Santosh Lad
-
మర్మమేమిటో ? !
జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా సంతోష్‌లాడ్ నియామకంపై సర్వత్రా చర్చ కాంగ్రెస్ తీరుపై విమర్శల వెల్లువ బళ్లారి : బీజేపీ ప్రభుత్వ హయాంలో బళ్లారి జిల్లాలో అక్రమ గనుల తవ్వకాలు సాగుతున్నాయని అప్పటి ప్రతిపక్ష నేత సిద్దరామయ్య బెంగళూరు నుంచి బళ్లారి వరకు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ గనులు తవ్వకాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంతోష్‌లాడ్‌కు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా ఏకంగా బళ్లారి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నియమించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బళ్లారి జిల్లా సండూరుకు చెందిన సంతోష్‌లాడ్‌కు సండూరులో వీఎస్ లాడ్ అండ్ కంపెనీలో భాగస్వామి. ఆయనకు సండూరులో అపారమైన గనుల నిల్వలు ఉన్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి, పోరాటం చేసి, అధికారంలోకి వచ్చాక అక్రమ గనులు తవ్వకాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంతోష్‌లాడ్‌కు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా కేబినెట్ హోదా కల్పించడంతో పాటు బళ్లారి జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా నియమించడంతో కాంగ్రెస్ పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో 2013లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకివచ్చాక సిద్దరామయ్య మంత్రివర్గంలో సంతోష్‌లాడ్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. తర్వాత ఆయనపై అక్రమ గనుల తవ్వకాలు చేపట్టారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో మంత్రి పదవి నుంచి ఆరు నెలలకే తప్పించారు. ప్రస్తుతం సీఎం మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టడంతో బళ్లారి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న పరమేశ్వర్ నాయక్‌ను తప్పించి, ఆయన స్థానంలో సంతోష్ లాడ్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. పరమేశ్వర్ నాయక్ నిర్వహిస్తున్న కార్మిక శాఖనే సంతోష్ లాడ్‌కు అప్పజెప్పడంతో పాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నియమించడంతో గమనార్హం. అధికారంలో లేనప్పుడు పదే పదే అక్రమ గనుల తవ్వకాలపై ఆరోపణలు గుప్పి ంచిన సిద్దూ అధికారంలోకి వచ్చాక చేసిందేమిటని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బళ్లారి జిల్లాలో సీనియర్లతో పాటు యువ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే నిజాయితీ పరులుకు మంత్రి గిరి ఇవ్వక పోవడంతో అక్రమార్కుల కు జిల్లా ఇన్చార్జి మంత్రి పదవి కట్టబెట్టారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి -
మిగిలిన వారిమాటేమిటి?
= అవినీతిపై కాంగ్రెస్ పెద్దలను నిలదీసిన దేవెగౌడ = 28 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగానే పోటీ = డిసెంబర్లో అభ్యర్థుల జాబితా సాక్షి, బెంగళూరు : అక్రమ గనుల తవ్వకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంతోష్‌లాడ్‌ను మంత్రిపదవి నుంచి తొలగించి.... ఇక పార్టీలోని నాయకులంతా సచ్చీలురని కాంగ్రెస్నాయకులు భావిస్తుండటం తగదని మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ అన్నారు. బెంగళూరులోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కనకపుర, మైసూరు, చామరాజనగర తదితర నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికీ భూ కబ్జాలు, గనుల తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ తంతంగం వెనకాల ఏ నాయకుడు ఉన్నాడో, ఆయనకు సహకరిస్తున ్న ప్రభుత్వ అధికారుల గురించి ప్రభుత్వానికి తెలియదా అని నిలదీశారు. వారిపై చర్యలు తీసుకునే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. అక్రమ గనుల తవ్వకాలు, రవాణాకు సంబంధించి ప్రస్తుతం ఒక కంపెనీ, తొమ్మిది పోర్టులపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలోని మరిన్ని గనుల తవ్వకాలు, ఖనిజ రవాణా రంగంలో ఉన్న కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. వీటన్నింటిపై వెంటనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ‘జేడీఎస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సిద్ధరామయ్య ఇదే కార్యాలయంలో కూర్చొని అక్రమంగా భూ కబ్జాలకు పాల్పడిన వారిని విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయడానికి అధికారాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారి వివ రాలన్నీ ఏ.టీ రామస్వామి, బాలసుబ్రమణ్యంలు తమ నివేదికలో ప్రభుత్వానికి అందించారు. అలాంటప్పుడు భూ కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధరామయ్య మీనమేషాలు వేయడం ఎందుకో’ అని ఎద్దేవా చేశారు. చట్టాలు, శాసనాల ద్వారా ప్రజల నమ్మకాలను, భావాలను రద్దు చేయాలనుకోవడం వృథా ప్రయాస అన్నారు. ఇలాంటి వాటి కోసం సమయాన్ని వృథా చేయకుండా ప్రజలకు పనికొచ్చే వాటిపై దృష్టి సారించాలని సిద్ధరామయ్యకు సూచించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ ఒంటరిగానే పోటీచేస్తుందని... ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని మీడియా సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు ఏ.కృష్ణప్ప స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 28 పార్లమెంటు స్థానాలలో బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. అభ్యర్థుల వివరాలను డిసెంబర్ రెండు లేదా మూడో వారంలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. జేడీఎస్ పదాధికారుల ఎంపిక... జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడ అధ్యక్షతన నిర్వహించిన సవ ూవేశంలో జేడీఎస్ పదాధికారులను ఎంపిక చేశారు. జేడీఎస్ పార్టీ జాతీయ వ్యవహారాల సమితి అధ్యక్షుడిగా హెచ్.కె.కుమారస్వామి, పార్లమెంట్ మండలి అధ్యక్షుడిగా నీరావ రి, పార్టీ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అజీమ్‌లు ఎంపికయ్యారు. ఇక పార్టీ కార్యాధ్యక్షుడిగా బసవరాజ్.ఎస్.హొరట్టి, ఎన్.చలువరాయ స్వామి, బి.బి.నింగయ్య, శారదా పూర్వనాయక్, ఎం.ఎస్.నారాయణ రావ్, సునీల్ హెగ్డే, ఫిలోమిన్ వినిమోళ్, మహంతేష్లు ఎంపికయ్యారు. -
పోరుకు సిద్ధం!
= రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు = విమర్శనాస్త్రాలను సిద్ధం చేసుకున్న విపక్షాలు = ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలను ఎండగట్టేలా వ్యూహాలు = సంతోష్ లాడ్‌పై చర్యలకు ఒత్తిడి తెచ్చే అవకాశం = బెల్గాంలో ఇది నాలుగో సమావేశం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెల్గాంలో సోమవారం నుంచి శాసన సభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశముంది. ఇప్పటికే విపక్షాలు ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను ప్రయోగించడానికి సిద్ధం చేసుకున్నాయి. ఈ ఆరు నెలల పాలనలో ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను ఎండగట్టడానికి పూనుకున్నాయి. సంతోష్ లాడ్‌ను మంత్రి పదవి నుంచి తప్పించినా.. