గుర్తుకు రావడం లేదు...! | Dementia Cases Increasing In Developing Countries | Sakshi
Sakshi News home page

గుర్తుకు రావడం లేదు...!

Published Sat, Sep 22 2018 7:11 AM | Last Updated on Sat, Sep 22 2018 8:41 AM

Dementia Cases Increasing In Developing Countries - Sakshi

ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియా కేసులు పెరిగిపోతున్నాయి...  ప్రతీ ఏడాది దాదాపు కోటి వరకు కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. అరవై ఏళ్లు, అంతకు పైబడిన వయసు వాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుండడంతో డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అయితే  నలభై నుంచి యాభై ఏళ్ల మధ్య వయసున్న వారు కూడా ఈ రకమైన సమస్యలతో బాధపడుతున్నట్టు తాజాగా కేసులు బయటపడడం పట్ల డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం వివిధదేశాల్లో ఐదు కోట్లకు పైగానే  ఈ పేషంట్లు ఉన్నారు. వీరిలో 60 శాతం వరకు తక్కువ, మధ్య ఆదాయ (లో అండ్‌ మిడిల్‌ ఇన్‌కమ్‌) దేశాల్లోనే (ప్రపంచబ్యాంక్‌ వర్గీకరించిన ఈ ఆదాయ దేశాల జాబితాలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలున్నాయి) నివసిస్తున్నారు. డిమెన్షియా పేషంట్ల సంఖ్య 2030 కల్లా ఎనిమిదిన్నర కోట్లకు,  2050 కల్లా 15 కోట్లు దాట వచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహేచ్‌ఓ) అంచనా. 

పరిష్కారం ఏమిటీ ?
జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మాటల కోసం తడుముకోడం, తెలిసిన మనుషులను కూడా గుర్తించకలేకపోవడం, ఏవైనా వస్తువుల కోసం పదే పదే వెతుక్కోవడం, ఏవైనా సులభమైన కూడికలు కూడా చేయలేకపోవడం వంటివి అల్జీమర్స్‌ లక్షణాలు. అల్జీమర్స్‌తో పాటు ఇతర రూపాల్లోని  చిత్తవైకల్యాన్ని డిమెన్షియాగా పరిగణిస్తున్నారు.  మనదేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు అధికరక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్టు ఓ అంచనా. ఇలాంటి వారికి వయసు పెరిగే కొద్ది అల్జీమర్స్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు.  సాథారణంగా 65 ఏళ్ల వయసు వారిలో ఇలాంటì  లక్షణాలుæ కనిపిస్తున్నట్టు, ఓ సారి ఆల్జీమర్స్‌ బారిన పడ్డాక దాని నుంచి పూర్తిస్థాయిలో బయటపడడం మాత్రం సాధ్యం కాదని  డా.నస్లీ ఇచ్ఛపోరియా అభిప్రాయపడ్డారు.

అయితే దీని బారిన పడకుండా చురుకుగా చైతన్యవంతంగా వ్యవహరించడంలో మెదడు పనితీరు కీలకం అవుతుందని చెప్పారు. ఆరోగ్యపరిరక్షణకు మంచి ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయమం. సామాజిక సంబంధాలు  కలిగి ఉండడంతో పాటు కుటుంబసభ్యులతో గడపడం, మనుషులను కలుసుకోవడం చేస్తుండాలని సూచించారు.  ‘వాయుకాలుష్యం కూడా అల్జీమర్స్‌కు ఓ కారణంగా  తెలుస్తోంది. గాలిలో కాలుష్యం   శ్వాసకోస వ్యాధులకు దారితీస్తుందని ప్రజలు భావిస్తున్నా, మెదడు కణాలు క్రమక్రమంగా బలహీనపడేందుకు, మెదడుకు అందే  రక్తప్రసారం తగ్గిపోయేందుకు కారణమవుతోంది. వాయుకాలుష్యంలో భాగంగా ఉన్న లెక్కకు మించిన ర సాయనాలు మెదడు సరిగా పనిచేయకుండా చేస్తున్నాయి.’ అని డా.నస్లీ తెలిపారు. 

భారత్‌లో  పౌరుల సగటు ఆయుర్ధాయం పెరుగుదల వల్ల కూడా పెద్ద వయసు వారి సంఖ్య పెరుగుతుండడంతో వారిలో అల్జీమర్స్‌కు కారణం అవుతోంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి లేనివారు, మెదడును చురుకుగా, చైతన్యవంతంగా ఉంచకుండా స్తబ్దుగా ఉండేవాళ్లు ఎక్కువగా అల్జీమర్స్‌ బారిన పడే అవకాశాలున్నాయి. మెదడును క్రియాశీలంగా ఉపయోగించకపోతే పెద్దవయసులో క్రమంగా మతిమరుపుతో పాటు అల్జీమర్స్‌లోని ఇతర లక్షణాల బారిన పడాల్సి వస్తుంది ’ అని డా. హేమంత్‌ సంత్‌ పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement