= సంతోష్ లాడ్‌ను బర్తరఫ్ చేయాల్సిందే : బీజేపీ
= లేకుంటే ఆందోళన ఉధృతం
= వచ్చే నెల 16న బెంగళూరులో ‘నమో’ సభ
= బహిరంగ సభకు రూ.10 చొప్పున ప్రవేశ రుసుం
= ఈ సభకు ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశం
= ఇతర జిల్లాల్లోనూ మోడీ సభలు
= 28న వ్యవసాయ రుణ మాఫీపై ఆందోళన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌లో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలను ఎదుర్కొంటున్న మంత్రి సంతోష్ లాడ్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమ మైనింగ్ విషయంలో ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్‌ను.. అదే ఆయుధంతో ఇరుకున పెట్టడంలో రాష్ట్ర శాఖ విఫలమైందని అధిష్టానం అసంతృప్తిగా ఉందని తెలియడంతో రాష్ట్ర నాయకులు ఆందోళనల కార్యక్రమాలను సిద్ధం చేశారు.
మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరి గిన కోర్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించారు. బీజేపీ హయాంలో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన మాదిరే సంతోష్ లాడ్‌ను బర్తరఫ్ చేయాలంటూ పోరాటాలు ఉధృతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల 16న బెంగళూరులో పాల్గొనే బహిరంగ సభకు రూ.10 చొప్పున ప్రవేశ రుసుంను వసూలు చేయాలని తీర్మానించారు. ఈ సభకు ఐదు లక్షల మంది హాజరు కావచ్చని అంచ నా వేశారు.
భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశాలున్నందున ప్యాలెస్ మైదానం కంటే నగరం వెలుపల సభను నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇంకా దావణగెరె, హుబ్లీ, బెల్గాం, కొప్పళ, శివమొగ్గ, మైసూరు, మంగళూరు జిల్లాల్లో కూడా మోడీ సభలను నిర్వహించే అవకాశాలపై సమాలోచనలు జరిపారు. సమావేశంలో పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ సీఎలు సదానంద గౌడ, శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎంలు కేఎస్. ఈశ్వరప్ప, అశోక్ పాల్గొన్నారు.
ఆందోళనలు : సమావేశం అనంతరం జోషి విలేకరులతో మాట్లాడుతూ.. జగదీశ్ శెట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రుణ మాఫీ చేశారని గుర్తు చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఇంకా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. దీనికి నిరసనగా ఈ నెల 28న రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.