సాక్షి, హైదరాబాద్: దేశ బడ్జెట్ రూ. లక్షల కోట్లు ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్‌వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడికి అత్యాధునిక వైద్య సేవలు అందినప్పుడే ఆరోగ్య భారతం సాకారమవుతుందన్నారు. అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌పీఐ) ఆధ్వర్యంలో ‘ప్రివెంటివ్ కేర్ ఇన్ క్లినికల్ ప్రాక్టీస్–రోల్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజీషియన్స్’అంశంపై శనివారం హైదరాబాద్‌లో సదస్సు జరిగింది.
ఏఎఫ్‌సీఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సుకు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దేశ జనాభా పెరుగుతోందని, అందుకు తగ్గట్లుగా వైద్యులు తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఏటా సగటున లక్ష మంది డాక్టర్లుగా పట్టాలు పొందుతున్నారన్నారు. కోవిడ్ వ్యాప్తి తర్వాత ప్రజల జీవన వ్యయం పెరిగిందని, ఈ క్రమంలో వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగాయని వివరించారు.
అదేవిధంగా కొన్నిచోట్ల ప్రజల ఆలోచన విధానం కూడా మారిందని, ఒక వైద్యుడు రోగిని పరిశీలించి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా స్పష్టత ఇచ్చినప్పటికీ రోగి సంతృప్తి చెందడం లేదన్నారు. కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి వివిధ రకాల పరీక్షలు చేయించు కున్నాక సంతృప్తి చెందే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ తరహా వైఖరిని మార్చే అవకాశం ఫ్యామిలీ డాక్టర్‌కే ఉంటుందని, వారు రోగులకు ధైర్యం చెప్పాలని సూచించారు. అప్పుడు కార్పొరేటు ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కొన్నిచోట్ల వైద్యులు నాడి పట్టకుండా ప్రిస్క్రిప్షన్ రాసి పంపిస్తున్న ఘటనలు ఉన్నాయని, అలాంటి వైఖరి కూడా సరికాదన్నారు.
వైద్యవిద్య ఖర్చుతో కూడుకున్నదే...
వైద్యవిద్యపట్ల ఆసక్తి ఉన్నప్పటికీ చాలా మంది ఈ రంగాన్ని ఎంచుకోవడంలో ఆసక్తి చూపడం లేదని జస్టిస్ ఎన్‌వీ రమణ అభిప్రాయపడ్డారు. వైద్యవిద్య ఖర్చుతో కూడుకున్నదని, అదేవిధంగా సుదీర్ఘకాలంపాటు చదువు కొనసాగించాల్సి వస్తుందని, కోర్సు పూర్తయ్యాక ప్రాక్టీసు పెట్టుకోవడం, స్థిరపడటానికి సైతం ఎక్కువ సమయం పడుతోందని... ఇదంతా ఆలోచించి ఈ రంగానికి పరిమిత సంఖ్యలోనే ఆసక్తి కనబరుస్తున్నారన్నారు.
కోవిడ్ సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది చేసిన సేవలు అత్యంత గొప్పవని ఎన్‌వీ రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎఫ్‌పీఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రమణ్‌కుమార్, ఏపీ చాప్టర్ అధ్యక్షురాలు డాక్టర్ మల్లీశ్వరమ్మ, తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment