కలిమి మండిస్తున్న కొలిమి | Environmental Pollution is Inevitable in Developing Countries | Sakshi
Sakshi News home page

కలిమి మండిస్తున్న కొలిమి

Published Fri, Dec 11 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

కలిమి మండిస్తున్న కొలిమి

కలిమి మండిస్తున్న కొలిమి

విశ్లేషణ
ధనిక దేశాల ప్రజల జీవనశైలిని గురించి పల్లెత్తు మాట అనకూడదు కాబట్టి, మళ్లీ త్యాగాలు చేసే బాధ్యత అభివృద్ధి చెందుతున్న దేశాల భుజస్కంధాల మీదే పడుతోంది. పేద దేశాల భవిష్యత్ చిత్రపటం ఎంత దారుణంగా ఉందో ఆవిష్కరించే అన్ని రకాల వివరాలు ఇప్పుడు మన ముందు ఉన్నాయి. ఈ అధ్యయనాలను గురించి అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన విద్యావేత్తలు, సంప్రతింపుల నిపుణులు పదేపదే వల్లిస్తున్నారు కూడా. అయితే ధనిక దేశాలను హెచ్చరిస్తూ వచ్చే  నివేదికలన్నీ చెవిటివాని ముందు శంఖు ఊదిన రీతిలో ప్రయోజనం లేకుండా మిగిలి పోతున్నాయి. ఫ్రాన్స్‌లో 2003లో కేవలం ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగిన ఫలితంగానే 10,000 మంది రాలిపోయారు. ఇంత జరుగుతున్నా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాలే త్యాగాలు చేయాలని చెబుతుంటారు. ధనిక దేశాల వారి జీవన శైలి చెక్కుచెదిరే పరిస్థితులు తలెత్తకూడదు.

 ధనిక దేశాల ప్రజలు సాగిస్తున్న జీవన విధానమే పర్యావరణంలో ఉత్పాతాలకు కారణమవుతున్నదని ప్రపంచమంతా చూస్తుండగానే మన  ప్రధాని నరేంద్ర  మోదీ ఆరోపించారు. మోదీ సరిగ్గా గురి చూసి కొట్టిన సంగతిని గుర్తించవలసిందే. పాశ్చాత్య దేశాల ప్రజల జీవన విధానం గురించి నోరు విప్పడమే పెద్ద నేరంలా భావిస్తారు. అసలు ఆ అంశాన్ని లేవనెత్తడమే మర్యాదను ఉల్లంఘించడం కింద కూడా ప్రకటిస్తారు. మొత్తంగా ధనిక దేశాలను నిలదీయడమే రాజకీయంగా తప్పన్నట్టు మాట్లాడతారు.

 'ఏదిఏమైనా ఎవరో కొద్దిమంది అనుసరించే జీవన విధానం ఇప్పటికీ అభివృద్ధి అనే నిచ్చెన మొదటి మెట్టు దగ్గర ఉండిపోయిన దేశాల అవకాశాలకు అడ్డంకిగా నిలవరాదు' అని కూడా 'ఫైనాన్షియల్ టైమ్స్'వారి అభిప్రాయసేకరణ  పుస్తకంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. మోదీ రాసిన ఈ మాటలు అందరికీ వందనీయుడైన పర్యావరణవేత్త స్వర్గీయ అనిల్ అగర్వాల్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని నాకు గుర్తుకు వచ్చేటట్టు చేశాయి. అగర్వాల్ ఒక సందర్భంలో ఇలా రాశారు, 'ఒక సగటు అమెరికా పౌరుడు వినియోగించిన స్థాయిలోనే ఒక మధ్య తరగతి భారతీయుడు కూడా విద్యుత్‌ను వినియోగించినట్టయితే ఈ ప్రపంచం యాభై ఏళ్ల క్రితమే ఉడికిపోయి ఉండేది.'ఆయన సత్యమే చెప్పారు. అయినా మీరు ధనిక దేశాల ప్రజల జీవనశైలిని గురించి ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారి దగ్గర నుంచి మనకు వస్తున్న సమాధానం మండిపాటు మాత్రమే. నేను కూడా కొన్నేళ్ల క్రితం ఇలా ప్రశ్నించే పని చేసినందుకు అలాంటి ఆగ్రహాన్నే చవి చూశాను. ధాన్యం పండించడం కంటే, గొడ్డు మాంసం తినడమే పర్యావరణానికి ఎంతో ప్రమాదకరమని చెబుతూ, ఆ అంశం మీద వెలువడిన పలు అధ్యయనాలను ఒక వ్యాసంలో ఉటంకించాను. దీనితో ఒక పద్ధతి ప్రకారం సోషల్ మీడియా ద్వారా తిట్ల దండకంతో నా మీద దండయాత్ర జరిగింది.

 మూడు భూగోళాలు ఎలా వస్తాయి?
 మూడు సంవత్సరాల క్రితమే, అంటే 2012లోనే వరల్డ్‌వైడ్ ఫండ్ (డబ్ల్యు. డబ్ల్యు. ఎఫ్.) 'లివింగ్ ప్లానెట్' (జీవ వైవిధ్యం, పర్యావరణం పద్ధతులు, సహజ వనరులతో కూడిన భూగోళాన్ని ప్రస్తావించడానికి వాడుతున్న పదబంధం) పేరుతో నివేదికను విడుదల చేసింది. నిజానికి ఆ సంస్థ ప్రతి రెండేళ్లకూ ఒకసారి ఇలాంటి ఒక నివేదికను ప్రపంచం ముందు పెడుతూ ఉంటుంది. అయితే 2012 నివేదికలో, 'భూగోళం మనకు అందివ్వగల వనరులకు మించి యాభైశాతం అదనంగా వనరులను వినియోగించు కుంటున్నాం. అంటే మనం ఇవాళ 1 1/2 భూగోళం వంటిదాని మీద నివశిస్తున్నామన్నమాట'అని డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్. పేర్కొన్నది. 'ఇదే పద్ధతిని మనం కొనసాగిస్తే 2050 నాటికి మనకి మూడు భూగోళాలు అవసరమవుతాయి'అని ఆ సంస్థ సంచాలకుడు జిమ్ లీపే చెప్పారు. ఇంతకు మించిన సుస్పష్టమైన, గట్టి హెచ్చరిక మరొకటి ఉండదు.

 ప్రపంచంలో ఉష్ణోగ్రత రెండు డిగ్రీలకు దాటకుండా చూడడం కోసం ఉద్గారాల ప్రమాణాలను అదుపుచేయాలని ఆకాంక్షించడం ముమ్మాటికీ ఆహ్వానించదగిన వైఖరే. కానీ ఇక్కడే పట్టించుకోని సంగతి, లేదా ఉద్దేశ పూర్వకంగానే జరుగుతున్నదేనని భావించినా భావించవలసిన సంగతి- అది, వినియోగం మీద నిష్కర్షగా కోత విధించుకోకపోవడం. మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ పెరుగుదల నమూనాయే వినియోగాన్ని ప్రోత్సహిం చేదిగా కనిపిస్తూ ఉండడం, దీనితోనే స్థూల దేశీయోత్పత్తిని లెక్క కట్టడం, ఇదంతా ప్రకృతి వనరులను కేవల వినియోగ వస్తువుగా చూసేటట్టు చేయడంతో సంక్షోభానికి తెర లేచింది. ఈ విధమైన వినియోగ ధోరణి ఏ మాత్రం సమర్థనీయం కాదని డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్. నివేదిక తేల్చిచెప్పింది. అయినప్పటికీ ఈనాటికి కూడా ఏ ఒక్కరు వినియోగాన్ని తగ్గించుకోవడం గురించి నోరెత్తి మాట్లాడడం లేదు. ఒక వేళ ఎవరైనా ఆ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారి మీద అభివృద్ధి నిరోధకులన్న ముద్ర పడిపోతుంది.

 మనవారూ దోషులే అవుతారు!
 ధనికదేశాల ప్రజలు, జాతులు పర్యావరణం మీద చూపుతున్న ప్రభావం, తక్కువ ఆదాయం కలిగిన దేశాల ప్రజల ద్వారా పడే ప్రభావం కంటే ఆరు రెట్లు ఎక్కువ. ఇందుకు సంబంధించి 'ది గార్డియన్' పత్రిక కూడా ఒక నివేదికను ప్రచురించింది. అమెరికాలో జన్మిస్తున్న ప్రతి శిశువు తన తల్లిదండ్రుల ద్వారా జనించే కర్బన ఉద్గారాలకు మరో 9,441 టన్నుల ఉద్గారాలను జత చేస్తున్నాడని ఆ నివేదికలోనే చదివాను. అదే బంగ్లాదేశ్‌లో అయితే 1,384 టన్నులు, చైనాలో 56 టన్నుల ఉద్గారాలను శిశువులు జత చేస్తున్నారు. కానీ పశ్చిమ దేశాల జీవన విధానం మోజులో పడిన అభివృద్ధి చెందుతున్న దేశాల కూడా  జనాభా వినియోగ సంస్కృతిని విశేషంగా పెంచుకుంటున్నది. ఇందులో భారత్ కూడా ఒకటి. పాశ్చాత్య దేశాల ప్రజల జీవన విధానాన్ని అనుసరించబోమని భారత్‌లోని మధ్య తరగతి ప్రజలు ప్రతిన పూనాలి. లేకుంటే వీరు కూడా ధనిక దేశాల ప్రజల వలే పర్యావరణకు జరుగుతున్న  హానికి సంబంధించి దోషులుగానే మిగులుతారు. ఉద్గారాల ఉత్పత్తి మీద తలసరి లెక్కలు పరిశీలించకుండా నెపాన్ని ఇతరుల మీదకు తోసివేయడం చాలా సులభం కూడా.

