ఎన్నాళ్లీ నిరీక్షణ?
- అమలుకు నోచుకోని ‘జ్యోతి సంజీవిని’
- నగదు రహిత వైద్య సేవల కోసంఎదురుచూపులు
- సీఎం ప్రకటించి ఎనిమిది నెలలైనా కార్యరూపం దాల్చని వైనం
సాక్షి,బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఆర్భాటంగా చేస్తున్న ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. దీని వల్ల ఆ పథకంపై ఆశలు పెట్టుకున్న లక్షల మంది ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇందుకు ‘జ్యోతి సంజీవిని’ మినహాయింపు కాదు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం శస్త్రచికిత్స జరిగిన సమయంలో వైద్య ఖర్చులను ప్రభుత్వ ఉద్యోగులు ఆస్పత్రికి మొదట చెల్లించి ఆపై ఆ మొత్తాన్ని పొందాల్సి ఉంటుంది (మెడికల్ రీ ఎంబర్స్ మెంట్). తమకు నగదు రహిత వైద్య సేవలు అందేలా నిబంధనల్లో మార్పుచేయాలని చాలా ఏళ్లుగా ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలను అందించే నిమిత్తం ‘జ్యోతి సంజీవిని’ పేరుతో నూతన పథకాన్ని అమలు చేస్తామని సిద్ధరామయ్య ఈ ఏడాది (2014-15) బడ్జెట్ లో ఆర్భాటంగా ప్రకటించారు.
30 లక్షల మంది ఎదురు చూపులు
ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 5,54,036 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ‘జ్యోతి సంజీవిని’ పథకం అనుసరించి ఉద్యోగి, అతని భాగస్వామి, తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలకు నగదు రహిత వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లెక్కన రాష్ట్రంలో సుమారు 30 లక్షల మందికి ఈ పథకం కింద ప్రయోజనం కలుగుతుంది.
బడ్జెట్ ప్రవేశపెట్టి ఇప్పటికి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా ఆ పథకం అమలుకు మాత్రం నోచుకోలేదు. ముఖ్యంగా గ్రూప్ సీ, డీ తదితర కిందిస్థాయి సిబ్బంది వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పథకం అమలు కోసం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆధార్ సంఖ్యను ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల శాఖకు అందించాల్సి ఉంటుంది. ఈ పనిని సిబ్బంది, పరిపాలన నిర్వహణ శాఖకు అప్పగించారు.
ఈ నేపథ్యంలో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు తమ ఆధార్ నంబర్‌ను నమోదు చేయించుకోవడానికి ముందుకు వస్తున్నా.. రేపు, ఎల్లుండి అని సంబంధిత అధికారులు తిప్పించుకుంటున్నారని రాష్ట్ర ఉద్యోగ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ‘జ్యోతి సంజీవిని’ అమలు కోసం ఏర్పాటు చేసిన సువర్ణ ఆరోగ్య సురక్ష ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బోరేగౌడ మాట్లాడుతూ... ‘జ్యోతి సంజీవిని పనులు కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. మానవ వనరుల కొరత, సాంకేతిక ఇబ్బందుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. త్వరలో పథకాన్ని అమలు చేస్తాం’ అని తెలిపారు.