= ఇప్పటికైనా కేబినెట్ నుంచి సంతోష్‌లాడ్‌ను తొలగించండి
= ఆయన భాగస్వామిగా ఉన్న వీఎస్‌లాడ్ మైనింగ్ సంస్థపై కేసులు
= ఖనిజాన్ని అక్రమంగా తవ్వుకున్నారు
= సీజ్ చేసిన ఖనిజాన్నీ రవాణా చేశారు
= 68 ఎకరాల అటవీ భూమినీ కబ్జా చేశారు
= ఎఫ్‌ఓసీలను విడుదల చేసిన హీరేమఠ్
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర సమాచార శాఖ మంత్రి సంతోష్‌లాడ్‌కు అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో భాగం ఉందని, అందువల్ల ఆయన్ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని నేషనల్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్(ఎన్‌సీపీఎన్‌ఆర్) సంస్థ అధ్యక్షుడు హీరేమఠ్ డిమాండ్ చేశారు. ఆ మంత్రి అక్రమలకు పాల్పడ్డారనే ఆధారాలేవీ లేనందున చర్యలు తీసుకోవడం లేదంటూ ముఖ్యమంత్రి చెబుతున్నారని, అందుకే పూర్తి ఆధారాలు సేకరించానని ఆయన వివరించారు.
బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీఎస్‌లాడ్ సంస్థపై అటవీశాఖలో నమోదైన కేసులు, అందుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లు, సీఈసీ సుప్రీం కోర్టుకు అందజేసిన నివేదిక తదితర పత్రాలను ఆయన మీడియా ప్రతినిధులకు అందజేశారు. అనంతరం హీరేమఠ్ మాట్లాడుతూ... సంతోష్‌లాడ్ భాగస్వామిగా ఉన్న వీఎస్ లాడ్ అండ్ సన్స్ మైనింగ్ సంస్థ ప్రభుత్వం కేటాయించిన దాని కంటే 80 వేల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని అక్రమంగా తవ్వడమే కాక దాదాపు 68 ఎకరాల అటవీ భూమిని అక్రమంగా ఆక్రమించుకుందని ఆరోపించారు.
ఇందుకు సంబంధించి అటవీశాఖలో 2009 ఫిబ్రవరిలో ఒక కేసు, 2010 ఆగస్టులో మరో కేసు నమోదైందని తెలిపారు. 2009లో అటవీశాఖ సీజ్ చేసిన 81 వేల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని కూడా వీఎస్ లాడ్ సంస్థ తిరిగి అక్రమంగా రవాణా చేసిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తాను సేకరించానని చెప్పారు.
అంతేకాక ఫిబ్రవరి 2012లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) సుప్రీం కోర్టుకు అందించిన నివేదికలోనూ వీఎస్ లాడ్ అండ్ సన్స్ సంస్థ మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడిందని అందుకే సీ-కేటగిరిలో చేర్చాలని సుప్రీం కోర్టును కోరిందని అన్నారు. ఇలా అనేక విధాలుగా అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వీఎస్ లాడ్ అండ్ సన్స్ సంస్థలో భాగస్వామి అయిన మంత్రి సంతోష్‌లాడ్‌ను తక్షణమే పదవి నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను డిమాండ్ చేశారు.
సీఎం గారూ..ఆధారాలివిగో
Published Thu, Oct 10 2013 3:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement
Advertisement