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నాయి. పథకాలలో చోటుచేసుకున్న అవినీతిపై నిలదీయనున్నాయి. భారీ భద్రత.. బెల్గాంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న శాసన సభ శీతాకాల సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలపై చర్చించడానికి ఎక్కువ అవకాశం కల్పిస్తామని శాసన మండలి చైర్మన్ డీహెచ్. శంకరమూర్తి తెలిపారు. శనివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పది రోజుల పాటు సమావేశాలు జరుగుతాయన్నారు. మొత్తం 1,150 ప్రశ్నలకు అవకాశం కల్పించనున్నామన్నారు. మహారాష్ట్రలోని మరాఠీ రెజిమెంట్‌కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో శాసన సభ సమావేశాల్లో పాల్గొనే సభ్యులకు పూర్తి భద్రతను కల్పించాల్సిందిగా సూచించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికార పక్షంగా.... బెల్గాంలో ఈసారి నాలుగో సమావేశాలు జరుగనున్నాయి. 1952 నుంచి ఇప్పటి వరకు మొత్తం 61 ఏళ్లకు గాను కాంగ్రెస్ 43 సంవత్సరాలు అధికారంలో ఉంది. కేవలం 18 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించిన విపక్షాలు బెల్గాంలో గత మూడు సమావేశాల్లో అధికార పార్టీలుగా ఉంటూ వచ్చాయి. 2005లో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్గాంలో శాసన సభ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. అప్పట్లో ధరం సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే జేడీఎస్ మద్దతు ఉపసంహరణతో ఆయన నాయకత్వంలోని సంకీర్ణ సర్కారు కుప్పకూలింది. తదనంతరం జేడీఎస్-బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి 2006 డిసెంబరు 25 నుంచి ఐదు రోజుల పాటు బెల్గాంలోని కేఈఎల్ సంస్థకు చెందిన జవహర్లాల్ నెహ్రూ వైద్య కళాశాలలో తొలి సమావేశాలను నిర్వహించారు. అనంతరం 2009 జనవరి 16 నుంచి అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఐదు రోజులు, గత ఏడాది డిసెంబరు ఐదో తేదీ నుంచి పది రోజుల పాటు జగదీశ్ శెట్టర్లు సమావేశాలను నిర్వహించారు. ఈ మూడు పర్యాయాలు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు అధికారం పక్షంగా మారింది. -
లాడ్ రాజీనామా
= అక్రమ మైనింగ్ ఎఫెక్ట్.. = ప్రైవేట్ కారులో సీఎం నివాసానికి = 20 నిమిషాల పాటు చర్చలు = రాజీనామా అనివార్యతను వివరించిన సీఎం = విపక్షాలకు అవకాశం ఇవ్వరాదని ఇతర మంత్రుల ఒత్తిళ్లు = పదవిని కాపాడుకోడానికి లాడ్ తుదివరకూ యత్నం = సిద్ధు నిర్ణయమే ఫైనలని తేల్చిచెప్పిన అధిష్టానం = రాజీనామా చేయబోనని సాయంత్రం ప్రకటన = పార్టీకి ఇబ్బంది కలగరాదని రాత్రికి రాజీనామా సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర సమాచార, ప్రాథమిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి సంతోష్ లాడ్ శుక్రవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆయన నివాసంలో కలుసుకుని రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘నా ఇష్ట ప్రకారమే రాజీనామా చేశాను. పార్టీకి ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇందులో ఎవరి ప్రమేయం లేదు’ ఆని అన్నారు. కాగా అక్రమ మైనింగ్‌లో ఆయన భాగస్వామిగా ఉన్న సంస్థకు ప్రమేయం ఉందంటూ సామాజికవేత్తలు హీరేమఠ్. అబ్రహాంలు పదే పదే ఆరోపణలు చేయడమే కాకుండా పలు సాక్ష్యాధారాలను విడతల వారీగా విడుదల చేశారు. వాటినన్నిటినీ గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్‌కు కూడా అందజేశారు. వీటిని గవర్నర్ ముఖ్యమంత్రికి పంపించడంతో లాడ్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం సాయంత్రం లాడ్ ప్రైవేట్ కారులో సీఎం సిద్ధరామయ్య నివాసానికి వెనుక ద్వారం నుంచి వచ్చారు. 20 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. రాజీనామా చేయాల్సిన అనివార్యతను ముఖ్యమంత్రి ఆయనకు వివరించడంతో మానసికంగా సిద్ధమై వెనుదిరిగారు. సంతోష్ లాడ్‌ను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు అదే పనిగా ఆరోపణలు సంధిస్తుండడంతో ఆయన చేత రాజీనామా చేయంచాలని మంత్రి వర్గ సహచరులు సైతం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చారు. బెల్గాంలో సోమవారం నుంచి శాసన సభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నందున, ప్రతిపక్షాల చేతికి ఆయుధం అందించరాదని కోరారు. దీంతో ఆయన గురువారం రాత్రే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని లాడ్‌కు సూచనలు పంపారు. అధిష్టానంలోని తన గాడ్ ఫాదర్ల ద్వారా పదవిని కాపాడుకోవడానికి లాడ్ తుదికంటా ప్రయత్నించారు. అయితే ఈ విషయంలో అంతిమ అధికారం ముఖ్యమంత్రిదేనని అధిష్టానం తేల్చి చెప్పడంతో లాడ్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేశారు. లాడ్ అక్రమాలకు పాల్పడ లేదంటూ ముఖ్యమంత్రి పదే పదే వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశారు. లాడ్ రాజీనామా చేయకపోతే శీతాకాల సమావేశాలను సజావుగా సాగనివ్వబోమని బీజేపీ హెచ్చరించింది. రాజీనామా చేసేది లేదు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజీనామా లేఖను సమర్పించడానికి కొన్ని నిమిషాల ముందు లాడ్ విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను తప్పు చేయలేదని, కనుక రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనను రాజీనామా చేయాలని ఎవరూ సూచించ లేదని తెలిపారు. మరో సారి ముఖ్యమంత్రిని కలుసుకుని చర్చిస్తానని ఆయన వెల్లడించారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్‌ను కలుసుకున్న అనంతరం లాడ్ ఈ విధంగా మాట్లాడడం చర్చనీయాంశమైనా, లాడ్ రాజీనామా లేఖను సమర్పించడం ద్వారా డ్రామాకు తెర దించారు. -
సిద్ధు పదవికి ఎసరు!
ఖర్గే ఆవేదన = సిద్దయ్య పాలన బాగుంది = అతన్ని పదవీచ్యుతున్ని చేసేలా కుట్రలు = నేను ఎవరిపైనా ఆరోపణలు చేయను = అయితే.. ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి = ఆయనకు మంత్రులు, పార్టీ నాయకులు సహకరించాలి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ఉత్తమ పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవీచ్యుతుని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పరిణామం కాదని హితవు పలికారు. యువజన కాంగ్రెస్ శుక్రవారం ఇక్కడ తన నివాసంలో సన్మానించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్ధరామయ్యను పదవీచ్యుతుని చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారని అడిగినప్పుడు, ఆయన నేరుగా సమాధానం చెప్పడానికి నిరాకరించారు. పాలక, ప్రతిపక్షాల్లోని వారు ఆయనను పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిర్దుష్టంగా తాను ఎవరి పైనా ఆరోపణలు చేయలేనని అన్నారు. అయితే ఇలాంటి ప్రయత్నాలు మంచివి కావన్నారు. జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. ముఖ్యమంత్రి తన పరిధిలో ఉత్తమ పనులు చేస్తున్నారని, మంచి పాలనను అందిస్తున్నారని కితాబునిచ్చారు. ఆయనకు మంత్రులు, పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. కాగా మంత్రి సంతోష్ లాడ్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలన్న డిమాండ్‌పై తాను కొత్తగా చెప్పేదేమీ లేదన్నారు. రాష్ట్రంలో రైల్వే పథకాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. రాష్ర్టం వాటా 50 శాతం నిధులను ఇవ్వడానికి ముఖ్యమంత్రి సమ్మతించారని చెప్పారు. ప్రత్యేక హోదా పొందిన హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసే నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి సంతకం చేసినందున, ఆ ప్రాంత అభివృద్ధికి పచ్చ జెండా ఊపినట్లయిందని ఆయన అన్నారు. -
లాడ్ బర్తరఫ్ వ్యవహారం సీఎం పరిధిలో ఉంది
సాక్షి, బెంగళూరు : అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాచార శాఖ మంత్రి సంతోష్‌లాడ్‌ను మంత్రిమండలి నుంచి తొలగించడమా లేదా కొన సాగించడమా అన్న విషయం ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ స్పష్టం చేశారు. బెంగళూరు శివారులోని జక్కూరు వైమానిక స్థావరంలో సోమవారం జరిగిన ఎన్సీసీ జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. సంతోష్‌లాడ్‌పై ఉన్న ఆరోపణలకు సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మాట్లాడుతున్నానన్నారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించి తనకు అందిన ఆధారాలన్నీ సీఎంకు అందజేసానన్నారు. ఈ విషయంలో తన పరిధి మేరకు నడుచుకుంటున్నానన్నారు. ఇక సంతోష్‌లాడ్‌ను మంత్రి స్థానంలో కొనసాగించడమా లేదా అన్నది సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమగనుల తవ్వకాలతో పాటు అవినీతి అక్రమాలు తగ్గాయని భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా గనుల తవ్వకాలకు పాల్పడిన వారి విషయమై ఒత్తిళ్లకు లొంగకుండా సీబీఐ చేస్తున్న దర్యాప్తు శ్లాఘనీయమన్నారు. 2014 వరకూ తాను గవర్నర్‌గా కర్ణాటకలోనే కొనసాగుతానని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు భరద్వాజ్ సమాధానమిచ్చారు. అంతకు మందు జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ... యువత రాజకీయాల్లోకి రావడం కంటే త్రివిధ దళాల్లోకి చేరడం ఉత్తమమన్నారు. అమెరికా, యూరప్‌కు దీటుగా సైనిక సంపత్తిను పెంచుకోవాలంటే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పాటు ఉత్తమ మానవ వనరులు కూడా అవసరమన్నారు. అందువల్ల యువత పెద్ద సంఖ్యలో సైన్యంలో చేరడానికి ముందుకు రావాలన్నారు. -
రాజీనామాపైరాజీలేని పోరు
= సంతోష్ లాడ్‌ను బర్తరఫ్ చేయాల్సిందే : బీజేపీ = లేకుంటే ఆందోళన ఉధృతం = వచ్చే నెల 16న బెంగళూరులో ‘నమో’ సభ = బహిరంగ సభకు రూ.10 చొప్పున ప్రవేశ రుసుం = ఈ సభకు ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశం = ఇతర జిల్లాల్లోనూ మోడీ సభలు = 28న వ్యవసాయ రుణ మాఫీపై ఆందోళన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌లో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలను ఎదుర్కొంటున్న మంత్రి సంతోష్ లాడ్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమ మైనింగ్ విషయంలో ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్‌ను.. అదే ఆయుధంతో ఇరుకున పెట్టడంలో రాష్ట్ర శాఖ విఫలమైందని అధిష్టానం అసంతృప్తిగా ఉందని తెలియడంతో రాష్ట్ర నాయకులు ఆందోళనల కార్యక్రమాలను సిద్ధం చేశారు. మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరి గిన కోర్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించారు. బీజేపీ హయాంలో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన మాదిరే సంతోష్ లాడ్‌ను బర్తరఫ్ చేయాలంటూ పోరాటాలు ఉధృతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల 16న బెంగళూరులో పాల్గొనే బహిరంగ సభకు రూ.10 చొప్పున ప్రవేశ రుసుంను వసూలు చేయాలని తీర్మానించారు. ఈ సభకు ఐదు లక్షల మంది హాజరు కావచ్చని అంచ నా వేశారు. భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశాలున్నందున ప్యాలెస్ మైదానం కంటే నగరం వెలుపల సభను నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇంకా దావణగెరె, హుబ్లీ, బెల్గాం, కొప్పళ, శివమొగ్గ, మైసూరు, మంగళూరు జిల్లాల్లో కూడా మోడీ సభలను నిర్వహించే అవకాశాలపై సమాలోచనలు జరిపారు. సమావేశంలో పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ సీఎలు సదానంద గౌడ, శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎంలు కేఎస్. ఈశ్వరప్ప, అశోక్ పాల్గొన్నారు. ఆందోళనలు : సమావేశం అనంతరం జోషి విలేకరులతో మాట్లాడుతూ.. జగదీశ్ శెట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రుణ మాఫీ చేశారని గుర్తు చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఇంకా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. దీనికి నిరసనగా ఈ నెల 28న రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. -
సీఎం గారూ..ఆధారాలివిగో
= ఇప్పటికైనా కేబినెట్ నుంచి సంతోష్‌లాడ్‌ను తొలగించండి = ఆయన భాగస్వామిగా ఉన్న వీఎస్లాడ్ మైనింగ్ సంస్థపై కేసులు = ఖనిజాన్ని అక్రమంగా తవ్వుకున్నారు = సీజ్ చేసిన ఖనిజాన్నీ రవాణా చేశారు = 68 ఎకరాల అటవీ భూమినీ కబ్జా చేశారు = ఎఫ్ఓసీలను విడుదల చేసిన హీరేమఠ్ సాక్షి, బెంగళూరు : రాష్ట్ర సమాచార శాఖ మంత్రి సంతోష్‌లాడ్‌కు అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో భాగం ఉందని, అందువల్ల ఆయన్ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని నేషనల్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్(ఎన్సీపీఎన్ఆర్) సంస్థ అధ్యక్షుడు హీరేమఠ్ డిమాండ్ చేశారు. ఆ మంత్రి అక్రమలకు పాల్పడ్డారనే ఆధారాలేవీ లేనందున చర్యలు తీసుకోవడం లేదంటూ ముఖ్యమంత్రి చెబుతున్నారని, అందుకే పూర్తి ఆధారాలు సేకరించానని ఆయన వివరించారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీఎస్లాడ్ సంస్థపై అటవీశాఖలో నమోదైన కేసులు, అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు, సీఈసీ సుప్రీం కోర్టుకు అందజేసిన నివేదిక తదితర పత్రాలను ఆయన మీడియా ప్రతినిధులకు అందజేశారు. అనంతరం హీరేమఠ్ మాట్లాడుతూ... సంతోష్‌లాడ్ భాగస్వామిగా ఉన్న వీఎస్ లాడ్ అండ్ సన్స్ మైనింగ్ సంస్థ ప్రభుత్వం కేటాయించిన దాని కంటే 80 వేల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని అక్రమంగా తవ్వడమే కాక దాదాపు 68 ఎకరాల అటవీ భూమిని అక్రమంగా ఆక్రమించుకుందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి అటవీశాఖలో 2009 ఫిబ్రవరిలో ఒక కేసు, 2010 ఆగస్టులో మరో కేసు నమోదైందని తెలిపారు. 2009లో అటవీశాఖ సీజ్ చేసిన 81 వేల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని కూడా వీఎస్ లాడ్ సంస్థ తిరిగి అక్రమంగా రవాణా చేసిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తాను సేకరించానని చెప్పారు. అంతేకాక ఫిబ్రవరి 2012లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) సుప్రీం కోర్టుకు అందించిన నివేదికలోనూ వీఎస్ లాడ్ అండ్ సన్స్ సంస్థ మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడిందని అందుకే సీ-కేటగిరిలో చేర్చాలని సుప్రీం కోర్టును కోరిందని అన్నారు. ఇలా అనేక విధాలుగా అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వీఎస్ లాడ్ అండ్ సన్స్ సంస్థలో భాగస్వామి అయిన మంత్రి సంతోష్‌లాడ్‌ను తక్షణమే పదవి నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను డిమాండ్ చేశారు.