రెడీ.. 1.. 2.. 3.. గో | ISRO does experiments like developing countries | Sakshi
Sakshi News home page

రెడీ.. 1.. 2.. 3.. గో

Published Tue, Jan 14 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

రెడీ.. 1.. 2.. 3.. గో

రెడీ.. 1.. 2.. 3.. గో

‘స్పేస్’లో భారత్ ధూమ్
 అగ్రరాజ్యాలకు దీటుగా ఇస్రో ప్రయోగాలు
 

 సాక్షి, హైదరాబాద్:

 ‘‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. రాకెట్ పైకి ఎగిరిందా? లేదా?..’’  అదేంటి.. పాపులర్ సినిమా డైలాగ్ మారిపోయిందే?  ఏం కాదు.. శ్రీహరికోట కేంద్రంగా నింగికెగిరిన జీఎస్‌ఎల్వీని గుర్తుకు తెచ్చుకోండి..  భారతంలో అర్జునుడి పాశుపతాస్త్రానికి ఏమాత్రం తీసిపోని ఆయుధమిది  అంతర్జాతీయ స్థాయిలో మరో ఖగోళ పోరుకూ అక్కరకొస్తున్నదీ ఇదే!  రసవత్తరంగా సాగనున్న ఈ స్పేస్ రేస్ విశేషాలు ఇవిగో..

     {Vహాలను దాటి విశ్వపు లోతుల్ని కొలవాలన్న మనిషి ఆకాంక్షకు కొత్త ఊపిరులూదుతున్న కాలమిది. అమెరికా, సోవియట్ రష్యా ప్రచ్ఛన్న యుద్ధకాలంనాటి ఆధిపత్య పోరులో భాగంగా పుట్టుకొచ్చిన అంతరిక్ష ప్రయోగాలు.. ఇప్పుడు దేశాల సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యానికి, అంతర్జాతీయ వేదికలపై గౌరవానికి ప్రతీకలవుతున్నాయి. చిత్రమేమిటంటే.. నిన్నమొన్నటివరకూ ఈ పోరులో తలపండిన ఆటగాళ్లుగా పేరుపడ్డ అమెరికా, రష్యాలు కొంచెం వెనుకపడిపోగా భారత్, చైనాలాంటి కొత్త ఆటగాళ్లు గోదాలోకి దిగి అగ్రరాజ్యాలకు సవాల్ విసురుతుండటం! ఇక్కడ ఒక్క విషయం మాత్రం సుస్పష్టం. ఈ పోటీలో ఎవరు ఓడినా... చివరకు గెలిచేది మాత్రం మనిషే!!
 
 లేటుగానైనా, లేటెస్టుగా...
 
 అంతరిక్ష ప్రయోగాల విషయంలో భారత్, మన పొరుగుదేశం చైనాలది లేట్ ఎంట్రీనే. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఏడాది నవంబర్ 5న అరుణగ్రహంపైకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. దాదాపు 20 ఏళ్లుగా కొరకరాని కొయ్యలా మిగిలిన క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ మిస్టరీలను ఛేదించిన భారత్ అదే ఊపుతో జీఎస్‌ఎల్వీ ప్రయోగాన్ని సక్సెస్ చేసి అగ్రరాజ్యాల సరసన నిలిచింది. ఈ విజయమిచ్చిన ఉత్సాహంతో మరో మూడేళ్లలో చంద్రయాన్-2 ద్వారా చంద్రుడిపైకి లాండర్‌ను, రోవర్‌ను కూడా పంపించాలని ఇస్రో నిర్ణయించింది.

అంతేకాదు... మరో మూడు నెలల్లో జీఎస్‌ఎల్వీ ద్వారానే ఇస్రో మరో బృహత్తర ప్రయత్నానికి పూనుకుంటోంది. మానవులను అంతరిక్షంలోకి పంపించేందుకు ఉద్దేశించిన మాడ్యూల్‌ను జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా ప్రయోగాత్మకంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ రెండు ప్రయోగాలు విజయవంతమైతే అంతరిక్ష పోరులో భారత్ ఎంత మాత్రం తీసిపోమన్న సందేశం అగ్రరాజ్యాలకు ఇచ్చినట్లవుతుంది. ఇక చైనా విషయాన్ని తీసుకుంటే... భారీ ప్రణాళికలకు పెట్టింది పేరైన ఈ దేశం అంతరిక్ష ప్రయోగాలనూ అదే పంథాలో కొనసాగుతోంది. మార్స్ ఆర్బిటర్ విఫలమైనప్పటికీ లూనార్ రోవర్ సక్సెస్‌తో మానవసహిత అంతరిక్ష ప్రయోగాలతో కొంచెం ముందంజలో నిలిచింది. మరోవైపు జపాన్  కూడా చంద్రుడితోపాటు గ్రహశకలాలపై దృష్టి పెట్టింది. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది జపాన్ రెండోసారి ఓ చిన్ని గ్రహశకలాన్ని భూమ్మీదకు తీసుకురానుంది.
 
 అగ్రరాజ్యాలు ఎక్కడ?
 
 2020కల్లా అంగారకుడిపైకి అమెరికన్ వ్యోమగామి అడుగుపెట్టాలి అన్నది మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఇచ్చిన పిలుపు. కానీ ఓడలు బళ్లు అవుతాయన్నట్టు.. ఆర్థికమాంద్యం నేపథ్యంలో అగ్రరాజ్యం అంతరిక్ష ప్రయోగాల వేగం తగ్గించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణంతోపాటు, అనేక ఉపగ్రహ ప్రయోగాలకు ఉపయోగ పడ్డ స్పేస్ షటిళ్లలో కొన్ని ప్రమాదాలకు గురి కావడం, మరికొన్నింటి కాలపరిమితి తీరిపోవడం, అదే సమయంలో కొత్త షటిళ్ల రూపకల్పనకు బడ్జెట్ పరిమితులు రావడం అమెరికా దూకుడు తగ్గిందనేందుకు నిదర్శనాలు. మార్స్ రోవర్ క్యూరియాసిటీ అంగారకుడిపై నీటిజాడలను గుర్తించేందుకు ‘మౌంట్‌షార్ప్’ వైపు వెళ్తుంటే.. నాసా ఇటీవలే ఈ గ్రహంపైకి ‘మావెన్’ను ప్రయోగించింది.

‘స్పేస్ ఎక్స్’ ‘ఆర్బిటల్ సైన్స్ కార్పొరేషన్’ వంటి ప్రైవేట్ కంపెనీలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా సరుకులు రవాణా చేస్తూండటం కూడా అమెరికా అంతరిక్ష ప్రయోగాల జోరుకు కళ్లెం వేస్తున్నాయి. మరోవైపు యూరోపియన్ యూనియన్ తనదైన శైలిలో పడుతూ లేస్తూ అంతరిక్ష ప్రయోగాలను ముందుకు తీసుకెళ్తోంది. రానున్న పదేళ్లలో అంగారకుడిపైకి రెండుసార్లు రోవర్‌లు పంపేందుకు, ఈ ఏడాది ఓ తోకచుక్కపైకి రాకెట్‌ను పంపేందుకు ప్రణాళికలు రచించుకుంది. సోవియట్ రష్యా విచ్ఛిన్నం తరువాత ఆర్థికంగా చితికిపోయిన రష్యా ఇటీవలి కాలంలో తిరిగి తన ముద్రను వేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అంతరిక్ష ప్రయోగాలకు బడ్జెట్ కేటాయింపులు మూడు రెట్లు ఎక్కువ చేయడం గమనార్హం.
 
 ఎందుకింత పోటీ?
 
 అంతరిక్ష ప్రయోగాల్లో ఇంతటి పోటీ నెలకొన డానికి కారణం ఏమిటి? దీన్ని మూడు కోణాల్లో చూడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితినైనా తట్టుకునేందుకు ఆయా దేశాలు చేస్తున్న ప్రయత్నంగా చూడొచ్చు. అదే సమయంలో సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాన్ని చాటిచెప్పడం ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందడమూ ఒక లక్ష్యం. అంతరిక్ష పర్యాటకం మరో అంశం. ప్రైవేట్ కంపెనీల రంగ ప్రవేశంతో అంతరిక్ష ప్రయోగాల తీరుతెన్నులు మారిపోయాయి. బ్రిటిష్ పారిశ్రామిక వేత్త రిచర్డ్ బ్రాస్‌నన్.. ‘వర్జిన్ గెలాటిక్’ పేరుతో అంతరిక్ష పర్యాటకానికి తెరదీశారు. దీంతో అనేక ఇతర  కంపెనీలూ ఇదే మార్గం పట్టాయి. ‘ప్లానెటరీ రిసోర్సెస్’ వంటి కంపెనీలు మాత్రం అంతరిక్ష ప్రయోగాలను ఫక్తు వాణిజ్య దృక్పథంతో చూస్తున్నాయి. భూమ్మీదకు లేదా దగ్గరగా వస్తున్న గ్రహ, ఉల్కా శకలాల మైనింగ్‌కు సిద్ధమవుతోంది ఈ కంపెనీ. కీలకమైన ప్లాటినమ్ లోహంతోపాటు అంతరిక్షంలోనే రాకెట్ ఇంధనాలు సేకరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. 
 
 కొటేషన్స్...
 
 ‘‘అంతరిక్ష రంగంలో భారత్ ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. అధిగమించాల్సిన సవాళ్లు ముందున్నాయి’’
 - కె.రాధాక్రిష్ణన్, ఛైర్మన్, ఇస్రో
 ‘‘చైనా ఉపగ్రహా విధ్వంసక క్షిపణి ప్రయోగం (2007) భారత్ నిద్దుర వదిలించింది.’’
 - రాజేశ్వరి పిళ్లై రాజగోపాలన్, సీనియర్ ఫెలో, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్
 ‘‘భారత్ లాంటి దేశాలకు అంతరిక్ష ప్రయోగాలు లగ్జరీ కాదు.. అత్యవసరం’’
 సుష్మితా మహంతి, సీఈవో ఎర్త్2ఆర్బిట్ (దేశంలో తొలి ప్రైవేట్ స్పేస్ కంపెనీ)
 ‘‘అంతరిక్ష పోరులో తామూ ఉన్నామని చెప్పేందుకు ఇదో దారి’’
 - రసెల్ బాయ్‌సీ, ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సెన్సైస్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement