి జీవన శైలి చెక్కుచెదిరే పరిస్థితులు తలెత్తకూడదు. అంటే గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించుకోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలే గ్రీన్హౌస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి తప్ప, ధనిక దేశాల జీవనశైలి ఏ మార్పూ లేకుండా యథావిధిగానే కొనసాగుతుంది. ఇలాంటి ఆర్థిక వ్యవస్థల నమూనాల సంపూర్ణ మరమ్మత్తుకు సంబంధించిన కనీస ప్రస్తావన కూడా రావడం లేదు. ఆ ఆర్థిక వ్యవస్థలే భూగోళంలో వాతావరణ మార్పులకు దోహదం చేస్తూ, వాతావరణ పరిస్థితులను తల్లకిందులు చేస్తున్నాయి. దానికి కారణాలేమిటో తెలిసిందే. వ్యాసకర్త వ్యవసాయరంగ విశ్లేషకులు: దేవీందర్‌శర్మ hunger55@gmail.com -
రెడీ.. 1.. 2.. 3.. గో
‘స్పేస్’లో భారత్ ధూమ్ అగ్రరాజ్యాలకు దీటుగా ఇస్రో ప్రయోగాలు సాక్షి, హైదరాబాద్: ‘‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. రాకెట్ పైకి ఎగిరిందా? లేదా?..’’ అదేంటి.. పాపులర్ సినిమా డైలాగ్ మారిపోయిందే? ఏం కాదు.. శ్రీహరికోట కేంద్రంగా నింగికెగిరిన జీఎస్ఎల్వీని గుర్తుకు తెచ్చుకోండి.. భారతంలో అర్జునుడి పాశుపతాస్త్రానికి ఏమాత్రం తీసిపోని ఆయుధమిది అంతర్జాతీయ స్థాయిలో మరో ఖగోళ పోరుకూ అక్కరకొస్తున్నదీ ఇదే! రసవత్తరంగా సాగనున్న ఈ స్పేస్ రేస్ విశేషాలు ఇవిగో.. {Vహాలను దాటి విశ్వపు లోతుల్ని కొలవాలన్న మనిషి ఆకాంక్షకు కొత్త ఊపిరులూదుతున్న కాలమిది. అమెరికా, సోవియట్ రష్యా ప్రచ్ఛన్న యుద్ధకాలంనాటి ఆధిపత్య పోరులో భాగంగా పుట్టుకొచ్చిన అంతరిక్ష ప్రయోగాలు.. ఇప్పుడు దేశాల సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యానికి, అంతర్జాతీయ వేదికలపై గౌరవానికి ప్రతీకలవుతున్నాయి. చిత్రమేమిటంటే.. నిన్నమొన్నటివరకూ ఈ పోరులో తలపండిన ఆటగాళ్లుగా పేరుపడ్డ అమెరికా, రష్యాలు కొంచెం వెనుకపడిపోగా భారత్, చైనాలాంటి కొత్త ఆటగాళ్లు గోదాలోకి దిగి అగ్రరాజ్యాలకు సవాల్ విసురుతుండటం! ఇక్కడ ఒక్క విషయం మాత్రం సుస్పష్టం. ఈ పోటీలో ఎవరు ఓడినా... చివరకు గెలిచేది మాత్రం మనిషే!! లేటుగానైనా, లేటెస్టుగా... అంతరిక్ష ప్రయోగాల విషయంలో భారత్, మన పొరుగుదేశం చైనాలది లేట్ ఎంట్రీనే. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఏడాది నవంబర్ 5న అరుణగ్రహంపైకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. దాదాపు 20 ఏళ్లుగా కొరకరాని కొయ్యలా మిగిలిన క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ మిస్టరీలను ఛేదించిన భారత్ అదే ఊపుతో జీఎస్ఎల్వీ ప్రయోగాన్ని సక్సెస్ చేసి అగ్రరాజ్యాల సరసన నిలిచింది. ఈ విజయమిచ్చిన ఉత్సాహంతో మరో మూడేళ్లలో చంద్రయాన్-2 ద్వారా చంద్రుడిపైకి లాండర్‌ను, రోవర్‌ను కూడా పంపించాలని ఇస్రో నిర్ణయించింది. అంతేకాదు... మరో మూడు నెలల్లో జీఎస్ఎల్వీ ద్వారానే ఇస్రో మరో బృహత్తర ప్రయత్నానికి పూనుకుంటోంది. మానవులను అంతరిక్షంలోకి పంపించేందుకు ఉద్దేశించిన మాడ్యూల్‌ను జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా ప్రయోగాత్మకంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ రెండు ప్రయోగాలు విజయవంతమైతే అంతరిక్ష పోరులో భారత్ ఎంత మాత్రం తీసిపోమన్న సందేశం అగ్రరాజ్యాలకు ఇచ్చినట్లవుతుంది. ఇక చైనా విషయాన్ని తీసుకుంటే... భారీ ప్రణాళికలకు పెట్టింది పేరైన ఈ దేశం అంతరిక్ష ప్రయోగాలనూ అదే పంథాలో కొనసాగుతోంది. మార్స్ ఆర్బిటర్ విఫలమైనప్పటికీ లూనార్ రోవర్ సక్సెస్‌తో మానవసహిత అంతరిక్ష ప్రయోగాలతో కొంచెం ముందంజలో నిలిచింది. మరోవైపు జపాన్ కూడా చంద్రుడితోపాటు గ్రహశకలాలపై దృష్టి పెట్టింది. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది జపాన్ రెండోసారి ఓ చిన్ని గ్రహశకలాన్ని భూమ్మీదకు తీసుకురానుంది. అగ్రరాజ్యాలు ఎక్కడ? 2020కల్లా అంగారకుడిపైకి అమెరికన్ వ్యోమగామి అడుగుపెట్టాలి అన్నది మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఇచ్చిన పిలుపు. కానీ ఓడలు బళ్లు అవుతాయన్నట్టు.. ఆర్థికమాంద్యం నేపథ్యంలో అగ్రరాజ్యం అంతరిక్ష ప్రయోగాల వేగం తగ్గించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణంతోపాటు, అనేక ఉపగ్రహ ప్రయోగాలకు ఉపయోగ పడ్డ స్పేస్ షటిళ్లలో కొన్ని ప్రమాదాలకు గురి కావడం, మరికొన్నింటి కాలపరిమితి తీరిపోవడం, అదే సమయంలో కొత్త షటిళ్ల రూపకల్పనకు బడ్జెట్ పరిమితులు రావడం అమెరికా దూకుడు తగ్గిందనేందుకు నిదర్శనాలు. మార్స్ రోవర్ క్యూరియాసిటీ అంగారకుడిపై నీటిజాడలను గుర్తించేందుకు ‘మౌంట్‌షార్ప్’ వైపు వెళ్తుంటే.. నాసా ఇటీవలే ఈ గ్రహంపైకి ‘మావెన్’ను ప్రయోగించింది. ‘స్పేస్ ఎక్స్’ ‘ఆర్బిటల్ సైన్స్ కార్పొరేషన్’ వంటి ప్రైవేట్ కంపెనీలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా సరుకులు రవాణా చేస్తూండటం కూడా అమెరికా అంతరిక్ష ప్రయోగాల జోరుకు కళ్లెం వేస్తున్నాయి. మరోవైపు యూరోపియన్ యూనియన్ తనదైన శైలిలో పడుతూ లేస్తూ అంతరిక్ష ప్రయోగాలను ముందుకు తీసుకెళ్తోంది. రానున్న పదేళ్లలో అంగారకుడిపైకి రెండుసార్లు రోవర్లు పంపేందుకు, ఈ ఏడాది ఓ తోకచుక్కపైకి రాకెట్‌ను పంపేందుకు ప్రణాళికలు రచించుకుంది. సోవియట్ రష్యా విచ్ఛిన్నం తరువాత ఆర్థికంగా చితికిపోయిన రష్యా ఇటీవలి కాలంలో తిరిగి తన ముద్రను వేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అంతరిక్ష ప్రయోగాలకు బడ్జెట్ కేటాయింపులు మూడు రెట్లు ఎక్కువ చేయడం గమనార్హం. ఎందుకింత పోటీ? అంతరిక్ష ప్రయోగాల్లో ఇంతటి పోటీ నెలకొన డానికి కారణం ఏమిటి? దీన్ని మూడు కోణాల్లో చూడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితినైనా తట్టుకునేందుకు ఆయా దేశాలు చేస్తున్న ప్రయత్నంగా చూడొచ్చు. అదే సమయంలో సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాన్ని చాటిచెప్పడం ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందడమూ ఒక లక్ష్యం. అంతరిక్ష పర్యాటకం మరో అంశం. ప్రైవేట్ కంపెనీల రంగ ప్రవేశంతో అంతరిక్ష ప్రయోగాల తీరుతెన్నులు మారిపోయాయి. బ్రిటిష్ పారిశ్రామిక వేత్త రిచర్డ్ బ్రాస్నన్.. ‘వర్జిన్ గెలాటిక్’ పేరుతో అంతరిక్ష పర్యాటకానికి తెరదీశారు. దీంతో అనేక ఇతర కంపెనీలూ ఇదే మార్గం పట్టాయి. ‘ప్లానెటరీ రిసోర్సెస్’ వంటి కంపెనీలు మాత్రం అంతరిక్ష ప్రయోగాలను ఫక్తు వాణిజ్య దృక్పథంతో చూస్తున్నాయి. భూమ్మీదకు లేదా దగ్గరగా వస్తున్న గ్రహ, ఉల్కా శకలాల మైనింగ్‌కు సిద్ధమవుతోంది ఈ కంపెనీ. కీలకమైన ప్లాటినమ్ లోహంతోపాటు అంతరిక్షంలోనే రాకెట్ ఇంధనాలు సేకరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. కొటేషన్స్... ‘‘అంతరిక్ష రంగంలో భారత్ ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. అధిగమించాల్సిన సవాళ్లు ముందున్నాయి’’ - కె.రాధాక్రిష్ణన్, ఛైర్మన్, ఇస్రో ‘‘చైనా ఉపగ్రహా విధ్వంసక క్షిపణి ప్రయోగం (2007) భారత్ నిద్దుర వదిలించింది.’’ - రాజేశ్వరి పిళ్లై రాజగోపాలన్, సీనియర్ ఫెలో, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ‘‘భారత్ లాంటి దేశాలకు అంతరిక్ష ప్రయోగాలు లగ్జరీ కాదు.. అత్యవసరం’’ సుష్మితా మహంతి, సీఈవో ఎర్త్2ఆర్బిట్ (దేశంలో తొలి ప్రైవేట్ స్పేస్ కంపెనీ) ‘‘అంతరిక్ష పోరులో తామూ ఉన్నామని చెప్పేందుకు ఇదో దారి’’ - రసెల్ బాయ్సీ, ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సెన్సైస్