
అమెరికా అధ్యక్ష బాధ్యత స్వీకరిస్తూ తొలినాడే డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) 26 కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. ఇవి సమాఖ్య ప్రభుత్వ నిర్వహణకు అధ్యక్షుని ఆదేశాలు. రాజ్యాంగంలోని 2వ అధికరణ అధ్యక్షునికి ఈ అధికారమిచ్చింది. ఈ ఆదేశాలకు చట్టసభ (కాంగ్రెస్) ఆమోదం అక్కర్లేదు. వీటికి అవసరమైన నిధుల కోతలు వంటి చర్యల ద్వారా కాంగ్రెస్ వీటిని అడ్డుకోవచ్చు. రాజ్యాంగ విరుద్ధాలని తేలితే రద్దు చేయవచ్చు. నిజానికి ఈ ఆదేశాల్లో అత్యధికం రాజ్యాంగ విరుద్ధమైనవీ, అధికార దుర్వినియోగానికి దారితీసేవే.
రాజ్యాంగ 14వ సవరణ సెక్షన్ 1 అమెరికాలో పుట్టిన వారందరికీ పౌరసత్వ హక్కునిచ్చింది. కోర్టు ఈ ట్రంప్ ఆదేశాన్ని తిరస్కరించవచ్చు. దేశ భద్రత సాకుతో అమెరికా–మెక్సికో సరిహద్దుల్లోకి సైన్యాన్ని పంపడానికి, సైనిక నిధుల మళ్ళింపునకు, 2017లో ఈ సరిహద్దుల్లో మొదలుపెట్టిన గోడ నిర్మాణాన్ని పూర్తిచేయడానికి దక్షిణ సరిహద్దుల్లో జాతీయ అత్యవసరస్థితి విధించే ఆదేశం జారీచేశారు ట్రంప్. ఈ ఆదేశం అధ్యక్షునికి నిరంకుశ అధికారాలను కట్టబెట్టే రాజ్యాంగ విరుద్ధ చర్య. అలాగే జాతీయ ఇంధన అత్యవసర స్థితిని ప్రకటించడం.. సౌర, వాయు ఇంధన పథకాలను ఆపే ఎత్తుగడ. దక్షిణ అమెరికా (South America) మత్తుపదార్థాల వ్యాపార వేదికలపై ఉగ్రవాద సంస్థలుగా ముద్రవేయడం ద్వారా మెక్సికోలో చొరబాటుకు వీలు చేసుకుంటున్నారు ట్రంప్. పనామా కాలువపై (Panama Canal) తిరిగి ఆధిపత్యం నెలకొల్పుకుంటామనడమూ ఉద్రిక్తతలు పెంచే నిర్ణయమే!
ట్రంప్ 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన తర్వాత తన అనుచరులను కేపిటల్ హిల్‌పై దాడికి పురమాయించడం, దాడిలో పాల్గొన్న వారికి శిక్షలు పడటం తెలిసిందే. ఈ నేరంపై శిక్ష అనుభవిస్తున్న 1,500 మందితోపాటు 700 మంది ఇతర నేరస్థులకు ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. ఇది అనైతికం. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నుండి, ‘ప్యారిస్ పర్యావరణ కాలుష్య నియంత్రణ ఒప్పందం’ నుండి అమెరికా వైదొలగుతున్నట్లు ప్రకటించడం ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం.
చదవండి: నివాళులు అర్పించడం ఇలాగేనా?
అంతర్జాతీయ మెక్సికో గల్ఫ్‌ను ‘అమెరికా గల్ఫ్’గా మార్చారు. అంతర్జాతీయ జలాశయాల పేర్లను అమెరికా చట్టాలు మార్చలేవు. ‘తొలిరోజే నియంతనవుతా’నని ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించిన ట్రంప్ అన్నంత పనీ చేశారు. ఇప్పుడు శ్రామిక, పౌరహక్కుల, మహిళా, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ట్రంప్ వ్యతిరేక సమ్మెకూ; దాదాపు 200 సంస్థలు న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి.
– సంగిరెడ్డి హనుమంత రెడ్డి, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment