= కన్నడ రాజ్యోత్సవంలో సీఎం వెల్లడి ..
= ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లిషు తప్పనిసరి
= ఉపాధి అవకాశాల దృష్ట్యా ఆ భాషకు ప్రాధాన్యత
= అంతమాత్రాన ఆంగ్లమే సర్వస్వం కాదు
= ఇంగ్లిషులోనే మాట్లాడాలని విద్యార్థులపై ఒత్తిడి తేవడం సరికాదు
= కన్నడ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
= ఆ మాధ్యమం పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసేయం
= ఇక్కడున్న రాష్ట్రేతరులూ కన్నడ నేర్చుకోవాలి
సాక్షి, బెంగళూరు : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష నేర్చుకోవడం తప్పని సరైన పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఇక్కడి కంఠీరవ స్టేడియంలో శుక్రవారం జరిగిన కన్నడ రాజ్యోత్సవంలో ఆయన ప్రసంగించారు. ప్రపంచీకరణతో పాటు ఉపాధి అవకాశాల దృష్ట్యా ఇంగ్లిషుకు ప్రాధాన్యత కల్పించడం తప్పనిసరి అన్నారు.
అందువల్లే విద్యార్థులకు ఒకటో తరగతి నుంచే ఇంగ్లిషును బోధనా భాషగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించామని చెప్పారు. అంతమాత్రాన ఇంగ్లిషు భాషే సర్వస్వం అనుకోవడానికి లేదన్నారు. ఆ భాషను ఎంతవరకూ నేర్చుకోవాలి, ఏ సమయంలో ఉపయోగించుకోవాలనే విషయం అప్పటి పరిస్థితులను బట్టి ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాలన్నారు. కన్నడ మీడియంలో చదివితే పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకోలేరనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
ఈ ఆలోచన వల్లే వారు తమ పిల్లలను ఇంగ్లిషు మీడియంలో చేర్పించడమే కాకుండా ఆ భాషలోనే మాట్లాడాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇది సరికాదన్నారు. మాతృభాషను నేర్చుకోవడం, మాట్లాడటంలో నిర్లక్ష్యం వహిస్తే మిగిలిన భాషలపై పట్టు ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. కన్నడ భాష అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువనో, ఉపాధ్యాయుల కొరత ఉందనో రాష్ట్రంలోని కన్నడ మాధ్యమం పాఠశాలలను మూసేయబోమని భరోసా ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు తమ పిల్లలతో పాటు తామూ కన్నడంను నేర్చుకోవాలని ఉద్బోధించారు. ఇక్కడి సదుపాయాలను అనుభవిస్తూ స్థానిక భాషను నేర్చుకోమంటే ఎలాగని ఆయన నిలదీశారు.