 ఎంత తేడా?
 గడచిన బుధవారం బ్రిటిష్ సంస్థ ఆక్స్‌ఫామ్ ‘కర్బనాల అసమతుల్యతలో తీవ్రత’ను వివరిస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. ఆయా దేశాలు విడుదల చేస్తున్న కర్బనాలను గురించి ఇందులో లెక్కకట్టడం జరిగింది. జీవనశైలి ద్వారా జరిగే వినియోగం వల్ల విడుదలయ్యే 50 శాతం ఉద్గారాలకు ప్రపంచ ంలో ఉన్న  కేవలం 10 శాతం ధనిక దేశాలే కారణమని ఆ నివేదిక వెల్లడించింది. దీనితో పాటు, ఇలాంటి జీవనశైలి వినియోగంతో విడుదలయ్యే మరో 10 శాతం ఉద్గారాలకు కారణం 50 శాతంగా ఉన్న పేదదేశాలని కూడా ఆ నివేదిక తేల్చి చెప్పింది. బలమైన ఆర్థిక వ్యవస్థలుగా అవతరిస్తున్న లేదా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలని పిలిచే దేశాల వల్లనే ఉద్గారాల పట్టిక తారుమారవుతున్నదన్న భ్రమను ఆక్స్‌ఫామ్ నివేదిక పటాపంచలు చేస్తుండగా, నిజమేమిటో మన కళ్ల ముందు నిలిచింది. ధనిక దేశాల జీవనశైలే భూగోళాన్ని ఎక్కువగా నష్టపరుస్తున్నదన్నదే సత్యం.

 ధనిక దేశాల ప్రజల జీవనశైలిని గురించి పల్లెత్తు మాట అనకూడదు కాబట్టి, మళ్లీ త్యాగాలు చేసే బాధ్యత అభివృద్ధి చెందుతున్న దేశాల భుజస్కంధాల మీదే పడుతోంది. ఈ ధోరణిని మార్చకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు. పైగా ధనిక దేశాలు ఆచరణాత్మకమైన ఒక కార్యక్రమం చేపట్టాలని అనుకోవడం వల్ల, అందుకు ప్రతిఫలంగా వంద బిలియన్ డాలర్ల వాతావరణ రక్షణ నిధి ఆ దేశాల భోజ్యమవుతోంది. పేద దేశాల భవిష్యత్ చిత్రపటం ఎంత దారుణంగా ఉందో ఆవిష్కరించే అన్ని రకాల వివరాలు ఇప్పుడు మన ముందు ఉన్నాయి. ఈ అధ్యయనాలను గురించి అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన విద్యావేత్తలు, సంప్రతింపుల నిపుణులు పదేపదే వల్లిస్తున్నారు కూడా. అయితే ధనిక దేశాలను హెచ్చరిస్తూ వచ్చే  నివేదికలన్నీ చెవిటివాని ముందు శంఖు ఊదిన రీతిలో ప్రయోజనం లేకుండా మిగిలిపోతున్నాయి. ఫ్రాన్స్‌లో 2003లో కేవలం ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగిన ఫలితంగానే 10,000 మంది రాలిపోయారు. ఇంత జరుగుతున్నా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాలే త్యాగాలు చేయాలని చెబుతుంటారు. ధనిక దేశాల వారి జీవన శైలి చెక్కుచెదిరే పరిస్థితులు తలెత్తకూడదు.

 అంటే గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించుకోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలే  గ్రీన్‌హౌస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి తప్ప, ధనిక దేశాల జీవనశైలి ఏ మార్పూ లేకుండా యథావిధిగానే కొనసాగుతుంది. ఇలాంటి ఆర్థిక వ్యవస్థల నమూనాల సంపూర్ణ మరమ్మత్తుకు సంబంధించిన కనీస ప్రస్తావన కూడా రావడం లేదు. ఆ ఆర్థిక వ్యవస్థలే భూగోళంలో వాతావరణ మార్పులకు దోహదం చేస్తూ, వాతావరణ పరిస్థితులను తల్లకిందులు చేస్తున్నాయి. దానికి కారణాలేమిటో తెలిసిందే.
http://img.sakshi.net/images/cms/2013-08/71375985938_625x300.jpg
 వ్యాసకర్త వ్యవసాయరంగ విశ్లేషకులు: దేవీందర్‌శర్మ
hunger55@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement